Begin typing your search above and press return to search.

పానీపూరీలు అమ్మిన కుర్రాడ్ని రూ.2.40 కోట్లకు కొనేశారు

By:  Tupaki Desk   |   20 Dec 2019 4:23 AM GMT
పానీపూరీలు అమ్మిన కుర్రాడ్ని రూ.2.40 కోట్లకు కొనేశారు
X
రికెట్ అంటే అతగాడికి మహా పిచ్చి. ఉండేందుకు చిన్నగది కూడా లేని అతడు క్రీడా మైదానంలో ఒక చిన్న టెంట్ వేసుకొని ఏకంగా మూడేళ్లు గడిపిన దుర్భర పేదరికం అతని కేరాఫ్ అడ్రస్. అలాంటోడు ఈ రోజున కోట్లాది రూపాయిల ధర పలకటం ఆసక్తికరంగా చెప్పాలి. నమ్మిన దాని కోసం నిజాయితీగా కష్టపడితే ఫలితం దానంతట అదే వస్తుందనటానికి నిలువెత్తు రూపంగా 17ఏళ్ల దేశవాళీ క్రికెటర్ యశస్వి జైస్వాల్ ను చెప్పక తప్పదు.

యూపీకి చెందిన ఈ కుర్రాడికి క్రికెటర్ కావాలన్నదే లక్ష్యం. అందుకోసం ఉత్తరప్రదేశ్ నుంచి ముంబయికి చేరుకున్నాడు. ఎక్కడ ఉండాలో తెలీక.. చివరకు అజాద్ మైదానంలో చిన్న టెంట్ వేసుకొని మూడేళ్లు ఉన్నాడు. బతుకుబండిని లాగించటం కోసం పానీపూరీ అమ్మేవాడు. తన అవసరాల్ని తీర్చుకునేవాడు. అదే సమయంలో తన ఫోకస్ అంతా క్రికెట్ మీదే ఉంచేవాడు.

ఇదే అతగాడ్ని ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో డబుల్ సెంచరీ సాధించిన అతి పిన్నవయస్కుడి రికార్డును సొంతం చేసుకునేలా చేసింది. విజయ్ హజారే ట్రోఫీల్లో ముంబయి తరఫున ఆడిన జైస్వాల్ డబుల్ సెంచరీ సాధించి అందరి కంట్లో పడ్డాడు. అతగాడి కసిని గుర్తించిన కోచ్ జ్వాలాసింగ్ కారణంగా తన క్రికెట్ కలను నెరవేర్చుకున్నాడని చెప్పాలి. స్కూల్ స్థాయి నుంచి రంజీ క్రికెటర్ గా వేగంగా ఎదిగి అండర్ 19 ప్రపంచకప్ సభ్యుడిగా ఉన్న యశస్వి.. తాజాగా ఐపీఎల్ లోనూ అతడికి అవకాశం లభించింది.

అన్ క్యాప్డ్ ప్లేయర్ గా యశస్వి కనీస ధర రూ.20లక్షలు మాత్రమే. కానీ.. రాజస్థాన్ రాయల్స్ పుణ్యమా అని అతగాడి ధర రూ.2.40 కోట్లకు పెరిగింది. అతడ్ని ఆ జట్టు సొంతం చేసుకుంది. దేశవాళీ టాలెంట్ కు పెద్దపీట వేసే రాజస్థాన్ రాయల్స్ కారణంగా యశస్వి కోటీశ్వరుడయ్యాడని చెప్పాలి. మరి.. ఐపీఎల్ లో తనకు లభించిన ఈ అవకాశాన్ని యశస్వి ఎంతమేర సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి.