Begin typing your search above and press return to search.

ఆ ఆసుపత్రిలో 18మంది ఎలా చనిపోయారు?

By:  Tupaki Desk   |   5 Dec 2015 4:50 AM GMT
ఆ ఆసుపత్రిలో 18మంది ఎలా చనిపోయారు?
X
చెన్నై వర్ష బీభత్సం కారణంగా ఒక ఆసుపత్రిలో 18 మంది మరణించటం సంచలనం సృష్టిస్తోంది. అత్యవసర సేవలు అందని నేపథ్యంలో ఈ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నరోగులు ఇంత భారీ స్థాయిలోమరణించటం పట్ల తీవ్ర ఆందోళన.. ఆగ్రహం వ్యక్తమవుతోంది. అడయార్ నది ఒడ్డున ఉండే ఈ ఏడంతస్థుల ఆసుపత్రి బిల్డింగ్ లో ఇంత దారుణం చోటు చేసుకోవటం షాకింగ్ గా మారింది. ఇంత భారీగా రోగులు ప్రాణాలు ఎలా పోగొట్టుకున్నారు.? ఇదంతా ప్రభుత్వ నిర్లక్ష్యమా? ఈ మరణాలకు అసలు కారకులు ఎవరన్న ప్రశ్న పలువురి నోట నుంచి వస్తోంది. సాంకేతికత ఇంత భారీగా వృద్ధి చెందిన తర్వాత కూడా.. ఒక మహానగరంలోని ఒక పెద్ద ఆసుపత్రిలో ఇన్ని ప్రాణాలు పోవటం ఏమిటన్న ప్రశ్నకు సమాధానం వెతుకుతూ నిశితంగా పరిశీలిస్తే.. అసలు విషయం బయటకు వచ్చింది.

ఈ ఆసుపత్రి ఎక్కడుంది?

చెన్నైలోని గిండీకి సమాపంలో ఉంది. ఈ ఆసుపత్రిని అడయార్ నది ఒడ్డున నిర్మించారు. 7 అంతస్థులతో దీన్ని నిర్మించారు. కొద్దిరోజులుగా భారీగా వర్షం కురిసినప్పటికీ.. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షాలతో పెద్ద ఎత్తున వరద నీరు తన్నుకొచ్చింది. దీంతో.. ఆసుపత్రి తూర్పు వైపు ప్రహరీగోడ కూలిపోయింది.

ఆ తర్వాత ఏం జరిగింది?

భారీగా వచ్చిన వరద నీటితో గ్రౌండ్ ఫ్లోర్ వరకూ ఆసుపత్రి మునిగిపోయింది. విద్యుత్తు సరఫరా ఆగిపోయింది. మొదటి బ్లాక్ లో ఉన్న అత్యవసర సేవా విభాగంలో చికిత్స పొందుతున్న 30 మంది పేషంట్లను ఆసుపత్రి వెనుకున్న రెండో బ్లాక్ క్యాన్సర్ యూనిట్ భవనంలోకి మార్చారు. అయితే.. లోపలికి చొచ్చు కొచ్చిన వర్షపునీరు విద్యుత్తు వ్యవస్థను దెబ్బ తీయటంతోపాటు.. భూగర్భంలో ఏర్పాటు చేసిన జనరేటర్లు.. ఆక్సిజన్ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయింది.

ఆసుపత్రిలో ఎంతమంది ఉన్నారు?

వరద నీరు చొచ్చుకొచ్చే సమయంలో ఆసుపత్రిలో మొత్తం 700 మంది ఉన్నట్లుగా చెబుతున్నారు. ఎప్పుడైతే విద్యుత్తు సౌకర్యం నిలిచిపోయి.. జనరేటర్ల వ్యవస్థ స్తంభించిందిదో.. వెనువెంటనే పలువురు రోగుల్ని తరలించటం.. కొందరిని అయితే డిశ్చార్జ్ చేసి ఇళ్లకు పంపేశారు. ఇలా పంపిన వారు 350 వరకు ఉన్నట్లుగా చెబుతున్నారు.

18 మంది ఎందుకు చనిపోయారు?

ఇంత భారీగా ఆసుపత్రిలో రోగులు మరణించకుండా ఉండటానికి చాలానే ప్రయత్నాలు జరిపారు. అయినా ప్రాణనష్టం జరగకుండా చూడటంలో విఫలమయ్యారు. ఐసీయూలో ఉన్న 75 మంది పేషంట్లు ఉంటే 57 మందిని అతి కష్టమ్మీదా ఇతర ఆసుపత్రులకు పంపగా.. కదిలించటానికి వీల్లేని పరిస్థితుల్లో ఉన్న 18 మంది రోగులు ఆసుపత్రిలో ఉండిపోయారు.

ఆక్సిజన్ అందకపోవటమేనా?

ఆసుపత్రిలో విద్యుత్తు సౌకర్యం పోవటం.. ఆక్సిజన్ సిలిండర్ల వ్యవస్థ స్తంభించటంతో అత్యవసర చికిత్సా విభాగంలో కీలకమైన ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయింది. దీంతో.. ఆక్సిజన్ అందక 18 మంది ప్రాణాలు విడిచారు.

సిలిండర్లు కొట్టుకుపోయాయా?

ఆసుపత్రిని ముంచెత్తిన వరద నీరుతో ఆసుపత్రి భూగర్భంలోఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంటులో సిలిండర్లు కొన్ని కొట్టుకుపోతే.. మరికొన్ని కొట్టుకుపోయాయి. ఆసుపత్రి నిర్మాణ సమయంలో వరద విపత్తును ఊహించి.. అందుకు తగ్గట్లే చాలా జాగ్రత్తలతో ఆసుపత్రిని నిర్మించామని.. కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ.. వరద తీవ్రత ఎక్కువగా ఉండటం.. ఆసుపత్రి గోడను బద్ధలు కొట్టుకు వచ్చి.. విద్యుత్తు.. ఆక్సిజన్ వ్యవస్థతో పాటు కమ్యూనికేషన్ వ్యవస్థలు ధ్వంసం కావటంతో ఇంత భారీ నష్టం వాటిల్లినట్లుగా ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.