Begin typing your search above and press return to search.

ఆ విషాదానికి నేటితో 14 ఏళ్లు .. అదో మరపురాని పీడకల !

By:  Tupaki Desk   |   25 Aug 2021 2:00 PM IST
ఆ విషాదానికి నేటితో 14 ఏళ్లు .. అదో మరపురాని పీడకల !
X
మహానగరం హైదరాబాద్ తో పాటు దేశం మొత్తాన్ని ఒక్కసారి ఉలిక్కిపడేలా చేసిన గోకుల్ చాట్, లుంబిని పార్క్ జంట పేలుళ్ల దుర్ఘటన చోటు చేసుకొని, నేటితో 14 ఏళ్ళు పూర్తయ్యాయి. 2007 ఆగస్టు 25 కోఠిలోని గోకుల్ చాట్, సచివాలయానికి ఎదురుగా ఉన్న లుంబినీ పార్కులో కొద్ది సమయం తేడాలో రెండు చోట్ల బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో మొత్తం 44 మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. బాంబుల్లో వినియోగించిన ఇనుప ముక్కల ధాటికి చాలామంది శరీర అవయవాలు కోల్పోయి జీవచ్ఛాలుగా చల్లా చెదురుగా పడిపోయారు.

పేలుళ్ల తర్వాత సిటీలోని ర‌ద్దీ ప్రాంతాల్లో సోదాలు చేసిన‌ పోలీసులు.. 19 బాంబులను గుర్తించి వాటిని పేలకుండా నిర్వీర్యం చేశారు. పేలుళ్లకు పాల్పడిన నిందితులకు జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యేక కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఐదుగురు నిందితుల్లో ఇద్దరు నిందితులకు ఎన్‌ఐఏ కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఈ కేసులో ఏ-1 గా ఉన్న హానిక్ షఫిక్ సయ్యద్, ఏ-2 మహమ్మద్ ఇస్మాయిల్ చౌదరిలను ఎన్‌ఐఏ కోర్టు దోషిగా తేల్చింది. ఇండియన్ ముజాహిదీన్ సంస్థ పేలుళ్లకు పాల్పడింది. కోర్టు శిక్ష ఖరారు చేసినప్పటికీ ఇప్పటి వరకు తీర్పు మాత్రం అమలు కాలేదు.

ఆ దారుణమైన జరిగి 14 ఏళ్లు గడిచినా నిందితులకు శిక్ష అమలు కాలేదు. ఎంతోమంది అమాయకులను పొట్టనపెట్టుకున్న కిరాతకులు.. ఇంకా జైల్లోనే జీవిస్తున్నారు. నిందితులైన అక్బర్, అనీఖ్, అన్సార్‌ ను పోలీసులు 2008 అక్టోబర్‌ లో ముంబై పోలీసులు అరెస్టు చేశారు. 2009లో హైదరాబాద్‌ కు తీసుకువచ్చి ఇక్కడి కోర్టులో హాజరుపరిచారు. పేలుళ్లు జరిపింది తామేనని అంగీకరించారు. ఈ కేసులో నిందితులైన మరో 8 మంది పరారీలో ఉన్నారు. ఈ జంటపేలుళ్ల వ‌ల్ల గాయ‌ప‌డిన కొంద‌రు ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు. ఆనాటి భయంక‌ర ప‌రిస్థితుల‌ను గుర్తు చేసుకుంటూ విలపిస్తున్నారు. ఘటన జరిగి14 ఏళ్లయినా కూడా ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి సాయం అందలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితులను వెంటనే ఉరి తీయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.