Begin typing your search above and press return to search.

హుజూర్ నగర్ లో ఫైనల్ గా ఎంతమంది తేలారంటే?

By:  Tupaki Desk   |   2 Oct 2019 6:14 AM GMT
హుజూర్ నగర్ లో ఫైనల్ గా ఎంతమంది తేలారంటే?
X
బరిలో నిలిచేందుకు 119 మంది నామినేషన్లు వేస్తే.. నామినేషన్ల పరిశీలన తర్వాత ఎంత మంది ఉండొచ్చు? అంటే.. తక్కువలో తక్కువ యాభై శాతానికి తగ్గరనుకోవచ్చు.కానీ.. అందుకు భిన్నమైన పరిస్థితులు చోటు చేసుకున్నాయి హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ స్థానానికి భారీగా నామినేషన్లు దాఖలైన తరహాలోనే.. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లోనూ భారీగా అభ్యర్థులు బరిలో నిలిచే సీన్ రిపీట్ అవుతుందన్న అంచనాలకు భిన్నమైన పరిస్థితి నెలకొంది.

మొత్తం 119 మంది నామినేషన్లు దాఖలు చేస్తే.. వాటిని స్క్రూటీ చేశాక కేవలం 31 మంది మాత్రమే బరిలో మిగలటం విశేషం. మిగిలిన వారంతా నామినేషన్లు ఉప సంహరించుకోలేదు. వారి నామినేషన్లు సరిగా లేవన్న కారణంగా అధికారులు రిజెక్ట్ చేశారు. ఇలా రిజెక్ట్ అయిన నామినేషన్లలో సీపీఎం పార్టీ అభ్యర్థి దాఖలు చేసిన నామినేషన్ కూడా ఉండటం గమనార్హం.

దీనిపై సీపీఎం తీవ్రంగా తప్పు పడుతోంది. ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న ఆర్వో చంద్రయ్య అధికారపార్టీకి అనుకూలంగా వ్యవహరించినట్లుగా వారు ఆరోపిస్తున్నారు. ఇంతకూ ఇంత భారీగా నామినేషన్లు ఎందుకు తిరస్కరణకు గురయ్యాయి అన్న విషయంలోకి వెళితే.. నామినేషన్ పత్రాల డౌన్ లోడ్ లో చోటు చేసుకున్న పొరపాటే కారణమన్న మాట వినిపిస్తోంది.

అంచనాలకు భిన్నంగా పెద్ద ఎత్తున నామినేషన్లు రిజెక్ట్ అయిన నేపథ్యంలో.. నామినేషన్ల ఉపసంహరణకు టైం ఉండటంతో.. ఈ ప్రక్రియ పూర్తి అయ్యే నాటికి పలువురు రంగంలో నుంచి తప్పుకునే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తానికి హుజూర్ నగర్ ఉప ఎన్నిక నిజామాబాద్ ఎన్నిక మాదిరి భారీ అభ్యర్థులతో ఉంటుందని భావించిన దానికి భిన్నమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయని చెప్పకతప్పదు.