Begin typing your search above and press return to search.

ఐరాసా సాక్షిగా అమెరికాకు షాకిచ్చిన భార‌త్‌

By:  Tupaki Desk   |   22 Dec 2017 12:12 PM IST
ఐరాసా సాక్షిగా అమెరికాకు షాకిచ్చిన భార‌త్‌
X

అగ్ర‌రాజ్యం అమెరికాకు భార‌త్ షాకిచ్చింది. అది కూడా ప‌రోక్షంగా కాకుండా ప్ర‌త్య‌క్షంగానే త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించింది. దీంతోపాటుగా త‌న‌ను అమెరికా ప్ర‌భావితం చేయలేద‌నే విష‌యాన్ని పున‌రుద్ఘాటించింది. ఇదంతా...ఇజ్రాయెల్ రాజధానిగా జెరుసలెంను గుర్తిస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించడం - అది కూడా సాక్షాత్తు ఐక్యరాజ్య సమితి వేదిక‌గా భార‌త్ చేసింది. జెరుస‌లెం విష‌యంలో ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చేసిన తీర్మానానికి 128 దేశాలు మద్దతు తెలిపాయి. అందులో ఇండియా కూడా ఒకటి. 9 దేశాలు అమెరికాకు మద్దతు తెలపగా.. 35 దేశాలు ఓటింగ్‌ కు దూరంగా ఉన్నాయి. అగ్రరాజ్యానికి ఐక్యరాజ్య సమితిలో ఇది ఒకరకంగా ఘోర పరాభవమే.

జెరుస‌లెం విష‌యంలో తమ నిర్ణయం స్వతంత్రంగా ఉంటుంది తప్ప మరొకరి ఒత్తిడి తమపై ఉండదని ఇంతకుముందే ఇండియా స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అందుకు తగినట్లే అమెరికా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భారత్ ఓటేసింది. పాలస్తీనా విషయంలో దశాబ్దాలుగా అనుసరిస్తున్న విధానాన్నే భారత్ కొనసాగించినట్లు ఓ దౌత్యవేత్త వెల్లడించారు. ఇది అమెరికా - ఇజ్రాయెల్‌ లతో ఉన్న సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపబోదని, అమెరికా అత్యంత సన్నిహిత దేశాలు కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆ దౌత్యవేత్త స్పష్టంచేశారు. అమెరికా ఇందులో ఓడిపోతుందని ముందే తెలుసని తెలిపారు.

భద్రతా మండలిలోనూ తమ నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్మానం చేయగా.. దానిని అమెరికా వీటో చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయంలో తమకు వ్యతిరేకంగా ఉన్న దేశాలన్నింటినీ గుర్తు పెట్టుకుంటామని, తమ సాయం పొందిన దేశాలు కూడా తమను లక్ష్యంగా చేసుకోవడం సహించరానిదని అమెరికా రాయబారి నిక్కీ హేలీ హెచ్చరించడం గమనార్హం. అమెరికా మిత్ర దేశాలైన ఫ్రాన్స్ - బ్రిటన్ - ఇటలీలాంటి దేశాలు కూడా భద్రతా మండలిలో అమెరికా నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. మాకు వ్యతిరేకంగా ఓటైతే వేయనీయండి చూద్దాం అని బుధవారమే ట్రంప్ హెచ్చరించారు. తమను వ్యతిరేకించిన వారికి ఇక నుంచి సాయం చేయబోమని ఆయన స్పష్టంచేశారు. తమకే కోట్ల డాలర్లు మిగిలిపోతాయని కూడా ట్రంప్ అనడం గమనార్హం. ట్రంప్ చెప్పిన విషయాన్నే జనరల్ అసెంబ్లీలో నిక్కీ హేలీ ప్రస్తావించారు. అయితే అమెరికా ఇలా హెచ్చరించడాన్ని ఐక్యరాజ్య సమితి దేశాలు సహించలేకపోతున్నాయి. ఇది సరైన పద్ధతి కాదని స్పష్టంచేశాయి. ఐక్యరాజ్య సమితిలో టర్కీ - యెమెన్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. ఇరాన్, పాకిస్థాన్‌లాంటి ఇతర దేశాలు మద్దతునిచ్చాయి.