Begin typing your search above and press return to search.

14 ఏళ్ల తెలుగమ్మాయి.. కరోనా పరిశోధనలో సాధించింది

By:  Tupaki Desk   |   29 Oct 2020 9:01 PM IST
14 ఏళ్ల తెలుగమ్మాయి.. కరోనా పరిశోధనలో సాధించింది
X
ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ కు మందులు లేక.. వ్యాక్సిన్ రాక జనాలు అరిగోసపడుతున్నారు. శీతాకాలం రావడంతో ఇప్పుడు కరోనా ముప్పు ఇంకా తీవ్రమవుతోంది. ఇప్పుడు కరోనా వైరస్ కు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు అహర్నిశలు పాటుపడుతున్నారు.

తాజాగా కరోనా పరిశోధనల్లో తెలుగమ్మాయి సత్తా చాటింది. అమెరికాలో నివాసం ఉంటున్న తెలుగు బాలిక అనికా చేబ్రోలు మానవ కణాల్లోకి కరోనా వైరస్ ప్రవేశించకుండా అడ్డుకునేందుకు తోడ్పడే ఓ అణువును కనుగొని గొప్ప ఘనత సాధించింది. ఇందుకు గాను అమెరికాలో టాప్ యంగ్ సైటింస్ట్-2020 అవార్డుకు ఎంపికైంది. ఆమె పూర్వీకులది ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు కావడం విశేషం.

14 ఏళ్ల బాలిక అనికా చేబ్రోల్ టెక్సాస్ లోని ప్రిస్కోలో ఓ హైస్కూల్ లో చదువుతోంది. కరోనా వైరస్ కు అంటిపెట్టుకొని ఉంటూ మనుషులకు సంక్రమించకుండా అడ్డుకునే అణువును ఆమె కనిపెట్టారు. ఈ ఆవిష్కరణకు గాను అనికాకు ‘మల్టీనేషనల్ కార్పొరేషన్ 3డీ’ ఆమెకు రూ.25000 డాలర్లను బహుమతిగా అందించనుంది.

కరోనా వైరస్ అసలు పేరు సార్స్-కోవ్2. దీని చుట్టూ కిరీటం లాంటి వలయం ఉంటుంది. అందుకే దీన్ని కరోనా వైరస్ అని పిలుస్తుంటారు. లాటిన్ లో కరోనా అంటే కిరీటం అని అర్థం. ఈ చుట్టూ ఉండే వలయంలో మేకు ఆకారంలో ఒక ప్రొటీన్ (ప్రోటీన్ఎస్) ఉంటుంది. ఇది మన శరీరంలోని కణాల గ్రాహకాలతో అనుసంధానమై వైరస్ సోకేలా చేస్తుంది. ప్రస్తుతం ఈ కీలకమైన ప్రొటీన్ పైనే అనికా పరిశోధన చేసి కనిపెట్టింది.