Begin typing your search above and press return to search.

అమ్మ డ్రైవ‌ర్ అకస్మిక‌ మ‌ర‌ణంలో ఇంకో ట్విస్ట్‌

By:  Tupaki Desk   |   30 April 2017 5:53 AM GMT
అమ్మ డ్రైవ‌ర్ అకస్మిక‌ మ‌ర‌ణంలో ఇంకో ట్విస్ట్‌
X
అన్నాడీఎంకే అధినేత్రి తమిళనాడు దివంగ‌త సీఎం జయలలితకు చెందిన డ్రైవ‌ర్ హ‌త్య‌లో మ‌రో ట్విస్ట్ తెర‌మీద‌కు వ‌చ్చింది. అమ్మ‌కు చెందిన కొడనాడు టీ ఎస్టేట్ బంగ్లా సెక్యూరిటీ గార్డు హత్యకేసులో ప్రధాన నిందితుడు ఎస్ కనకరాజు శుక్రవారం రాత్రి ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. అయితే అతడి స్నేహితుడు - ఈ కేసులో మరో నిందితుడు అయిన‌ శ్యామ్ కేరళలో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ రెండు ప్రమాదాలు ఒకేరాత్రి కొన్ని గంటల వ్యవధిలో ఇద్ద‌రు నిందితులు రోడ్డు ప్రమాదంలోనే చ‌నిపోవ‌డంపై పోలీసులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.

ఏప్రిల్ 24వ తేదీ రాత్రి నీలగిరి సమీపంలోని జయలలిత ఎస్టేట్ బంగ్లా సెక్యూరిటీ గార్డుగా ఉన్న నేపాల్‌ కు చెందిన ఓమ్ బహదూర్ హత్య - దోపిడీ కేసులో కనకరాజు కీలక సూత్రధారి అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేరళలోని సాలెం జిల్లా అతూర్‌ లో కనకరాజు (36)నడుపుతున్న బైక్‌ ను కారు ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం అతని మృతదేహాన్ని పోలీసులు అత్తూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కనకరాజ్ సన్నిహిత మిత్రుడు సాయన్ అలియాస్ శ్యామ్ శనివారం తెల్లవారుజామున కారులో కుటుంబంతో కలిసి త్రిసూర్ నుంచి కోయంబత్తూర్ వెళ్తుండగా లారీ వీరి కారును ఢీకొట్టింది. పాలక్కడ్-త్రిసూర్ రోడ్డు పై జరిగిన ఈ ప్రమాదంలో శ్యామ్ భార్య వినుప్రియ - కూతురు నీతు అక్కడికక్కడే చనిపోయారు. శ్యామ్ తీవ్రంగా గాయపడ్డారు. దవాఖానలో చికిత్స పొందుతున్న శ్యామ్ నుంచి జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఎస్ సెంథిల్‌ కుమార్ వాంగ్మూలం తీసుకున్నారు.

2012 వరకు జయలలిత కారు డ్రైవర్‌ గా కనకరాజు పనిచేశారు. నీలగిరికి సమీపంలోని టీ ఎస్టేట్ బంగ్లాకు జయలలిత తరచూ వెళ్లేవారు. ఆ బంగ్లాలో జయలలితకు సంబంధించిన కీలకపత్రాలు ఉంటాయని, వాటిని ఎత్తుకురమ్మని ఏప్రిల్ 24 రాత్రి కొందరు రెండు సుమో వాహనాల్లో పది మందిని పురమాయించినట్టు పోలీసులు అనుమానించారు. సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలిస్తున్నారు. ఆ రాత్రి బంగ్లాకు చేరుకున్న దుండగులు సెక్యూరిటీ గార్డును హత్యచేసి, మరొకరిని తీవ్రంగా గాయపరిచి కీలకపత్రాలు ఎత్తుకెళ్లారు. వీరిలో కీల‌క నిందితులుగా క‌న‌క‌రాజు - శ్యామ్‌ ల‌ను అనుమానిస్తున్నారు. కాగా, జయ అక్రమ ఆస్తుల కేసులో ఈ బంగ్లా ప్రస్తావన కూడా ఉంది. ఈ కేసులో జయలలిత, శశికళతోపాటు పలువురు జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/