Begin typing your search above and press return to search.

ఏప్రిల్ ‌లో 121.5 మిలియన్ల మంది ఉపాధిని కోల్పోయారు ..ఆర్బీఐ నివేదిక !

By:  Tupaki Desk   |   27 Aug 2020 9:45 AM IST
ఏప్రిల్ ‌లో 121.5 మిలియన్ల మంది ఉపాధిని కోల్పోయారు ..ఆర్బీఐ నివేదిక !
X
కరోనా మహమ్మారి కారణంగా దేశం మొత్తం అస్తవ్యస్తం అయిపోయింది. అన్ని రంగాలపై కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. ఈ మహమ్మారి కారణంగా దేశంలో ఏర్పడిన పరిస్థితులు ఆర్థిక రంగంపై తీవ్ర ప్రభావం చూపించాయి. ముఖ్యంగా దేశంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కొన్ని కోట్ల కుటుంబాలపై కరోనా తీవ్ర ప్రభావం చూపించింది అని తేలింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఒప్పుకొన్నా, ఒప్పుకోకపోయినా వాస్తవ పరిస్థితి మాత్రం ఇదేనని స్పష్టమైంది. కరోనా సంక్షోభం పరిస్థితుల తరువాత దేశంలో నెలకొన్న ఆర్థిక స్థితిగతులపై రిజర్వుబ్యాంకు ఓ నివేదికను తయారుచేసింది. కరోనా మహమ్మారి ప్రభావం దేశంలోని అన్ని రంగాలపైనా పడిందని, ప్రత్యేకంగా ఆతిథ్యరంగం భారీ కుదుపులకి గురైందని ఆర్బీఐ తన నివేదికలో పొందుపరిచింది.

కరోనా విజృంభణ నేపథ్యంలో మార్చి 25 నుండి దేశంలో దాదాపుగా 3 నెలలకి పైగా కేంద్రం లాక్‌ డౌన్ ‌ను అమలు చేసింది. ఆ తరువాత సడలింపులతో కూడిన లాక్ డౌన్ ను అమలు చేస్తూ వస్తుంది. ఇక సెప్టెంబర్ 1 నుండి ఆన్ లాక్ 4 ప్రారంభం కాబోతుంది. ఈ ఆన్ లాక్ లో అన్ని తెరచుకునేందుకు అనుమతులు ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. అయితే , తొలిసారిగా లాక్ డౌన్ అమలు చేసిన సమయంలో దేశంలో ఉన్న 130 కోట్ల జనాభా ఇళ్లకే పరిమితం అయ్యారు. ఎవరిని ఇంటి నుండి బయటకి రానివ్వలేదు. నిర్మాణ రంగం, రవాణా స్తంభించిపోయాయి. వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోయాయి. పరిశ్రమలు మూతపడ్డాయి. దీని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థ మీద సుదీర్ఘకాలం ఉంటుందనే అభిప్రాయాలు అప్పట్లోనే వ్యక్తమయ్యాయి. కరోనా మహమ్మారి ఆతిథ్యరంగం రిజర్వు బ్యాంకు అంచనా వేసింది. హోటళ్లు, రెస్టారెంట్లు, పర్యాటకం, విమానయానం, ఇతర రవాణా రంగాల్లో కరోనా వైరస్ పెను సంక్షోభాన్ని మిగిల్చిందని వెల్లడించింది. ఆయా రంగాలపై ఆధారపడి ఉన్న వేలాదిమంది ఉపాధిని కోల్పోయారని తెలిపింది. ఇతర రంగాల్లోనూ ఉపాధిని కోల్పోయిన వారి సంఖ్య ఉన్నప్పటికీ.. ఆతిథ్యరంగంపైనే ఎక్కువ ప్రభావం ఉంది. నిర్మాణరంగం స్తంభించిపోవడం వల్ల రోజువారీ కూలీలు ఎంతోమంది పని లేక , తినడానికి తిండి లేక రోడ్డున పడ్డారని తెలిపింది.

ఒక్క ఏప్రిల్ నెలలో మాత్రమే 121.5 మిలియన్ల మంది ఉపాధిని కోల్పోయారని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ప్రతినిధి మహేష్ వ్యాస్ వెల్లడించారు. ఇందులో చిరు వ్యాపారులు, తోపుడుబండ్ల వ్యాపారులు, దినసరి వేతన కూలీలు 91.2 మిలియన్ల మంది ఉన్నారని చెప్పారు. ప్రతి నలుగురిలో ముగ్గురు ఉపాధిని కోల్పోయినట్లు తమ సర్వేలో తేలిందని , అయితే ఆన్ లాక్ లో ఈ పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం ఉందని , వీరిలో 90 శాతం మందికి మళ్లీ ఉపాధి లభించే అవకాశం ఉందని చెప్పారు. ఇక , ఎకనమిక్ సర్వేలో వెల్లడయ్యే ఫలితాలు అంచనాలకు అందుకోకపోవచ్చని ఆర్బీఐ సంకేతాలను ఇచ్చింది. ఈ సర్వే ఫలితాలు కొంచెం కష్టంగా ఉండచ్చు అని , ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలు.. వచ్చనెలలో విడుదల చేయడానికి సీఎస్ ఓ .. సన్నహాలు చేస్తోందని, దేశ ఆర్థికరంగానికి సంబంధించినంత వరకూ కీలక విషయాలు తొలి త్రైమాసిక ఫలితాల్లో వెల్లడవుతాయని స్పష్టం చేసింది.