Begin typing your search above and press return to search.

చదువుల సంస్కరణ..ఇంజనీరింగ్ - డిగ్రీ కాలేజీలు బందే?

By:  Tupaki Desk   |   3 Nov 2019 12:07 PM IST
చదువుల సంస్కరణ..ఇంజనీరింగ్ - డిగ్రీ కాలేజీలు బందే?
X
ఆంధ్రప్రదేశ్ లో విద్యావ్యవస్థను గాడినపెట్టేందుకు ప్రభుత్వం కఠిన నిర్ణయాలకు సిద్దమవుతోంది. ఉన్నత విద్యపై ప్రొఫెసర్ బాలక్రిష్ణన్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికలో సంచలన సంస్కరణలు ప్రతిపాదించింది.

విద్యార్థుల ప్రవేశాలు తక్కువగా ఉన్న 200 ఇంజినీరింగ్ కాలేజీలు - 500 డిగ్రీ కాలేజీలు మూసివేయాలని ప్రొఫెసర్ బాలక్రిష్ణన్ సంస్కరణ కమిటీ సిఫార్సు చేసింది. 50 మంది కంటే విద్యార్థులు తక్కువ ఉన్న కాలేజీల్లో ప్రవేశాలు రద్దు చేసి ఉన్న కోర్సులను మూసివేయాలని స్పష్టం చేసింది.

రాష్ట్రంలోని 1153 ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో 25శాతం లోపు ప్రవేశాలున్నవి 464 ఉన్నాయని.. 287 ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో 50శాతమైన చేరనివి 185 ఉన్నాయని తెలిపింది. వీటన్నింటిని మూసివేయాలని అభిప్రాయపడింది.

ఇక ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో 40శాతం మంది విద్యార్థులు డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాయకున్నా ప్రభుత్వం నుంచి ఏటా స్కాలర్ షిప్ పొందుతున్నారని.. బోధన రుసుం కింద ప్రభుత్వం ఏటా 400 కోట్లు ఖర్చు చేస్తున్నా ఫలితం లేదని కమిటీ తేల్చింది.

ఇక నుంచి విద్యార్థుల ప్రతిభ (పాస్ అయితేనే) - 75శాతం కంటే ఎక్కువ హాజరు ఉంటేనే స్కాలర్ షిప్ లు చెల్లించాలని పేర్కొంది. ఇక రాష్ట్రంలోని 5 విశ్వవిద్యాలయాకు - విద్యా సంస్కరణలకు1749 కోట్లు అవసరం అని కమిటీ తేల్చింది. విశ్వవిద్యాలయాలు కొత్త కళాశాలలపై పరిశీలన చేయకుండానే నిరభ్యంతర పత్రాలు ఇచ్చేస్తున్నాయని ఈ పద్ధతి మారాలని కమిటీ సూచించింది.