Begin typing your search above and press return to search.

15వేల భృతి.. అమ్మఒడి అర్హతలు ఇవే

By:  Tupaki Desk   |   4 Nov 2019 8:18 AM GMT
15వేల భృతి.. అమ్మఒడి అర్హతలు ఇవే
X
అఖండ మెజార్గీతో గద్దెనెక్కిన వైఎస్ జగన్ ఎన్నికల ముందు తాను ప్రజలకు ఇచ్చిన హామీలను శరవేగంగా అమలు చేస్తూ ప్రజల మనసులను చూరగొంటున్నారు. ఆ కోవలోనే తాజాగా ‘అమ్మ ఒడి’ పథకాన్ని అమలు చేయడానికి నిర్ణయించారు. ఇందుకోసం ఏకంగా 6450 కోట్ల నిధులను విడుదల చేసేందుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.

*ఒక్కో విద్యార్థి తల్లి/తండ్రి/పోషకులకు రూ.15వేలు
అమ్మ ఒడి పథకంలో భాగంగా దారిద్ర రేఖకు దిగువన ఉన్న విద్యార్థి తల్లి లేదా తండ్రి, పోషకులకు రూ.15వేలను ప్రభుత్వం అందజేస్తుంది. తల్లిదండ్రులు లేని పక్షంలో ఆ విద్యార్థుల సంరక్షకులకు రూ.15వేలు ఇస్తారు.

*ఎవరు అర్హులు..?
ఒకటో తరగతి నుంచి 12వ తరగతి చదివే పిల్లల తల్లులకు, సంరక్షకులకు ఈ పథకం వర్తిస్తుంది. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాలు ఈ పథకానికి అర్హులు. రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీలు సహా ప్రభుత్వ, ప్రైవేట్ , ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో చదువుతున్న పిల్లల తల్లిదండ్రులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. ఖచ్చితంగా ఈ పథకం కోసం తెల్లరేషన్ కార్డ్, ఆధార్ కార్డు ఉండాలి. పేదరికంలో ఉండి తెల్లరేషన్ కార్డ్ లేకున్నా అర్హత ఉంటే విచారించి అమ్మఒడి పథకం వర్తింప చేస్తారు.

*75శాతం హాజరు తప్పనిసరి
ఇక అమ్మ ఒడి పథకం విద్యార్థికి వర్తించాలంటే ఖచ్చితంగా విద్యార్థులు డిసెంబర్ 31 నాటికి 75శాతం హాజరు కలిగిఉండాలి. పాఠశాలల ఉపాధ్యాయులు వీరి హాజరును ప్రభుత్వానికి సమర్పించాలి.

*ఎవరిని సంప్రదించాలి?
ఈ అమ్మఒడికి అర్హులైన వారు గ్రామ వలంటీర్ ను గానీ.. లేదా గ్రామ సచివాలయాన్ని కానీ సంప్రదించవచ్చు.

*ఏపీలో ఎంతమందికి లబ్ధి
అమ్మఒడి పథకం ద్వారా ఏపీలో దాదాపు 43 లక్షలమందికి లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం అంచనావేస్తోంది. వచ్చే సంవత్సరం జనవరి 26న ఈ స్కీంను ప్రభుత్వం ప్రారంభించనుంది.

*వీరికి అమ్మఒడి అందదా?
ఏపీ ఆర్థిక పరిస్తితి దృష్ట్యా, గురుకులాలు, సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులను ఈ పథకంలో మినహాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఆదాయపు పన్ను చెల్లించేవారికి, ఐదు ఎకరాల మాగాణి ఉన్నవారికి, వ్యవసాయ భూమిని నివాస స్థలంగా మార్చుకున్న వారికి ఈ స్కీం నుంచి మినహాయింపు ఇచ్చే అవకాశాలను పరిశీలిస్తున్నారు.