Begin typing your search above and press return to search.

ఘోర ప్రమాదం.. విమానం కూలి 19 మంది బలి!

By:  Tupaki Desk   |   7 Nov 2022 5:30 AM GMT
ఘోర ప్రమాదం.. విమానం కూలి 19 మంది బలి!
X
సఫారీలకు ప్రఖ్యాతి చెందిన ఆఫ్రికాలోని టాంజానియా దేశంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 43 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ విమానం విక్టోరియా సరస్సులో కూలిపోయింది. ఈ ఘటనలో 19 మంది మృతి చెందారు. మరో 24ని మందిని అధికారులు, రెస్క్యూ సిబ్బంది రక్షించారు.

టాంజానియా ఆర్థిక రాజధాని దార్‌ ఎస్‌ సలాం నుంచి బుకోబాకు విమానం ప్రయాణిస్తోంది. ఆ సమయంలో విమానంలో మొత్తం 43 మంది ప్రయాణికులు ఉన్నారు. బుకోబా నగరంలో ల్యాండింగ్‌ కావాల్సిన కొద్ది సమయానికి ముందే వాతావరణం ప్రతికూలంగా మారడంతో విమానం విక్టోరియా సరస్సులో పడిపోయింది. ఈ సమాచారం అందుకున్న అధికారులు ప్రయాణికులను రక్షించేందుకు చర్యలు చేపట్టారు. అప్పటికే 19 మంది కన్నుమూశారు.

బుకాబో ఎయిర్‌పోర్ట్‌కు 100 మీటర్ల దూరంలో ఉన్న విక్టోరియా సరస్సులో విమానం పడిపోయింది. పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి. ప్రయాణికులను రక్షించేందుకు భద్రతా బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి' అని బుకాబో రీజనల్‌ పోలీస్‌ కమాండర్‌ విలియమ్‌ వాంపఘేల్‌ తెలిపారు.

మరోవైపు.. విమానంలో ప్రయాణికులు 49 మంది ఉన్నట్లు స్థానిక మీడియాలు నివేదించగా.. ఆ సంఖ్య మరింత ఎక్కువగానే ఉందని వార్తలు వచ్చాయి.

కాగా ప్రమాదానికి గురయిన విమానం... ప్రెసిషన్‌ ఎయిర్‌ సంస్థకు చెందింది. ఇది టాంజానియాలో అతిపెద్ద ప్రైవేటు విమానయాన సంస్థ. ప్రమాదం నేపథ్యంలో విమాన ప్రమాదం జరిగినట్లు ధ్రువీకరిస్తూ ప్రెసిషన్‌ ఓ ప్రకటన చేసింది. ప్రమాద ఘటనా స్థలానికి సహాయక బృందాలను పంపామని.. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని వెల్లడించింది.

కాగా ఉత్తర టాంజానియాలో సఫారీ సంస్థకు చెందిన విమాన ప్రమాదంలో 11 మంది చనిపోయిన 5 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ స్థాయిలో జరిగిన ప్రమాదం ఇదే కావడం గమనార్హం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.