Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబు 'ఆప‌రేష‌న్ టీఎస్ ఎల‌క్ష‌న్స్'?

By:  Tupaki Desk   |   13 Sept 2018 12:35 PM IST
చంద్ర‌బాబు ఆప‌రేష‌న్ టీఎస్ ఎల‌క్ష‌న్స్?
X
తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌ల హ‌డావిడి మొద‌లైన సంగ‌తి తెలిసిందే. రాబోయే ఎన్నిక‌ల్లో గెలుపు కోసం అన్ని పార్టీలు హామీలు గుప్పించ‌డం....ప్ర‌త్య‌ర్థుల‌ను చిత్తు చేసేందుకు వ్యూహ ప్ర‌తి వ్యూహాలు ర‌చించ‌డం.....పాచిక‌లు వేయ‌డం మామూలే. ఆ క్ర‌మంలోనే ఇప్ప‌టికే తెలంగాణ‌లో ఆప‌రేష‌న్ ఆకర్ష్ కూడా మొద‌లైంది. తెలంగాణ ఎన్నిక‌ల‌ను టీఆర్ ఎస్ , కాంగ్రెస్ లు అధికారం ద‌క్కించుకునేందుకు ఓ అస్త్రంలా ఉప‌యోగించుకుంటున్నాయి. అయితే, పైకి మాత్రం పోటీ చేస్తున్న‌ట్లు క‌నిపిస్తోన్న‌ టీడీపీ....ఫోక‌స్ అధికారంపై లేదు. తెలంగాణ‌లో టీడీపీని బ‌లోపేతం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ఏపీ సీఎం చంద్ర‌బాబు వ్యూహ‌ర‌చ‌న చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే `ఆప‌రేష‌న్ టీఎస్ ఎల‌క్ష‌న్స్`కు చంద్ర‌బాబు శ్రీ‌కారం చుట్టారట‌. ఏపీకి చెందిన 15 మంది ఇంటెలిజెన్స్ అధికారులు వారం రోజుల నుంచి హైద‌రాబాద్ లో మ‌కాం వేసి ఆ ఆప‌రేష‌న్ లో భాగంగా చంద్ర‌బాబు ఆదేశాల‌కు అనుగుణంగా పని ప్రారంభించార‌ట‌.

హైద‌రాబాద్..వ‌రంగ‌ల్...మ‌హ‌బూబ్ న‌గ‌ర్....ఇలా తెలంగాణ‌లో తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులు ఉండ‌డం పెద్ద విష‌యంకాదు. అయితే, ఏపీకి చెందిన 15మంది ఇంటెలిజెన్స్ అధికారులు...గ‌త వారం రోజులుగా తెలంగాణ‌లోని ప‌లు జిల్లాల్లో మ‌కాం వేసి....సీక్రెట్ గా త‌మ ప‌ని కానిస్తున్నార‌ట‌. తెలంగాణ‌లో టీడీపీ త‌ర‌ఫున గెలుపు గుర్రాలెవ‌రు అనే విష‌యం తెలుసుకునేందుకే చంద్ర‌బాబు ఆదేశాల ప్ర‌కారం వారు ఈ ఆప‌రేష‌న్ చేప‌ట్టారు. వాస్త‌వానికి, తెలంగాణ‌లో ఓటుకు నోటు కేసు త‌ర్వాత టీడీపీ ఉనికే ప్ర‌శ్నార్థ‌క‌మైంది. ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్ తో పొత్తుకు వెళుతున్న చంద్ర‌బాబుకు కొత్త చిక్కు వ‌చ్చిప‌డింది. పొత్తు ప్ర‌కారం...టీడీపీకి 15 స్థానాలు ద‌క్కే అవ‌కాశ‌ముంది. అయితే, ఆ 15 స్థానాల్లో టీడీపీ త‌ర‌ఫున బ‌రిలోకి దిగి గెల‌వ‌గ‌లిగే వారెవరు అనే అంశంపై బాబు ఫోక‌స్ చేశార‌ట‌. ఆ స్థానాల్లో స‌మ‌ర్థులైన వారి ఎంపిక కోసం ఆ అధికారుల‌ను పుర‌మాయించార‌ట‌. ఆ అధికారులు ఇచ్చే రిపోర్ట్ ను బ‌ట్టి అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయ‌బోతున్నార‌ట‌. అయినా, ఒక రాష్ట్ర ఇంటెలిజెంట్ అధికారుల ...మ‌రో రాష్ట్రంలో సీక్రెట్ గా ఇటువంటి స‌ర్వే చేప‌ట్టాల్సి రావ‌డం..ఏమాత్రం స‌బ‌బు కాద‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇపుడు తెలంగాణ రాజ‌కీయాల్లో ఇదే హాట్ టాపిక్ అయింది.