Begin typing your search above and press return to search.

ఆ లిస్ట్ లోని మన హైదరాబాద్ చేరిపోయింది

By:  Tupaki Desk   |   16 Dec 2016 7:46 AM GMT
ఆ లిస్ట్ లోని మన హైదరాబాద్ చేరిపోయింది
X
పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో కొత్త నోట్ల మీద విధించిన పరిమితుల కారణంగా సామాన్యులు ఎన్ని కష్టాలు పడుతున్నారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. గంటల కొద్దీ క్యూ లైన్లో నిలుచుంటే రూ.2వేలు చేతికి వచ్చేసరికి తల ప్రాణం తోకకు వచ్చే దుస్థితి. విత్ డ్రా చేసుకోవటం ద్వారా వారానికి రూ.24వేల చొప్పున తీసుకునే వీలున్నప్పటికీ.. బ్యాంకుల్లో ఉన్న నగదు కొరత కారణంగా రూ.2వేలు లేదంటే రూ.3వేలకు మించి ఇవ్వటం లేదు.

ఇదిలా ఉంటే.. దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో కోట్లాది రూపాయిల కొత్త నోట్లను అధికారులు స్వాధీనం చేసుకుంటూ సంచలనం సృష్టిస్తున్నారు. దేశంలోని పలు చోట్ల ఇలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ.. హైదరాబాద్ లో ఇలాంటి ఉదంతాలు ఇప్పటివరకూ బయటకు రాలేదు. ఆ కొరత తీరుస్తూ తాజాగా ఒక ఘటన చోటు చేసుకుంది.

హైదరాబాద్ లోని విపరీతమైన రద్దీగా ఉండే సోమాజీగూడ పెట్రోల్ బంకు వద్ద భారీ స్థాయిలో కొత్తనోట్లను పోలీసులు స్వాధీనం చేసుకోవటం సంచలనంగా మారింది. ఒక వ్యక్తి వద్ద నుంచి రూ.12 లక్షల విలువైన కొత్త నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ జిల్లా చిట్యాలకు చెందిన వ్యాపారులకు సంబంధించిన క్యాష్ గా చెబుతున్నప్పటికీ.. వీటి వెనుక వేరే దందా ఉందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

నోట్ల మార్పిడి కోసం వ్యాపారుల్ని సంప్రదించిన నవీన్.. అక్కడి వ్యాపారుల్ని బెదిరించి వారి దగ్గరున్న కొత్త నోట్లను తీసుకున్నట్లుగా చెబుతున్నారు. నవీన్ కు సహకరించిన ఏసీబీలో హోంగార్డుగా పని చేస్తున్న నరేష్ అనే వ్యక్తి మాయాజాలంతో వ్యాపారుల దగ్గరి కొత్త నోట్లను తీసుకున్న వారు ఉడాయించగా.. వ్యాపారులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు నవీన్.. నరేష్ లను అదుపులోకి తీసుకున్నారు. ఇంతకాలంలో కొత్త నోట్లకు సంబంధించిన పెద్ద మొత్తం హైదరాబాద్ లో దొరకలేదన్న కొరత తాజా ఉదంతంతో తీరిపోయిందని చెప్పకతప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/