Begin typing your search above and press return to search.

మైనర్​ కు గర్భం.. భర్తపై కేసు ..!

By:  Tupaki Desk   |   11 April 2021 5:00 PM IST
మైనర్​ కు గర్భం.. భర్తపై కేసు ..!
X
దేశంలో బాల్యవివాహం అనేది ఓ దురాచారం. ఇది చట్ట విరుద్ధం కూడా. 18 ఏళ్లు దాటనిదే అమ్మాయికి వివాహం చేయడానికి వీల్లేదు. కానీ ఇప్పటికీ చాలా పల్లెటూర్లలో బాల్యవివాహాలు జరుగుతుంటాయి. కానీ ఉభయ పక్షాలు , గ్రామస్థులు చూసి చూడనట్టు వ్యవహరిస్తారు కాబట్టి ఈ వివాహాలపై కేసులు నమోదు కావు. అప్పుడప్పుడు.. పోలీసులు, మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారులు రైడ్స్​ చేస్తుంటారు. అయినప్పటికీ ఎక్కడో ఓ చోట బాల్యవివాహాలు జరుగుతూనే ఉంటాయి.

తాజాగా ఓ 13 ఏళ్ల బాలిక గర్భం దాల్చడంతో బాల్య వివాహం వెలుగుచూసింది. దీంతో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదుచేశారు. అమ్మాయి భర్తపై, పెళ్లికి ప్రేరేపించిన పెద్దలపై కేసులు నమోదు చేశారు. తమిళనాడులోని ధర్మపురి జిల్లా మారండహళ్లి సమీపంలోని చిన్నె గౌండనూరు గ్రామానికి చెందిన దేవరాజ్​ (24 ) .. రాయకోటి ప్రాంతానికి చెందిన 13 ఏళ్ల బాలికను గత జనవరిలో వివాహం చేసుకున్నాడు.

అయితే ఇటీవల బాలికకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆస్పత్రిలో చూపించుకున్నది. దీంతో ఆమెకు పరీక్షలు చేసిన పీహెచ్​సీ వైద్యులు బాలిక గర్భం దాల్చినట్టు చెప్పారు. ఆమెను వెంటనే క్రిష్ణగిరి జిల్లా పిల్లల సంక్షేమ శాఖకు తరలించారు. అనంతరం పోలీసులు మైనర్‌ ను పెళ్లి చేసుకున్న నేరంపై భర్త దేవరాజ్‌ పై పోక్సో కేసు పెట్టి అరెస్టు చేశారు.

బాల్యవివాహాలు చేసుకోవద్దని అధికారులు, పోలీసులు మొత్తుకుంటున్నా.. చాలా చోట్ల గుట్టుచప్పుడుకాకుండా పెళ్లిల్లు జరుగుతున్నాయి. బాల్య వివాహాలు వద్దని ఇప్పటికే పోలీసులు, అధికారులు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ పలు చోట్ల ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.