Begin typing your search above and press return to search.

అమెరికాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం..20 మంది మృతి

By:  Tupaki Desk   |   8 Oct 2018 5:40 AM GMT
అమెరికాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం..20 మంది మృతి
X
దారుణ రోడ్డు ప్ర‌మాదం అమెరికాలో చోటు చేసుకుంది. అమెరికాలాంటి అగ్ర‌రాజ్యంలో రోడ్డు ప్ర‌మాదాలు మామూలే అయినా ఇంత తీవ్రమైన రోడ్డు ప్ర‌మాదం ఈ మ‌ధ్య‌న చోటు చేసుకోలేద‌ని చెప్పాలి. తాజాగా చోటు చేసుకున్న ఈ రోడ్డు ప్ర‌మాదంలో క‌నీసం 20 మంది వ‌ర‌కూ మ‌ర‌ణించి ఉంటార‌ని చెబుతున్నారు. పెద్ద సంఖ్య‌లో గాయాల‌పాలైన‌ట్లుగా తెలుస్తోంది.

రెండు కార్లు ఢీ కొన్న ఘ‌ట‌న‌లో భారీగా ప్రాణ‌న‌ష్టం జ‌రిగ‌టం సంచ‌ల‌నంగా మారింది. ఒక కారు ప్ర‌మాదం త‌ర్వాత పాద‌చారుల‌పైకి దూసుకెళ్ల‌టంతో మృతుల సంఖ్య ఎక్కువ‌గా ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. న్యూయార్క్ రాష్ట్ర రాజ‌ధాని అల్బానీ స‌మీపంలోని షోహారీ కౌంటీలో ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది.

ప్ర‌మాదానికి గురైన ఎస్ యూవీ మోడ‌ల్ కారు ప్ర‌మాదం అనంత‌రం ఒక కేఫ్ లోకి చొచ్చు కెళ్లింది. దీంతో.. ప‌లువురు ప్రాణాలు కోల్పోవ‌టంతో పాటు.. గాయాల‌పాల‌య్యారు. ఈ రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన వారిలో కారులో ప్ర‌యాణం చేస్తున్న వారు ఎంద‌రు? పాద‌చారులు ఎంత‌మంది? అన్న లెక్క బ‌య‌ట‌కు రాలేదు. ఇంత పెద్ద ఎత్తున ప్ర‌మాదం ఎందుకు చోటు చేసుకుంద‌న్న దానిపై పోలీసులు విచారిస్తున్నారు.