Begin typing your search above and press return to search.

చెన్నై సముద్రంలో కలిసిన చమురెంత?

By:  Tupaki Desk   |   5 Feb 2017 7:48 AM GMT
చెన్నై సముద్రంలో కలిసిన చమురెంత?
X
రెండు ఆయిల్ షిప్పులు ఒక దానితో మరొకటి ఢీకొన్న ఉదంతం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆయిల్ లీక్ కావటం.. అది చెన్నై సముద్రంలో కలవటం.. సముద్రపు నీటిలో కలిసిన చమురు తెట్టను వెలికితీసేందుకు భారీగా సహాయక చర్యలు చేపట్టారు. అయితే.. సంద్రంలో కలిసి చమురు లెక్క ఇప్పుడు వణుకు పుట్టిస్తోంది. ఓ మోస్తరు ప్రమాదమన్న మాట నుంచి దేశ చరిత్రలోనే అతి పెద్దదైన క్లీనింగ్ కార్యక్రమంగా నిపుణులు అభివర్ణిస్తున్న వేళ.. చెన్నై సముద్ర తీరానికి వాటిల్లిన నష్టం అంతాఇంతా కాదన్న మాటను పర్యావరణవేత్తలు చెబుతున్నారు.

రెండునౌకలు ఢీ కొన్నఘటనకు సంబంధించి అధికారులు తొలుత 200 లీటర్ల ముడి చమురు మాత్రమే సముద్రంలో కలిసినట్లుగా చెప్పారు. తర్వాత అది కాస్తా ఒక మెట్రిక్ టన్నుగా చెప్పుకొచ్చారు. దీంతో ప్రమాద తీవ్రత ఎంతన్నది అర్థం చేసుకునే లోపే.. ఈ అంకెల్ని అదే పనిగా పెంచిన అధికారులు ఇప్పుడు 20 మెట్రిక్ టన్నుల చమురు సముద్రంలో కలిసినట్లుగా చెప్పటం షాకింగ్ గా మారింది.

అయితే.. ఈ లెక్కకు సంబంధం లేని విధంగా ఇప్పటివరకూ సముద్రంలో కలిసి ఆయిల్ వ్యర్థాలు 115 టన్నులుగా చెబుతున్నారు. చమురు కారణంగా వేలాది టన్నుల చేపలు మరణించినట్లుగా చెబుతున్నారు. చెన్నై తీరాన్ని కమ్మేసిన ఈ చమురు తెట్ట 30 కిలోమీటర్ల మేర ఉంటుందన్న మాట వినిపిస్తోంది.చెన్నై నగరంలోని 74 కిలోమీటర్ మేర ఉన్న సముద్రంలో కాస్త అటూఇటూగా యాభై శాతం మేర సముద్రం ఈ చమురు తెట్టతో నిండిపోయిన మాట వింటేనే వణుకు పుట్టించే పరిస్థితి.

చమురుతో నిండిన చెన్నై సముద్రాన్ని శుద్ధి చేసే భారీ కార్యక్రమాన్ని చేస్తున్నారు. రెండు వేల మంది నిపుణులు.. ఐదు వేలమంది వాలంటీర్లతో చమురు తెట్టను తవ్విపోస్తున్నారు. లీకైన చమురు గడ్డలు కట్టి.. తీరానికి వస్తోంది. వీటిని వెలికి తీసి బయటకు పారబోస్తున్నారు. సముద్రాన్ని శుద్ధి చేసే కార్యక్రమం పూర్తి కావొస్తున్నట్లు చెబుతున్నా.. మరో పది రోజులకు పైనే పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జర్మనీకి చెందిన మరో నిపుణుల బృందం ఈ రోజు చెన్నైకి చేరుకొని శుద్ధి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారని చెబుతున్నారు.తాజా ప్రమాదం చెన్నై సముద్రాన్ని భారీగా నష్టపర్చటమే కాదు.. పర్యావరణంపై పెద్ద ఎత్తున ప్రభావం చూపిస్తొందన్న మాట వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/