Begin typing your search above and press return to search.

12 మంది అధికార‌ప‌క్ష ఎమ్మెల్యేలు..3 ఎమ్మెల్సీలు గ‌న్ మెన్ల‌ను వెన‌క్కి

By:  Tupaki Desk   |   22 May 2017 9:32 AM GMT
12 మంది అధికార‌ప‌క్ష ఎమ్మెల్యేలు..3 ఎమ్మెల్సీలు గ‌న్ మెన్ల‌ను వెన‌క్కి
X
ఏపీలో ఊహించ‌ని ప‌రిణామం చోటు చేసుకుంది. ఎక్క‌డైనా పోలీసుల మీద విప‌క్ష నేత‌లు అసంతృప్తి ప్ర‌ద‌ర్శించ‌టం మామూలే. ఇందుకు భిన్నంగా ఏపీ అధికార‌ప‌క్ష నేత‌లు ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా పోలీసుల తీరుపై కినుకుతో ప్ర‌ద‌ర్శించిన నిర‌స‌న ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. పార్టీ.. ప్ర‌భుత్వ ప‌రువు ప్ర‌తిష్ట‌లు ఏమవుతాయ‌న్న ఆలోచ‌న కూడా లేకుండా వారు తీసుకున్న నిర్ణ‌యం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా త‌ణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ‌పై పోలీసులు కేసు న‌మోదు చేసిన సంగ‌తి తెలిసిందే. విధి నిర్వ‌హ‌ణ‌లో ఉన్న ఎస్ ఐ.. రైట‌ర్‌ను తిట్టేయ‌ట‌మే కాదు వారిపై అభ్యంత‌ర‌క‌రంగా వ్య‌వ‌హ‌రించార‌న్న ఆరోప‌ణ‌ల‌పై కేసు న‌మోదు చేశారు.

ప‌వ‌ర్‌లో ఉన్న త‌మ‌పై పోలీసులు కేసు న‌మోదు చేయ‌టం ఏమిట‌న్న ఇగో ఫీలింగో ఏమో కానీ.. ఎమ్మెల్యే రాధాకృష్ణ‌కు అండ‌గా నిలుస్తూ.. పోలీసుల పై వార్ ప్ర‌క‌టించినంత ప‌ని చేయ‌టం ఇప్పుడు సంచ‌ల‌న‌మైంది.

ఎమ్మెల్యే రాధాకృష్ణ‌పై కేసు న‌మోదు చేయ‌టానికి నిర‌స‌న‌గా త‌మ గ‌న్ మెన్ల‌ను వెన‌క్కి పంపాల‌ని నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు హెచ్చ‌రించిన తెలుగు త‌మ్ముళ్లు.. తాజాగా అన్నంత ప‌ని చేశారు. జిల్లాకు చెందిన 12 మంది ఎమ్మెల్యేలు.. 3 ఎమ్మెల్సీలు త‌మ‌కుకేటాయించిన గ‌న్ మెన్ల‌ను వెన‌క్కి పంపటం ఇప్పుడు పెను దుమారాన్ని రేపుతోంది. జిల్లా ఎస్సీని ల‌క్ష్యంగా చేసుకునే అధికార‌ప‌క్ష నేత‌లు త‌మ గ‌న్ మెన్ల‌ను స‌రెండ్ చేసిన‌ట్లుగా చెబుతున్నారు.

జిల్లా పార్టీ అధ్య‌క్షురాలి నేతృత్వంలో నిర్వ‌హించిన స‌మావేశంలో ప‌లువురు అధికార‌ప‌క్ష ఎమ్మెల్యేలు మాట్లాడుతూ పోలీసు అధికారుల‌పై విమ‌ర్శ‌లు చేయ‌టం విశేషం. గ‌న్ మెన్ల‌ను వెన‌క్కి పంపే విష‌యంలో మంత్రి పితాని చేసిన సూచ‌న‌ను ప‌ట్టించుకోని ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు త‌మ‌కు తాముగా నిర్ణ‌యం తీసుకోవ‌టం గ‌మ‌నార్హం. తాను ఎలాంటి త‌ప్పు చేయ‌లేద‌ని.. ఒక‌వేళ త‌ప్పు చేసిన‌ట్లుగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. మంత్రి లోకేశ్‌కానీ భావిస్తే త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసేందుకు సైతం తానుసిద్ధ‌మేన‌ని ఎమ్మెల్యే రాధాకృష్ణ చేసిన వ్యాఖ్య‌లు కొత్త చ‌ర్చ‌కు తెర తీశాయి. అధికార‌ప‌క్షానికి చెందిన నేత‌లు అయి ఉండి.. పోలీసుల‌కు వ్య‌తిరేకంగా ఉమ్మ‌డి నిర్ణ‌యం తీసుకోవ‌టం.. ప్ర‌భుత్వాన్ని ఇరుకున ప‌డేసేలా వ్య‌వ‌హ‌రించ‌టం జిల్లా వ్యాప్తంగా ఆస‌క్తిక‌రమైన చ‌ర్చ న‌డుస్తోంది.