Begin typing your search above and press return to search.

2019 కాంగ్రెస్ ను నిరాశ పరిచిన సంవత్సరం

By:  Tupaki Desk   |   27 Dec 2019 4:38 AM GMT
2019 కాంగ్రెస్ ను నిరాశ పరిచిన సంవత్సరం
X
కాలం కరిగి పోయింది.. 2019 ముగియడానికి ఇంకా ఎన్నో రోజులు లేవు. కాలచక్రం గిర్రన తిరగబోతోంది. ఈ ఏడు ఏ రాజకీయపార్టీకి కలిసివచ్చింది. ఎవరికి పీడకలను మిగిల్చిందో తెలుసుకుందాం..

*కాంగ్రెస్ కు కలిసిరాని 2019
2019 సంవత్సరాన్ని తెలంగాణ కాంగ్రెస్ తొందరగా మరిచి పోవాలనుకుంటోంది. ఈ సంవత్సరం కాంగ్రెస్ పార్టీకి అస్సలు కలిసిరాలేదు. వరుస ఓటములు.. వైఫల్యాలు.. అపజయాలను 2019 సంవత్సరం మిగిల్చింది. కాంగ్రెస్ నేతలు ఈ ఏడు కలిసి పని చేయడానికి బదులు.. నాయకుల అంతర్గత గొడవలు.. తమలో తాము గొడవపడి.. అభాసుపాలయ్యారు. కేసీఆర్ ఎత్తుల జిత్తుల్లో కాంగ్రెస్ కుదేలైంది. ఆ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు హ్యాండ్ ఇచ్చి టీఆర్ఎస్ లో చేరారు. పీసీసీ చీఫ్ సొంత ఇలాఖాలో ఓటమితో నిస్సహాయంగా మారిపోయారు. మొత్తం 2020లోనైనా కాంగ్రెస్ ఏమేరకు పుంజుకుంటుందనేది వేచిచూద్దాం..

*పరాజయాల పరంపర
2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. పట్టుమని 20 సీట్లు కూడా సాధించలేకపోయింది. దానిలో 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ నుంచి తప్పుకొని గులాబీ పార్టీ లో చేరి పోయారు. ఏకంగా కాంగ్రెస్ సీఎల్పీనే టీఆర్ఎస్ లో విలీనమై పోయింది. కాంగ్రెస్ కు ఇప్పుడు కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలి ఉన్నారు. ఈ ఆరుగురిలో మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజ గోపాల్ రెడ్డి పార్టీ నాయకత్వాన్ని విమర్శిస్తున్నారు. బీజేపీ అనుకూల ప్రకటనలు చేస్తూ ఎప్పుడు కప్పదాటుతాడో తెలియని పరిస్థితి నెలకొంది. ఇక కాంగ్రెస్ ను వలసలు మరింత కృంగదీశాయి. దిగ్గజ కాంగ్రెస్ నేతలైన డీకే అరుణ, సునీత లక్ష్మారెడ్డి, కేఆర్ సురేష్ రెడ్డి సహా పలువురు నాయకులు పార్టీని వీడారు.

*ఊపిరి పోసిన లోక్ సభ ఎన్నికలు..
తెలంగాణ లో జరిగిన పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క జిల్లా పరిషత్ ను కూడా గెలవలేక ఘోర పరాభావాన్ని చవిచూసింది. ఇక పంచాయతీ ఎన్నికల్లో కాసిన్ని చేజిక్కించుకుంది. కానీ ఇప్పటికీ గులాబీ ఆధిపత్యమే పల్లెల్లో కనిపిస్తోంది. అయితే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కొంచెం మెరుగ్గా రాణించింది. మూడు ఎంపీ సీట్లను గెలుచుకొని.. మరో రెండు సీట్లలో రెండో స్థానంలో నిలిచి కోలుకుంది. ఇక చాలా ఎంపీ నియోజకవర్గాల్లో డిపాజిట్ కోల్పోయి అవమానాలపాలైంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యే ఎన్నికల్లో జీవన్ రెడ్డి గెలిచి కాంగ్రెస్ కు ఊపిరి పోశారు. ఇక ప్రతిష్టాత్మక మైన హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో ఓడి పోయి పీసీసీ చీఫ్ ఉత్తమ్ ఘోర పరాభావాన్ని చవిచూశారు.

*చచ్చు బడిపోయిన కాంగ్రెస్
2019 ఏడాది పొడవునా కాంగ్రెస్ పార్టీ ఒక్క విజయవంతమైన పోరాటాన్ని కానీ.. రాష్ట్రంలో ఒక్క ప్రజా ఆందోళనల్లో కానీ చురుగ్గా పాల్గొన లేకపోయింది.. ఆర్టీసీ సమ్మెలోనూ మద్దతు ఇచ్చి చివరి వరకూ నిలబడ లేకపోయింది. రేవంత్ పోరాడినా సొంత కాంగ్రెస్ వాళ్లు మోకాలడ్డిన పరిస్థితి. ఇప్పుడు 2020లో మున్సిపల్ ఎన్నికల రూపంలో ఓ కొత్త సవాల్ కాంగ్రెస్ పార్టీకి ఎదురుకాబోతోంది. మరి ఈ ఎన్నికల్లో కోల్పోయిన ప్రతిష్టను కాంగ్రెస్ గెలిచి కొంతైనా కాపాడుకుంటుందా? లేక 2020లోనూ అదే పరాజయాల పరంపరను కొనసాగిస్తుందా అనేది వేచిచూడాలి.