Begin typing your search above and press return to search.

గుజరాత్ లో ఘోరం..15 వేల మంది పసికందుల మృతి

By:  Tupaki Desk   |   5 March 2020 5:00 AM IST
గుజరాత్ లో ఘోరం..15 వేల మంది పసికందుల మృతి
X
గుజరాత్ రాష్ట్రాన్ని తాను అభివృద్ధిపథంలో నడిపించానని, అదే తరహా గుజరాత్ మోడల్ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలంటే తనను ప్రధానిని చేయాలని నాటి గుజరాత్ ముఖ్యమంత్రి, నేటి భారత ప్రధాని పలు సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే. గుజరాత్ మాదిరిగా అన్ని రాష్ట్రాలు అందంగా కనిపించాలంటే తానే పీఎం కావాలని మోడీ అన్నారు. అయితే, తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన సందర్భంగా అహ్మదాబాద్ లోని మురికి వాడలు కనిపించకుండా గోడ కట్టడం విమర్శలకు తావిచ్చింది. అది గుజరాత్ మోడల్ వాల్ అని.... 'గుజరాత్ మోడల్' అంతా ఫేకని విపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఇక, తాజాగా అభివృద్ధి సూచీల్లో అందరికంటే ముందుండే గుజరాత్‌ కు సంబంధించిన మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. గత రెండేళ్ల కాలంలో గుజరాత్ లోని ప్రభుత్వాసుపత్రుల్లో మొత్తం 15,013 మంది నవజాత శిశువులు చనిపోయారన్న విషయం పెనుదుమారం రేపుతోంది.

గుజరాత్ లో నవజాత శిశువుల మరణాలపై తాజాగా జరుగుతోన్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం, ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి నితిన్ పటేల్ చెప్పిన గణాంకాలు షాక్ ఇచ్చేలా ఉన్నాయి. గుజరాత్ లోని ప్రభుత్వాసుపత్రుల్లో 2018 జనవరి నుంచి 2019 డిసెంబర్ వరకు మొత్తం 1,06,000 మంది శిశువులు జన్మించగా వారిలో 72 వేల మందికి ఆరోగ్య పరమైన సమస్యలు వచ్చాయని నితిన్ పటేల్ చెప్పారు. సిక్ న్యూబార్న్ కేర్(ఎస్ఎన్సీ) యూనిట్లలో చికిత్స పొందుతూ 15,013 మంది మరణించారని వెల్లడించారు. అహ్మదాబాద్ లో అత్యధికంగా 4,322 మంది, వడోదరలో 2,362 మంది, సూరత్ లో 1986 మంది శిశువులు మృత్యువాతపడ్డారని తెలిపారు.

ఎస్ఎన్సీ యూనిట్లలో డాక్టర్లు, వైద్య సిబ్బంది తక్కువగా ఉన్నారని, అందువల్లే ఈ మరణాల సంఖ్యను తగ్గించలేకపోయామని నితిన్ పటేల్ తెలిపారు. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఆదేశాలు జారీచేశామని, ప్రస్తుతం ఉన్న వారికి ప్రత్యేక ట్రైనింగ్ ఇస్తామని అన్నారు. కొత్త యంత్ర పరికరాలు కూడా కావాలని చెప్పారు. ఆ మరణాలను అరికట్టడానికి బీజేపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని అన్నారు. బీజేపీ సర్కార్ పై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. ప్రభుత్వ వివరణపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మండిపడింది. అప్పుడే పుట్టిన బిడ్డలు వేల సంఖ్యలో చనిపోయినా బీజేపీ చలించడం లేదని, 'గుజరాత్ మోడల్' అంతా ఫేకని మరోసారి రుజువైందని కాంగ్రెస్ నేతలు విమర్శించారు.