Begin typing your search above and press return to search.

సీఎంపై అవిశ్వాసం..అమ్మ స‌ర్కారులో అయోమ‌యం

By:  Tupaki Desk   |   22 Aug 2017 10:04 AM GMT
సీఎంపై అవిశ్వాసం..అమ్మ స‌ర్కారులో అయోమ‌యం
X
ఆరునెలల రాజకీయ అనిశ్చితికి తెరదించుతూ తమిళనాడులో అధికార అన్నాడీఎంకే ప్రత్యర్థి వర్గాలు నిన్న ఒక్కటైన విషయం విదితమే. ముఖ్యమంత్రి పళనిస్వామి - మాజీ సీఎం పన్నీర్‌ సెల్వం చేతులు కలిపారు. గతంలో ఆపద్ధర్మంగా సీఎం పదవి చేపట్టిన పన్నీర్ ఇప్పుడు విలీనం ఒప్పందంలో భాగంగా డిప్యూటీ సీఎం అవతారం ఎత్తారు. మేమంతా అమ్మ బిడ్డలం.. అన్నదమ్ములం అంటూ సీఎం పళని ఐక్యతారాగం ఆలపించారు. అయితే ఈ ఘ‌ట‌న జ‌రిగి ఒక్క‌రోజు కూడా కాక‌ముందే....సీన్ మారిపోయి సీఎం సీటు కింద‌కి ఎస‌రు వ‌చ్చింది. చిన్న‌మ్మ‌ శశికళ వర్గం సీఎం పళనిస్వామికి మద్దతు ఉపసంహరించుకుంది.

రాష్ర్ట గవర్నర్ విద్యాసాగర్ రావును రాజ్ భవన్ లో శశికళ వర్గానికి చెందిన 19 మంది ఎమ్మెల్యేలు కలిసి.. సీఎం పళనికి తమ మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆ ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతూ.. తమిళనాడు శాసనసభలో సీఎం పళనికి మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు లేదన్నారు. పళనిపై అవిశ్వాస తీర్మానం పెట్టండి అని గవర్నర్ కు విన్న‌వించామని తెలిపారు. కాసేపటికే ఎంపీ మైత్రేయన్ గవర్నర్ ను కలిసి పళనిస్వామికి మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పారు. ఇదిలాఉండ‌గా....మరో ముగ్గురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు కూడా పళనిస్వామికి మద్దతు ఉపసంహరించుకుంటారని డీఎంకే నేత ఎంకే స్టాలిన్ చెప్పారు. ముగ్గురు ఎమ్మెల్యేల మద్దతు ఉపసంహరణపై తనకు సమాచారం ఉందన్నారు స్టాలిన్. మొత్తంగా ఈ సంఖ్య 22కు చేరుతుందన్నారు. సీఎం పళనిస్వామిపై అవిశ్వాస తీర్మానికి తాము కూడా డిమాండ్ చేస్తున్నామని ఆయన తెలిపారు.

తమిళనాడు అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 234. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు 134 మంది. వీరిలో 19 మంది ఎమ్మెల్యేలు శశికళ వర్గానికి చెందిన వారున్నారు. ఈ 19 మంది ఎమ్మెల్యేలు పళనిస్వామికి మద్దతు ఉపసంహరించుకోవడంతో.. 115 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే సీఎంకు ఉంటుంది. సీఎం పళనిస్వామి తన బలాన్ని నిరూపించుకోవాలంటే 117 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు పళనికి మద్దతు ఇవ్వాలి. లేకపోతే పళని ప్రభుత్వం చిక్కుల్లో పడినట్లేనని రాజకీయ విశ్లేషకులు అంచ‌నా వేస్తున్నారు.