Begin typing your search above and press return to search.

అమెరికాలో తీపిక‌బురు..16 మంది విద్యార్థుల‌కు విముక్తి

By:  Tupaki Desk   |   13 Feb 2019 1:09 PM IST
అమెరికాలో తీపిక‌బురు..16 మంది విద్యార్థుల‌కు విముక్తి
X
స్టింగ్ ఆప‌రేష‌న్ ద్వారా మ‌న విద్యార్థుల‌ను జైల్లో వేసిన ఉదంతం కీల‌క మ‌లుపు తిరిగింది. ఫార్మింగ్‌ట‌న్ ఫేక్ యూనివర్సిటీ కేసులో అరెస్ట్ అయిన 16 మంది విద్యార్థులకు అమెరికా కోర్టులో ఊరట లభించింది. ఫిబ్రవరి 26లోగా స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లేందుకు కోర్టు అనుమతించింది. 20 మందిలో ముగ్గురు విద్యార్థులు(ఇద్దరు ఇండియన్స్ - ఒక పాలస్తీనియన్) ముందుగానే వాలంటరీ డిపార్చర్(స్వచ్ఛందంగా స్వదేశాలకు తిరిగి వెళ్లేందుకు) అనుమతి పొందారు. ఫార్మింగ్టన్ ఫేక్ యూనివర్సిటీ కేసులో అరెస్ట్ అయిన విద్యార్థుల తుది వాదనలు ఫిబ్రవరి 12న ముగిశాయి.

20 మందిలో 17 మందిపై మంగళవారం విచారణ జరిగింది. 17 మందిలో 15 మందికి స్వచ్ఛందంగా స్వదేశాలకు వెళ్లే అవకాశాన్ని కోర్టు కల్పించింది. 15 మందిలో 8 మంది తెలుగు విద్యార్థులే. 16వ విద్యార్థికి కూడా తిరిగి వెళ్లిపోయే అవకాశం ఇచ్చినప్పటికీ స్వచ్ఛందంగా కాకుండా యూఎస్ గవర్నమెంట్ రిమూవల్ కింద వెళ్లేందుకు అనుమతించింది. 17వ విద్యార్థి అమెరికా పౌరసత్వం ఉన్న మహిళను పెళ్లిచేసుకున్నాడు. అందుకు అతను బెయిల్ బాండ్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు.

మొత్తం 16 మంది విద్యార్థులు కోర్టు తీర్పు మేరకు వాలంటరీగా ఫిబ్రవరి 26లోగా యూఎస్ వదిలి వెళ్లాల్సి ఉంటుంది. విద్యార్థులు కూడా తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. తిరుగు ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్ల విషయంలో సహకరించాలని ఇమ్మిగ్రేషన్ అధికారులను అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. విద్యార్థుల తరఫున వాదించేందుకు ఆటా-తెలంగాణ అటార్నీలను ఏర్పాటు చేసింది.