Begin typing your search above and press return to search.

16వ ఐపీఎల్ ఫైనల్ వేళ.. 16 ఆసక్తికర అంశాలు

By:  Tupaki Desk   |   28 May 2023 4:00 PM GMT
16వ ఐపీఎల్ ఫైనల్ వేళ.. 16 ఆసక్తికర అంశాలు
X
గడిచిన కొన్ని వారాలు క్రికెట్ అభిమానుల కు పండుగ్గా మారిన ఐపీఎల్ సీజన్ చివరకు వచ్చేసింది. ఈ రోజున పదహారో ఐపీఎల్ ఫైనల్ పోటీ జరగనుంది. ఈ పోటీలో చెన్నై సూపర్ కింగ్స్.. గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. గతంలో జరిగిన ఐపీఎల్ టోర్నీకి భిన్నంగా ఈసారి ఫైనల్లో తలపడే రెండు జట్లు కూడా తమ అద్భుతమైన ఆటతీరుతో ఫైనల్ కు చేరాయని చెప్పాలి. లక్ తో కాకుండా ఆటతీరుతో ఫైనల్ కు చేరిన రెండు సమఉజ్జీల మధ్య పోరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. స్వీట్ సిక్స్ టీన్ ఐపీఎల్ టోర్నీ ట్రోఫిని ఎవరు సొంతం చేసుకుంటారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఫైనల్ వేళ.. ఫైనల్ పోరుకు సంబంధించిన పదహారు ఆసక్తికర విశేషాల్లోకి వెళితే..

1. ఈసారి ఐపీఎల్ టోర్నీ మొదటి మ్యాచ్ లో తలపడిన చెన్నై.. గుజరాత్ జట్లే.. ఫైనల్ లోనూ తలపడటం ఆసక్తికరంగా మారింది. ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న అహ్మదాబాద్ లో టోర్నీలో భాగంగా జరిగిన మూడు మ్యాచుల్లో నూ చెన్నై కి చేదు అనుభవాలు ఎదురైన నేపథ్యంలో.. ఫైనల్ లో అయినా మార్పు వస్తుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

2. ఈ ఐపీఎల్ టోర్నీ తొలి మ్యాచ్ అహ్మదాబాద్ లో జరిగింది. ఈ మ్యాచ్ లో గుజరాత్ - చెన్నై జట్ల మధ్యనే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో చెన్నై ఓటమి పాలు కాగా.. ఆ తర్వాత చెన్నై లో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ జట్టు ను ఓడించటం ద్వారా ప్రతీకారం తీర్చుకుంది. దీంతో సమంగా ఉన్న ఇరు జట్ల మధ్య ఇప్పుడు ఫైనల్ పోరు జరుగుతుంది. దీంతో.. ఎవరు ఎవరికి షాకిస్తారన్నదే ఇప్పుడు ప్రశ్న.

3. బౌలింగ్ లో గుజరాత్ జట్టు.. బ్యాటింగ్ లో చెన్నై జట్టు కొంత పైచేయిలో ఉన్న విషయం తెలిసిందే. తమకు మంచి రికార్డు ఉన్న అహ్మదాబాద్ లో మ్యాచ్ జరుగుతుండటం గుజరాత్ జట్టుకు కలిసి వచ్చే అంశం. దీనికి తోడు సొంత జట్టుకు సొంత ప్రజల మధ్య ఉండే ఆదరణ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అందుకు భిన్నంగా చెన్నై జట్టు పరిస్థితి ఉంది.

4. ఐదోసారి ఐపీఎల్ కప్పు ను సొంతం చేసుకోవటం ద్వారా అత్యధిక టైటిళ్ల ను సొంతం చేసుకున్న ముంబయి జట్టు రికార్డు ను చెన్నై సమం చేస్తుందా? అన్నది ఈ ఫైనల్ టోర్నీ తేల్చనుంది. అదే సమయంలో.. గత సీజన్ లో విజేతగా నిలిచిన గుజరాత్ జట్టు వరుసగా రెండోసారి తన సత్తా చాటి విజేతగా అవతరిస్తుందా? అన్నది ఇప్పుడు ప్రశ్న.

5. మరో నలబై రోజుల్లో 42వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు ధోని. వయసురీత్యా ఈ టోర్నీతో ఐపీఎల్ కు సైతం గుడ్ బై చెబుతారని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన సంకేతాల్ని ఇప్పటికే మహీ ఇచ్చినా.. అతను వచ్చే ఏడాది కూడా ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి.. మహి మనసులోని మాట ఈ రోజు తేలిపోతుందంటున్నారు. ఒకవేళ ఆట ముగిసిన తర్వాత తన రిటైర్మెంట్ గురించి ప్రకటిస్తే మాత్రం.. ధోనీ ఐపీఎల్ జర్నీకి ఈ రోజు ఆఖరు. మరేం జరుగుతుందో ఈ రాత్రికి తేలే వీలుంది.

6. ఈ సీజన్ లో ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ సౌలభ్యాన్ని ఇతర జట్లు తమకు అనుగుణంగా వేర్వేరు ప్లేయర్లను వాడితే.. గడిచిన కొన్ని మ్యాచులుగా గుజరాత్.. చెన్నై జట్లు మాత్రం ఇద్దరినే ఉపయోగించుకున్నాయి. చెన్నై మొదట బ్యాటింగ్ చేస్తే దూబె ను తుది జట్టులోకి తీసుకొని.. బౌలింగ్ లో పతిరన ను ఇంపాక్ట్ ప్లేయర్ గా ఉపయోగించుకునే వీలుంది. అదే తొలుత బ్యాటింగ్ చేస్తే పతిరనను తుది జట్టులో ఆడించి.. తర్వాత దూబె ను ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడించే వీలుంది. అదే గుజరాత్ విషయానికి వస్తే.. శుభమన్.. జోష్ లిటిల్ ను ఇలానే ఆడిస్తున్నారు. ఫైనల్ లోనూ ఇదే వ్యూహాన్ని ఇరు జట్లు అమలు చేసే వీలుంది.

7. ఈ సీజన్ లో నిలకడగా.. సమిష్టిగా బ్యాటింగ్ లో రాణిస్తున్న జట్టు చెన్నై అయితే.. బౌలింగ్ విషయంలో ఇదే తీరును ప్రదర్శిస్తున్న జట్టుగా గుజరాత్. ఫైనల్ లోనూ ఇదే జరుగుతుందని చెప్పాలి.

8. ఈ సీజన్ లో బంతితో అద్భుతాల్ని క్రియేట్ చేసిన జట్టుగా గుజరాత్ ను చెప్పాలి. ఈ సీజన్ లో టాప్ 3 బౌలర్లు గుజరాత్ జట్టు సభ్యులే ఉండటం విశేషం. ఈ టోర్నీలో ఇప్పటికే షమీ 28 వికెట్లు.. రషీద్ 27 వికెట్లు.. మోహిత్ 24 వికెట్ల తో మొదటి మూడు స్థానాల్లో ఉన్నారు. షమీ మరో ఐదు వికెట్లు పడగొడితే ఒక సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా అవతరిస్తాడు. అదే జరితితే.. డ్వేన్ బ్రావో.. హర్షల్ పటేల్ పేరుతో ఉన్న రికార్డును బ్రేక్ చేసినట్లు అవుతుంది. ఇప్పటివరకు ఒకే సీజన్లో అత్యధిక వికెట్ల తీసిన బౌలర్ 32 వికెట్లు తీశారు.

9. ఈ రోజుతో జరిగే ఫైనల్ పోరుతో పదహారో ఐపీఎల్ టోర్నీ ముగుస్తుంది. ఇప్పటివరకు జరిగిన ఐపీఎల్ టోర్నీల్లో అత్యధిక ఫైనల్ పోరులో ఆటగాడిగా ధోనీ నిలుస్తారు. తాజా పోరుతో అతను పదకొండో సారి ఆడుతున్నారు. ఇప్పటివర కు ఇన్ని ఫైనల్ పోరులో ఆడిన ఆటగాళ్లు లేరు.

10. గుజరాత్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న హార్దిక్ కు సంబంధించిన ఒక ఆసక్తికర అంశం ఉంది. అతను ఇప్పటివరకు ఐదు ఐపీఎల్ టోర్నీ ఫైనల్స్ లో ఆడారు. అతను ఫైనల్ లో ఆడిన ఐదుసార్లు..గెలిచిన జట్టు వైపే ఉన్నారు. మరి.. ఆ మ్యాజిక్ ఈసారీ రిపీట్ అవుతుందా? లేదా? అన్నది చూడాలి.

11. ఈసారి ఐపీఎల్ లో బ్యాట్ తో చెలరేగిపోయిన బ్యాట్స్ మెన్లలో గిల్. ఒక ఐపీఎల్ సీజన్ లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా కోహ్లీ పేరుతో రికార్డు ఉంది. 2016లో అతను అత్యధికంగా 973 పరుగులు చేశారు. ఈ టోర్నీలో ఇప్పటివరకు గిల్ 851 పరుగులు చేశాడు.. కోహ్లీ రికార్డును బ్రేక్ చేయాలంటే గిల్ ఈ మ్యాచ్ లో 123 పరుగులు చేయాలి.

12. ఈ టోర్నీలో నాలుగు మ్యాచ్ ల్లో మూడు శతకాల్ని బాదేసిన గిల్.. తాజా ఫైనల్ లో మరో సెంచరీ సాధిస్తారా? అన్నదిప్పుడు ప్రశ్న. గుజరాత్ జట్టులో శుభ్ మన్ గిల్ స్కోర్ 851 పరుగులు అయితే.. ఇదే జట్టులో రెండో అత్యధిక వ్యక్తిగత పరుగులు 325. ఈ లెక్క ఒక్కటి చాలు.. గిల్ కు గుజరాత్ జట్టులోని మిగిలిన బ్యాట్స్ మెన్లకు మధ్యనున్న తేడా ఎంతన్నది అర్థం చేసుకోవటానికి.

13. ఫైనల్ పోరులో గుజరాత్ ఆశల్ని గల్లంతు చేయాలంటే గిల్ ను ఎంత త్వరగా పెవిలియన్ కు పంపితే అంత మంచిదని చెన్నై జట్టు భావిస్తోంది. అయితే.. గిల్ ను త్వరగా ఔట్ చేసే కార్యాన్ని ఎవరు చేస్తారు? అన్నదిప్పుడు ప్రశ్న. ఈ బాధ్యత ను పతిరన పూర్తి చేస్తాడని ఆశిస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.

14. ఫైనల్ లో అడుగు పెట్టిన రెండు జట్ల సారధులు ఒకేలాంటి తీరు ఉండటం ఆసక్తికరం. ధోని మీద తనకున్న అభిమానాన్ని గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఎప్పుడూ దాచుకోలేదు. గ్రౌండ్ లో ప్రశాంతంగా ఉండి జట్టును నడిపే ధోనీ కి కాపీ మాదిరి హార్దిక్ పాండ్యా నిలుస్తారు. మరి.. ఈ ఇద్దరు ప్రశాంత సారథుల్లో ఎవరిది పైచేయి అవుతుందన్నది ఆసక్తికరమని చెప్పాలి.

15. ఫైనల్ పోరు కు వేదికగా నిలిచిన అహ్మదాబాద్ మైదానంలోని పిచ్ బ్యాట్స్ మెన్లకు అనుకూలం. ఈ సీజన్ లో ఆడిన 8 మ్యాచ్లలో సగటు స్కోర్ 193 పరుగులు. ఇందులో ఐదుసార్లు మొదట బ్యాటింగ్ చేసిన జట్లే గెలిచాయి. ఆకాశం మబ్బులు పట్టినట్లు కనిపించినా వర్షానికి మాత్రం ఛాన్స్ లేదు.

16. ఐపీఎల్ 16 టోర్నీ విజేత జట్టు కు రూ.20 కోట్లు నగదు బహుమతిగా అందనుంది. రన్నరప్ జట్టు రూ.13 కోట్లు దక్కుతుంది. మూడు.. నాలుగు స్థానాల జట్లకు సైతం వరుసగా రూ.7 కోట్లు.. రూ.6.5 కోట్లు దక్కనున్నాయి. అత్యధికంగా పరుగులు చేసే బ్యాట్స్ మెన్ కు.. అత్యధికంగా వికెట్లు తీసే బౌలర్ కు రూ.15 లక్షల చొప్పున ఇస్తారు. టోర్నీలో వర్థమాన ఆటగాడికి రూ.20 లక్షలు.. మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ కు రూ.12 లక్షలు ఇస్తారు.