Begin typing your search above and press return to search.

బ్రేకింగ్: పండుగ పూట 1922 ఉద్యోగాలు ఊస్టింగ్!

By:  Tupaki Desk   |   21 April 2021 7:07 AM GMT
బ్రేకింగ్: పండుగ పూట 1922 ఉద్యోగాలు ఊస్టింగ్!
X
ఎవరైనా పండుగ పూట శుభవార్తలు చెబుతారు. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఉన్న ఫళంగా 1922 మందిని ఊడబీకింది.. వారి ఉద్యోగాలు పోయి శ్రీరామనవమి పండుగ పూట ఆ కుటుంబాలన్నీ రోడ్డునపడ్డాయి. పండుగ పూట మీరిచ్చిన గిఫ్ట్ ఇదా అని ఆ కుటుంబాలన్నీ భోరున విలపిస్తున్నాయి..

ఓ వైపు కరోనా కల్లోలం.. మరోవైపు ఉద్యోగ, ఉపాధి లేమీ.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సగమో.. పావలో ఇచ్చి ఉద్యోగులను కడుపున పెట్టుకోవాలి. కానీ ఏపీ సర్కార్ మాత్రం మాత్రం ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 1922 మందిని పండుగ పూట ఉద్యోగాలు ఊడగొట్టించి వారికి ఆ సంబరం లేకుండా చేసింది.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుక పాలసీని సంస్కరించింది. ఆ సంస్కరణల ఎఫెక్ట్ ఇప్పుడు 1922 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిపై పడింది. పండుగ నాడే వారిని ఏపీఎండీసీ తొలగించింది. దీంతో అన్ని కుటుంబాలు రోడ్డున పడ్డ పరిస్థితి నెలకొంది.

ఇప్పటివరకు ఇసుక సరఫరా బాధ్యతను చూస్తున్న ఏపీఎండీసీని తప్పించి ప్రైవేటు సంస్థకు అప్పగించడంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించేశారు. మే 1 నుంచి 1922 మంది సిబ్బంది సేవలు అవసరం లేదని.. వారందరినీ తొలగిస్తున్నామని ఏపీఎండీసీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ మేరకు ఏపీ వ్యాప్తంగా 13 జిల్లాల్లో ఇసుక ఇండెంట్ లు ఇచ్చేందుకు అవసరమైన మానవ వనరులను సరఫరా చేసేలా ఒక ప్రైవేటు ఏజెన్సీతో ఏపీఎండీసీ ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా 1922 మందిని తీసుకున్నారు. ఇప్పుడు ఏడాదిలోనే ఇసుక పాలసీని మార్చేసి ప్రైవేటు సంస్థకు అప్పగించి ఏపీ సర్కార్ చేతులు దులుపుకుంది.

ఇలాంటి కరోనా కల్లోలంలో చిరుద్యోగుల పట్ల ప్రభుత్వం మానవతాదృక్పథంతో వ్యవహరించాలని వారి కుటుంబాలు, పలువురు కోరుతున్నారు. కొత్తగా కాంట్రాక్టు సంస్థతో మాట్లాడి అయినా ఈ 1922 మందిని రోడ్డున పడకుండా చూడాలని కోరుతున్నారు. సీఎం జగన్ ఇలాంటి విషయాల్లో ఊదారంగా వ్యవహరిస్తారని.. తమను ఆదుకోవాలని ఆ 1922 మంది బాధిత కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. పండుగ పూట మా ఇళ్లలో సంతోషం నింపాలని కోరుతున్నారు.