Begin typing your search above and press return to search.

అందరిలా మీరూ అభినందించటమా కేటీఆర్? లోతుల్లోకి వెళ్లరా?

By:  Tupaki Desk   |   24 Sep 2021 11:30 AM GMT
అందరిలా మీరూ అభినందించటమా కేటీఆర్? లోతుల్లోకి వెళ్లరా?
X
అవును.. ఒక చిన్న పిల్లాడు సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ లోనూ వైరల్ గా మారాడు. ఆ పిల్లాడి మాటలు విన్నంతనే.. మరోసారి.. మరోసారి వినిపించేలా ఉండటం ఒక ప్రత్యేకత అయితే.. ఈ పన్నెండేళ్ల పిల్లాడి మాటల్లో.. చూపుల్లో కనిపించే కాన్ఫెడెన్స్.. తాను చేస్తున్న పని మీద తనకున్న కమిట్ మెంట్ మాత్రమే కాదు.. చిన్న వయసులోనే కష్టపడాలన్న తీరుతో పాటు.. నిర్మోహమాటంగా ప్రశ్నించే అతగాడి తీరుకు అందరూ ఫిదా అవుతున్నారు. స్కూల్ పిల్లాడన్నంతనే.. కాస్త ఆలస్యంగా నిద్ర లేవటం.. బద్ధకంగా తయారవుతూ.. గడియారంలో తిరిగే ముల్లు చూపించే టైంతో ఒక్కసారిగా హడావుడి పడుతూ.. అమ్మ పెట్టే టిఫిన్ ను తిన్నామంటే తిన్నామంటూ పరుగులు తీస్తూ స్కూల్ కు వెళ్లటం చాలామంది ఇళ్లల్లో చూస్తుంటాం.

అందుకు భిన్నంగా ఉదయం నాలుగైదు గంటలకే నిద్ర లేచి.. సైకిల్ తీసుకొని ఇంటింటికి పేపర్ వేయటం అంత మామూలు విషయం కాదు. ఎండాకాలం.. వర్షాకాలం.. చలికాలం దేనితోనూ సంబంధం లేకుండా.. ప్రతిరోజూ పొద్దున్నే పేపర్ వేయటం అంత మామూలు విషయం కాదు. చాలామంది పేదింటి పిల్లలు ఇలాంటి పని చేస్తుంటారు. అయితే.. చాలామందిలో కనిపించని ఆత్మవిశ్వాసం ఈ పిల్లాడిలో కనిపించటమే కాదు.. ఏం పేపర్ వేయటం తప్పా? అని ప్రశ్నించిన వైనం అందరిని ఆకట్టుకుంటుంది.

ఇంతకీ ఈ పిల్లాడు ఎక్కడి వాడంటే.. జగిత్యాల టౌన్. పేరు.. శ్రీప్రకాశ్. జగిత్యాల టౌన్ లోని ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదివే ఈ కుర్రాడు ఉదయాన్నే పేపర్ వేస్తున్న వేళ.. ఒక వ్యక్తి అతన్ని ఆపి మాట్లాడటం.. చదువుకునే వయసులో పేపర్ వేస్తున్నావేమిటి? అని ప్రశ్నిస్తే.. ‘ఏం పేపర్ వేయొద్దా? చదువుకుంటున్నా పని చేసుకుంటున్నా. కష్టపడితే తప్పెట్లయితది? ఇప్పుడు కష్టపడితే పెద్దయినంక ఏమైనా చేయొచ్చు’ అని చెప్పిన వైనం.. అది కాస్తా సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ వైరల్ గా మారింది.

ఈ వీడియోను ఒకరు ట్విటర్ లో కేటీఆర్ కు ట్యాగ్ చేయగా.. ఆయన స్పందించి.. సదరు స్టూడెంట్ లోని ఆత్మవిశ్వాసం.. ఆలోచన తీరు నచ్చిందని మెచ్చుకున్నారు. చదువుతున్నప్పుడు పని చేస్తే తప్పేంటి? అని విద్యార్థి ప్రశ్నించిన వైనాన్ని అభినందించారు. ఈ పిల్లాడు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఇదంతా బాగానే ఉంది కానీ.. మంత్రిస్థానంలో ఉన్న కేటీఆర్ లాంటి వారు.. సగటు వ్యక్తుల మాదిరి వీడియోను చూసి మురిసిపోవటం.. అభినందనలు తెలియజేయటం కంటే కూడా.. ఆ పిల్లాడి కష్టం వెనుక కారణం ఏమిటన్నది తెలుసుకుంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలా కష్టపడే వారికి.. మరింత ప్రోత్సాహాన్ని అందిస్తే.. మరింత ఉన్నత శిఖరాల్ని అధిరోహించటం ఈజీ అన్న విషయాన్ని కేటీఆర్ ఎలా మిస్ అయినట్లు చెప్మా?