Begin typing your search above and press return to search.

'గోబెల్స్' ఆయుధంగా జనసేన

By:  Tupaki Desk   |   25 Aug 2018 11:31 AM IST
గోబెల్స్ ఆయుధంగా జనసేన
X
ఏ రాజకీయ పార్టీ అయినా మనుగడ కోసం... ఎదుగుదల కోసం కొన్ని అబద్దాలు... కొన్ని కల్పిత ప్రచారాలు చేసుకోవాలి. చేసుకుంటుంది కూడా. ఇది ప్రతి రాష్ట్రంలోనూ - ప్రతి పార్టీలోనూ - ఆ మాటకొస్తే జాతీయ స్ధాయిలో కూడా జరిగే పని. దీని గురించి ప్రజలు పెద్దగా పట్టించుకోరు కూడా. అయినా రాజకీయ పార్టీలు మాత్రం తమ ప్రచారాలను వదలవు. ముఖ్యంగా తెలుగు నాట చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ తరహా ప్రచారం ఊపందుకుంది. తెలుగుదేశం పార్టీకి మహా నటుడు ఎన్.టి.రామారావు అధ్యక్షుడిగా - ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం చాలా హుందాగానే ఉంది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడి హయాం రాగానే ఆయన మీడియా అని చెప్పుకునే కొన్ని పత్రికలు ఈ తరహా ప్రచారానికి ముందుకొచ్చాయి. దీంతో తెలుగునాట ఈ గొబెల్స్ ప్రచారం అనే మాట వ్యాప్తిలోకి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చిన్నాచితకా పార్టీలన్నీ కూడా ఈ గొబెల్స్ ప్రచారానికి అలవాటు పడిపోయాయి. అంతే కాదు... అవే తమకు మేలు చేస్తాయనే నిర్ధారణకు వచ్చేశాయి. ఇప్పుడు కొత్త పార్టీ - పవర్‌ స్టార్ పవన్ కల్యాణ్ పార్టీ కూడా ఇందుకు మినహాయింపు కాదని నిరూపించింది.

జనసేన పార్టీ వైపు దాదాపు 20 మంది ఎమ్మెల్యేలే చూస్తున్నారంటూ ఆ పార్టీ కొత్త ప్రచారానికి తెర తీసింది. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన 20 మంది శాసనసభ్యులు - సీనియర్ నాయకులు జనసేనలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ జనసేన రాష్ట్ర కన్వీనర్ పార్థసారధి ప్రకటించారు. వారంతా నేడో - రేపో పార్టీలో చేరతారని ఆయన తెలిపారు. అయితే ఆంధ్రప్రదేశ్‌ లో పరిస్ధితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. పవన్ కల్యాణ్ పట్ల ప్రజల్లోనే నమ్మకం లేకపోతే ఇక శాసనసభ్యులు - సీనియర్ నాయకులు ఎలా చేరుతారనే ప్రశ్న వస్తోంది. ఇది కచ్చితంగా గొబెల్స్ తరహా ప్రచారమేనని - ఇలా చేరుతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తే కొందరిలో ఆశ పుడుతుందనే ఆలోచన జనసేన చేస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే ఇవన్నీ పాత కాలం నాటివని, మంత్రాలకు చింతకాయల రాలనట్లే.... ప్రచారాలకు ప్రజాప్రతినిధులు పడిపోయే కాలం కాదని వారంటున్నారు. అంపశయ్య మీద ఉన్న కాంగ్రెస్ కూడా ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా ఇస్తామన్న వాగ్దానంతో బలపడేందుకు ప్రయత్నిస్తోందని - అలాంటిది ఏ పార్టీ నుంచి జనసేనలోకి నాయకులు వస్తారనే ప్రశ్న వస్తోంది. తాను వాస్తవాలే మాట్లాడతానని - అదే తన బలం - బలహీనత అని పదేపదే చెబుతున్న జనసేనాని పవన్ కల్యాణ్ ఈ తరహా గొబెల్స్ ప్రచారానికి దిగితే ఆయనకే నష్టమని వారంటున్నారు. ఇలాంటి ప్రచారాల వల్ల ప్రజల్లో ఉన్న కొద్దిపాటి సానుభూతి కోల్పోతారని వారంటున్నారు. వాస్తవాలతోనే ప్రజల్లోకి వెళ్తే ఏకొంతైనా మేలు జరుగుతుందనే భావన వ్యక్తం అవుతోంది.