Begin typing your search above and press return to search.

సోషల్ మీడియా ‘రూ.2వేల నోటు’ లొల్లేంది?

By:  Tupaki Desk   |   8 Nov 2016 11:30 AM GMT
సోషల్ మీడియా ‘రూ.2వేల నోటు’ లొల్లేంది?
X
మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఒక పోస్టింగ్ పదే పదే దర్శనమిస్తోంది. పింక్ కలర్ తో బారుగా ఉన్న నోట్లకట్ట‌ దేశప్రజల్ని అమితంగా ఆకర్షిస్తోంది. ఇప్పటికే ఉన్నరూ.500.. రూ.వెయ్యి నోట్లను బ్యాన్ చేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా పలువురు ప్రముఖులు అదే పనిగా డిమాండ్ చేస్తున్న వేళ.. తాజాగా రూ.2వేల నోటు విడుదల కోసం కేంద్రం సన్నాహాలు చేస్తుందన్న వార్త బయటకు వచ్చింది.

ఈ వార్త వచ్చిందో లేదో.. గడిచిన మూడు రోజులుగా సోషల్ మీడియాలో త్వరలో వచ్చే రూ.2వేల నోటు ఇదేనంటూ కొత్త నోట్లకు సంబంధించిన బండిల్స్ ఫోటోలు ముంచెత్తుతున్నాయి. దీంతో.. ఫేస్ బుక్.. ట్విట్టర్.. వాట్సప్ లలో కొత్త నోటు మీద పోస్టుల మీద పోస్టులు వస్తున్న పరిస్థితి. సోషల్ మీడియాలో దర్శనమిస్తున్న రూ.2వేల నోటు నిజమైనదా? ప్రభుత్వం విడుదల చేయాలనుకుంటున్న నోటు ఇదేనా? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది.

సోషల్ మీడియాలో ఇంత హడావుడి జరుగుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదు. దీంతో.. ఈ నోటు అసలైనదో.. లేక నకిలీదన్న సంగతి తేలని అయోమయ పరిస్థితి. ఈ సస్పెన్స్ ఇలా కొనసాగుతుండగా.. తాజాగా ప్రభుత్వం త్వరలో విడుదల చేసే రూ2వేల నోటుకు సంబంధించిన ఆసక్తికర అంశాలు తెర మీదకు వస్తున్నాయి.

ఇప్పుడున్న పెద్ద నోట్లను మార్కెట్ నుంచి తొలగించటం ద్వారా బ్లాక్ మనీకి చెక్ చెప్పొచ్చన్న అభిప్రాయం వినిపిస్తున్న వేళ.. ఇప్పుడున్న నోట్ల కంటే విలువైన నోటును మార్కెట్లోకి కేంద్రం ఎందుకు తీసుకొస్తుందన్న సందేహానికి సమాధానంగా సరికొత్త సంగతులు బయటకు వస్తున్నాయి. దీని ప్రకారం.. కొత్తగా విడుదలయ్యే రూ.2వేల నోటులో నానో జీపీఎస్ చిప్ ఒకటి అమర్చనున్నట్లు తెలుస్తోంది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ టెక్నాలజీ పుణ్యమా అని రూ.2వేల నోటులో ఉన్న చిప్ సిగ్నల్ రిఫ్లెక్టర్ గా పని చేస్తుందని.. ఉపగ్రహాల నుంచి వచ్చే సంకేతాల్ని ఈ చిప్ అందుకుంటుందని తెలుస్తోంది. దీంతో.. ఇలాంటి నోట్లు భారీగా ఉన్న ప్రాంతం ఎక్కడున్నదన్నది తెలుసుకునే వీలు ఉంటుందని చెబుతున్నారు. సాంకేతికంగా ఈ నోటు ఎంత ఉన్నతమైనదంటే.. భూమి లోపల 400 అడుగుల లోతులో దాచి ఉంచినా ఈ నోటు ఉన్నది ఎక్కడన్నది తేలుతుందని.. ఈ కొత్త నోట్లను పెద్ద ఎత్తున అక్రమార్కులు దాచి ఉంచటం కష్టమన్న మాటను చెబుతున్నారు. అయితే.. ఇవన్నీ అంచనాలే కానీ అధికారిక వాస్తవాలు కావన్న సంగతి మర్చిపోకూడదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/