Begin typing your search above and press return to search.

విదేశాల నుంచి తెలంగాణకు 20వేల మంది రానున్నారా?

By:  Tupaki Desk   |   19 March 2020 12:30 PM GMT
విదేశాల నుంచి తెలంగాణకు 20వేల మంది రానున్నారా?
X

కరోనా కలకలం నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నా.. వాటిని ఎదుర్కొనేందుకు వీలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్లానింగ్ తో ఉంది. ఇప్పటివరకూ వేసుకున్న అంచనాల ప్రకారం విదేశాల నుంచి దాదాపు ఇరవై వేల మంది వరకూ రానున్నట్లు భావిస్తున్నారు. ఇలా వచ్చిన వారిని వచ్చినట్లుగా క్వారంటైన్ చేయటానికి వీలుగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

హైదరాబాద్ శివారులోని పలు ప్రాంతాలతో పాటు.. జిల్లాల్లోనూ క్వారంటైన్ ఏర్పాట్లను చేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చే వారిని.. వచ్చినోళ్లను వచ్చినట్లుగా ఐసోలేషన్ లో ఉంచాల్సి అవసరం ఉంది. అలా వారిని కనిష్ఠంగా పదమూడు రోజులు.. గరిష్ఠంగా ఇరవై రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉంచాల్సి ఉంటుంది. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లనుచేస్తున్నారు. ఇందులో భాగంగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో 40 బస్సుల్ని ఏర్పాటు చేశారు. ఒకసారి వెయ్యి మంది కరోనా బాధితులకు చికిత్స చేయాల్సి వచ్చినా.. అందుకు అవసరమైన రీతిలో ఏర్పాట్లు చేస్తున్నారు.

బాధితుల సంఖ్య ఐదు వేలకు పెరిగి.. వారిని వేర్వేరు గదుల్లో ఉంచాల్సి వస్తే.. అందుకుతగ్గ మహా ప్రణాళిక సిద్ధమైనట్లు చెబుతున్నారు. 30 వేల మందికి క్వారంటైన్ చేయాల్సి వస్తే.. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లను వైద్య ఆరోగ్య శాఖ సిద్ధమైనట్లుగా చెబుతున్నారు. ఇన్ని వేల మందికి వైద్యం చేయాల్సి వస్తే.. అందుకు తగ్గట్లుగా వైద్యులు.. నర్సులు.. ఇతర సహాయక సిబ్బందితో పాటు పడకలు.. పరికరాలు.. మౌలిక సదుపాయాలకు సంబంధించిన ఏర్పాట్లను సిద్ధం చేశారు. అవసరమైతే రిటైర్డు వైద్యుల సేవల్ని తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు.

వేలాది మందిని క్వారంటైన్ చేయటానికి అనువైన ప్రదేశాల్ని ప్రభుత్వం గుర్తించింది. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేసింది. తెలంగాణ పోలీసుఅకాడమీని కరోనా ఐసోలేషన్ వార్డుగా రాష్ట్రం ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. ఇక్కడ ఏకంగా 1500 మందిని ఉంచి చికిత్స చేసే వీలుంది. ఇప్పటికే ఇక్కడ శిక్షణ పొందుతున్న 1200 మంది ఎస్సైలను ట్రైనింగ్ లో భాగంగా జిల్లాలకు పంపటం ద్వారా ఖాళీ చేయించనున్నారు. అంతేకాదు.. మరో 700 మంది మహిళా కానిస్టేబుల్ అభ్యర్థుల్ని వరంగల్.. అదిలాబాద్ జిల్లాలోని ట్రైనింగ్ సెంటర్లకు పంపాలని నిర్ణయించారు. వీరితో పాటు వివిధ విభాగాలకు సంబంధించిన భద్రతా దళాలు 14వేల మంది కానిస్టేబుళ్లు శిక్షలో ఉన్నారు. వీరందరికి కరోనా మీద అవగాహ కల్పించటంతో పాటు.. ఈ వైరస్ తీవ్రత పెరిగిన పక్షంలో వీరందరిని కొంతకాలం ఇళ్లకు పంపి.. ఆయా కేంద్రాల్ని క్వారంటైన్ చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.