అంత్యక్రియల కోసం 200 ఎకరాలు.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం !

Fri Apr 23 2021 05:00:01 GMT+0530 (IST)

200 acres for funeral state government key decision!

ఇండియా లో కరోనా సెకండ్ వేవ్ కాప్రతి ఒక్కరికి చుక్కలు చూపిస్తుంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 314835 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక కరోనా వైరస్ కేసులే కాదు మరణాలు కూడా  అందరిని ఆందోళనకి గురిచేస్తున్నాయి.  కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక కూడా ఒకటి. ముఖ్యంగా కర్ణాటక రాజధాని బెంగళూరులో కరోనా మృతులకు అంత్యక్రియలు చేయడానికి చోటు లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో కరోనా మృతుల అంత్యక్రియలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరు పరిధిలో కరోనాతో చనిపోయిన అంత్యక్రియలు సజావుగా సాగేందుకు 200 ఎకరాలను సిద్ధం చేసింది.కురబరహళ్లి ప్రాంతంలోని 200 ఎకరాలలో కోవిడ్ మృతుల అంత్యక్రియలు నిర్వహించాలని యడియూరప్ప ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే కరోనా సోకి చనిపోయిన వారి మృతదేహాలను ఖననం చేసేందుకు తొలుత ఆ ప్రాంత ప్రజలు అంగీకరించలేదు. వైరస్ సోకిన మృతదేహాలను తమ ప్రాంతానికి తీసుకొస్తే కరోనా తమకు కూడా సోకుతుందని భయాందోళన వ్యక్తం చేశారు. అయితే.. తర్వాత అధికారులు చర్చలు జరపడంతో ఎట్టకేలకు ఒప్పుకున్నారు. బుధవారం రెవెన్యూ మంత్రి ఆర్ అశోక్ ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. స్థానికులతో మాట్లాడారు. ఇక్కడ రెండు నెలల పాటు మాత్రమే ఇక్కడ అంత్యక్రియలు జరుపుతామని స్థానికులకు మంత్రి హామీ ఇచ్చారు. మృతదేహాలను పూడ్చి పెట్టడం లేదని దహనం చేస్తున్నందు వల్ల వైరస్ సోకే అవకాశం లేదని.. కంగారు పడాల్సిన పని లేదని మంత్రి స్థానికులకు చెప్పారు.

ఈ ప్రాంతంలో 200 ఎకరాలు సిద్ధం కావడంతో మరో రెండుమూడు రోజుల్లో కురుబరహళ్లి గోమాళ ప్రాంతంలో కరోనా మృతులకు అంత్యక్రియలు జరగనున్నాయి. బెంగళూరులో విద్యుత్ తో పాటు కట్టెలతో కాల్చే శ్మశాన వాటికలు మొత్తం 14 ఉన్నాయి. అయితే.. రోజుకు వందకు పైగా కరోనా మరణాలు నగర పరిధిలో నమోదవుతుండటంతో అంత్యక్రియలు జరపడం కష్టతరమైంది. స్మశానాల దగ్గర రోడ్ల పక్కన అంబులెన్స్ లు బారులు తీరి ఉండటాన్ని చూస్తున్న నగర ప్రజలు భయంతో బెంబేలెత్తిపోతున్నారు. దింతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.