Begin typing your search above and press return to search.

వంద‌ల కోట్ల న‌ష్టాన్ని మిగిల్చిన డేరా బాబా 'జైలుశిక్ష'

By:  Tupaki Desk   |   7 Sep 2017 9:37 AM GMT
వంద‌ల కోట్ల న‌ష్టాన్ని మిగిల్చిన డేరా బాబా జైలుశిక్ష
X
ఇద్ద‌రు సాధ్వీల‌పై జ‌రిపిన లైంగిక అత్యాచారం నేరంలో దోషిగా నిరూపిత‌మై.. జైలుశిక్ష అనుభ‌విస్తున్న గుర్మీత్ రామ్ ర‌హీమ్ బాబా అలియాస్ డేరా బాబా ప్ర‌స్తుతం జైల్లో ఊచ‌లు లెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న‌కు జైలుశిక్ష విధించిన స‌మ‌యంలో హ‌ర్యానా.. పంజాబ్ రాష్ట్రాల‌తో స‌హా ప‌లు రాష్ట్రాలు హింసాత్మ‌క చ‌ర్య‌ల‌తో అట్టుడికిపోవ‌టం తెలిసిందే.

గుర్మీత్‌ను దోషిగా నిర్ద‌రించిన సీబీఐ తీర్పుతో పెద్ద ఎత్తున ప్రాణ‌.. ఆస్తి న‌ష్టం వాటిల్లిన సంగ‌తి తెలిసిందే. 15 ఏళ్ల పాటు న‌డిచిన ఈ కేసు తీర్పు ఇటీవ‌ల రావ‌టం.. ఈ సంద‌ర్భంగా భారీగా అల్ల‌ర్లు చెల‌రేగాయి. ఇదిలా ఉంటే.. శిక్ష తీర్పు వెలువ‌డిన సంద‌ర్భంగా చెల‌రేగిన హింస కార‌ణంగా జ‌రిగిన న‌ష్టాన్ని అధికారులు లెక్క‌క‌ట్టారు. డేరాబాబాకు శిక్ష‌ను ఖ‌రారు చేసిన నేప‌థ్యంలో చోటు చేసుకున్న అల్ల‌ర్ల‌లో 32 మంది మ‌ర‌ణించ‌గా.. మొత్తం రూ.200 కోట్ల మేర ఆర్థిక న‌ష్టం వాటిల్లింద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఈ న‌ష్టం కేవ‌లం హ‌ర్యానా.. పంజాబ్ రాష్ట్రాల్లోనే చోటు చేసుకున్న‌ట్లుగా అధికారులు అంచ‌నాలు వేశారు.

ఆదాయ‌ప‌న్ను శాఖ కార్యాల‌యంతో పాటు ప‌లు ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌ను ఆందోళ‌న‌కారులు ధ్వంసం చేశారు. అయితే.. విధ్వంసం కార‌ణంగా జ‌రిగిన న‌ష్టాన్ని బాబా ఆస్తుల నుంచి రిక‌వ‌రీ చేయాల‌ని కోర్టు ఆదేశించ‌టం తెలిసిందే. ఇదిలా ఉంటే.. డేరా బాబాకు సంబంధించి మ‌రో షాకింగ్ అంశం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆయ‌న‌కున్న రెండు ఆశ్ర‌మాల్లోని ఒక ఆశ్ర‌మంలో (సిర్సాలోనిది) ఒక ర‌హ‌స్య త‌లుపును.. గుహ‌ను అధికారులు గుర్తించారు. బాలిక‌ల అల్మారాలో ఈ సీక్రెట్ త‌లుపును గుర్తించారు.

గుర్మీత్‌ను అదుపులోకి తీసుకున్న‌త‌ర్వాత‌.. అత‌గాడి ఆశ్ర‌మాన్ని పోలీసులు స్వాధీనంలోకి తీసుకున్నారు. క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేసి.. ఆశ్ర‌మంలో విస్తృతంగా త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు. ఆశ్ర‌మంలోని బాలిక‌ల్ని ఖాళీ చేసి.. వారున్న రూముల్ని ప‌రిశీలిస్తున్న వేళ‌.. ఒక ర‌హ‌స్య మార్గాన్ని గుర్తించారు. ఈ త‌ర‌హా సీక్రెట్స్ మ‌రెన్ని బ‌య‌ట‌కు వ‌స్తాయో?