Begin typing your search above and press return to search.

హైద‌రాబాద్ లో భ‌లే బైక్ దొంగ దొరికాడు!

By:  Tupaki Desk   |   5 July 2019 11:33 AM IST
హైద‌రాబాద్ లో భ‌లే బైక్ దొంగ దొరికాడు!
X
చాలామంది దొంగ‌ల గురించి మీరు చ‌దివి ఉండొచ్చు. కానీ.. ఈ దొంగ మాత్రం అందుకు భిన్నం. ఆ మాట‌కు వ‌స్తే ఇలాంటి బైకు దొంగ గురించి మీరెప్పుడూ చ‌దివి కూడా ఉండ‌క‌పోవ‌చ్చు. ఈ దొంగ చేసే సిత్రాలు చెప్పే ముందు ఇత‌గాడి వ‌య‌సు ఎంతో తెలుసా? అక్ష‌రాల 17 ఏళ్లు మాత్ర‌మే. అంటే.. మైన‌ర్ అన్న మాట‌. అందుకే అత‌గాడి పేరు.. వివ‌రాలు లాంటివి ఇక్క‌డ ప్ర‌స్తావించ‌టం లేదు. చ‌ట్ట‌ప్ర‌కారం మైన‌ర్ అయిన వ్య‌క్తి ఎంత త‌ప్పు చేసినా అత‌డి వివ‌రాల్ని వెల్ల‌డించ‌కూడ‌దు.

ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. ఈ పిల్ల‌గాడు ఇప్ప‌టివ‌ర‌కూ ఏకంగా 13 బైకు దొంగ‌త‌నాలు చేశాడు. తాజాగా అత‌గాడు పోలీసుల‌కు దొరికాడు. తాను దొంగ‌త‌నం చేసిన బైకుల లెక్క చెబుతుంటే పోలీసుల‌కు నోట మాట రాలేద‌ట‌. పేరుకు పిల్ల‌గాడే అయినా.. అత‌గాడి దొంగ‌త‌నాలు మాత్రం భారీగా ఉంటాయి. సుల్తాన్ బ‌జార్.. మ‌ల్కాజిగిరి.. గోల్కొండ‌.. కుషాయ‌గూడ‌.. కాచిగూడ ఇలా హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో బైకుల్ని ఇట్టే మాయం చేస్తాడీ మౌలాలీ కుర్రాడు.

ఇంత‌కీ ఈ పిల్లోడు బైకులు ఎందుకు చోరీ చేస్తాడో తెలుసా? వాటి మీద అత‌నికున్న ఆస‌క్తి తోనే. బైకును దొంగ‌త‌నం చేసిన త‌ర్వాత‌.. రోడ్ల మీద వాటితో హ‌డావుడి చేస్తూ.. త‌న‌కున్న డ్రైవింగ్ నైపుణ్యాన్ని యూట్యూబ్ వీడియోలు త‌యారు చేసేవాడు. బైకులో పెట్రోల్ ఉన్నంత‌వ‌ర‌కూ న‌డిపే ఈ పిల్లాడు.. ఎప్పుడైతే బండిలో చ‌మురు అయిపోతుందో.. ఆ బైకును అలా వ‌దిలేస్తుంటాడు.

ఇంత‌కీ.. ఈ పిల్ల బైక్ దొంగ ఎలా దొరికాడంటే.. తాజాగా సుల్తాన్ బ‌జార్ పోలీసులు త‌నిఖీలు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఈ పిల్లాడ్ని ప‌ట్టుకున్నారు. బైకు పేప‌ర్లు అడిగితే నీళ్లు న‌ములుతున్నాడు. దీంతో సందేహం వ‌చ్చిన పోలీసులు ఆరా తీయ‌టం మొద‌లెట్ట‌గా.. తాను చేసిన బైకు చోరీల‌తో స‌హా.. వాటితో తానేం చేస్తానో అన్ని చెప్పేశాడు. దీంతో.. అవాక్కు అవ్వ‌టం పోలీసుల వంతైంది.

పేరుకు పిల్లాడే కానీ బైకు దొంగ‌త‌నాల్లో మ‌హా ముదుర‌న్న విష‌యాన్ని అత‌డు వెల్ల‌డించిన వివ‌రాల‌తో గుర్తించిన పోలీసులు అత‌డిపై కేసు న‌మోదు చేసి జువైన‌ల్ హోంకు త‌ర‌లించారు. బైకుల‌తోపాటు అప్పుడ‌ప్పుడు సెల్ ఫోన్లు.. గొలుసుల చోరీల‌లోనూ పిల్లాడికి ప్ర‌వేశం ఉన్న‌ట్లుగా గుర్తించారు.