Begin typing your search above and press return to search.

ఓ వ్యక్తి అత్యుత్సాహానికి 13 మంది సజీవ దహనం!

By:  Tupaki Desk   |   6 Nov 2022 11:01 AM IST
ఓ వ్యక్తి అత్యుత్సాహానికి 13 మంది సజీవ దహనం!
X
రష్యాలో ఓ వ్యక్తి అత్యుత్సాహంతో చేసిన పనికి 13 మంది కాలిబూడిదయ్యారు. ఈ ఘటన రష్యాలోని కోస్ట్రోమా నగరంలో విషాదం నింపింది. శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ ఘటన పూర్తి వివరాల్లోకెళ్తే.. వారాంతం కావడంతో వినోదం కోసం కోస్ట్రోమా నగరంలోని నైట్‌క్లబ్‌కు భారీ సంఖ్యలో సందర్శకులు వచ్చారు. ఈ క్రమంలో ఒక వ్యక్తి అత్యుత్సాహంతో ఫ్లేర్‌ గన్‌తో సీలింగ్‌ను షూట్‌ చేశాడు. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

భారీ ఎత్తున దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. దీంతో 13 మంది బలయ్యారు. ఈ ఘటనలో పలువురికి కాలిన గాయాలయ్యాయి. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో శ్వాస అందక లోపలి నుంచి జనం బయటకు రాలేకపోయారు. పొగ కారణంగా ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడంతో సొమ్మసిల్లి పడిపోయారు.

క్లబ్‌లోని ఓ వ్యక్తి ఫ్లేర్‌ గన్‌తో సీలింగ్‌కు షూట్‌ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు రష్యా అధికార మీడియా టాస్‌ న్యూస్‌ ఏజెన్సీ వివరించింది. మంటలు క్షణాల్లోనే క్లబ్‌ లోపలి భాగమంతా అంటుకున్నాయని వెల్లడించింది. దీంతో దట్టమైన పొగ క్లబ్‌ అంతా అలుముకుందని టాప్‌ న్యూస్‌ ఏజెన్సీ తెలిపింది. దీంతో నైట్‌క్లబ్‌ లోపల ఉన్నవారు బయటకు వచ్చేదారిలేక.. శ్వాస అందక 13 మంది సజీవ దహనమయ్యారని వెల్లడించింది.

మరోవైపు ఘటన గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక బృందాలు అక్కడకు చేరుకుని సహాయక చర్యలను చేపట్టాయి. పోలీసులు, అగ్నిమాపక బృందాలు ఈ ప్రమాదం నుంచి 250 మందిని రక్షించాయి.

కాగా మంటలు దాదాపు 3,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో మంటలు చెలరేగాయి. దీంతో సహాయ చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీంతో మంటలను చల్లార్చడానికి ఐదు గంటలపాటు శ్రమించాల్సి వచ్చింది.

కాగా ఈ విషాద ఘటనకు కారణమైన నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేసినట్టు సమాచారం. విచారణ జరుగుతోందని.. ఈ ప్రమాదంలో ఎంతమంది మృతి చెందారనేది తెలుస్తుందని దర్యాప్తు కమిటీ పేర్కొంది.