Begin typing your search above and press return to search.

నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా 18 గంటల కర్ఫ్యూ!

By:  Tupaki Desk   |   5 May 2021 11:05 AM IST
నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా 18 గంటల కర్ఫ్యూ!
X
కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్‌ తో యావత్ దేశం అల్లకల్లోలంగా ఉండటంతో ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలో పలు రాష్ట్రాలు ఇప్పటికే లాక్‌ డౌన్‌ లోకి వెళ్లినా, రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కేవలం రాత్రి కర్ఫ్యూ మాత్రమే విధించారు. అయితే , ఏపీ సీఎం జగన్ గతకొద్ది రోజులగా కరోనా ప్రభావంపై తీవ్ర స్థాయిలో సమీక్షలు నిర్వహించిన మే 5 నుండి రెండు వారాల పాటు రాష్ట్ర వ్యాప్తంగా 18 గంటల కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ 18 గంటల కర్ఫ్యూ ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ఇక ఈరోజు నుండే ఈ 18 గంటల కర్ఫ్యూ అమల్లోకి రానుంది. అన్ని రకాల దుకాణాలు, వ్యాపార సముదాయాలు కేవలం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. దీంతో ప్రజలు తమకు కావాల్సిన నిత్యావసరాలు మొదలుకొని మందుల వరకు ఈ సమయంలోనే తెచ్చిపెట్టుకునేందుకు పరుగులు తీస్తున్నారు. అయితే ఈ కర్ఫ్యూ నుండి అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపును ఇచ్చారు. ఈ కర్ఫ్యూ సమయంలో ప్రజలు రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లేవారికి, ప్రభుత్వం ఎంపిక చేసిన కోవిడ్ పరీక్షా కేంద్రాలకు వెళ్లేవారికి మాత్రం అనుమతినిచ్చారు. మరి ఈ 18 గంటల కర్ఫ్యూ ఏపీలో కరోనా ప్రభావాన్ని కొంతలో కొంత తగ్గించినా జగన్ వ్యూహం ఫలించినట్లే అవుతుంది. షాపుల వద్ద కొనుగోలుదారులు గుంపులుగా ఉండకుండా చూడాలని, వ్యక్తుల మధ్య భౌతిక దూరం ఉండేలా చర్యలు చేపట్టాలని, తరుచూ శానిటైజరుతో చేతులను శుభ్రం చేసుకోవాలన్నారు. బయటకు వచ్చే వ్యక్తులు తప్పనిసరిగా డబుల్‌ మ్కాలు ధరించి, వైరస్‌ నుంచి రక్షణ పొందాల్సిందిగా ప్రజలకు సూచించారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఎవరూ బయట తిరగడానికి అనుమతుల్లేవని, అత్యవసర వైద్య అవసరాల నిమిత్తం మాత్రమే బయటకు రావాలన్నారు.

ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే ప్రజా రవాణా వాహనాలు నడపాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో బస్సులు, ఆటోలు, క్యాబ్‌లు వంటివి మధ్యాహ్నం తర్వాత నడిపేందుకు అవకాశం ఉండదు. బస్సులు తిరిగేందుకు ఆరుగంటలే సమయం. ఆయా జిల్లాల పరిధిలోని, పక్క జిల్లాలకు వెళ్లే సర్వీసులనే ఆర్టీసీ నడపనుంది.మరోవైపు ఇతర రాష్ట్రాలకు తిరిగే సర్వీసులు అన్నింటినీ నిలిపేయాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇప్పటికే బెంగళూరు, చెన్నైకు బస్సులు నిలిపివేయగా.. తాజాగా హైదరాబాద్‌కు సర్వీసులు ఆపేశారు.