Begin typing your search above and press return to search.

నమ్మరు కాని నిజం.. కరోనా దెబ్బకు అమెరికాలో పోయే ఉద్యోగాలు ఎన్నంటే?

By:  Tupaki Desk   |   26 March 2020 1:30 PM GMT
నమ్మరు కాని నిజం.. కరోనా దెబ్బకు అమెరికాలో పోయే ఉద్యోగాలు ఎన్నంటే?
X
మాయదారి కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. అప్పటివరకూ కమ్మగా సాగే సాగర ప్రయాణం లో ఒక్కసారిగా సునామీ విరుచుకుపడితే పరిస్థితి ఎంత భయానకంగా ఉంటుందో.. అంతకు మించిన అన్నట్లుగా ఉంది కరోనా ప్రభావం. తుపాను.. సునామీ.. అగ్నిప్రమాదం.. ఇలా.. విపత్తు ఏదైనా సరే.. దాన్ని ఎదుర్కునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే.. ఇవన్నీ కంటికి కనిపించేవి. ఆ ముప్పు నుంచి తప్పించుకోవటం చాలా తేలిక. కానీ.. కంటికి కనిపించని కరోనా వైరస్ లాంటి దాని నుంచి దూరంగా ఉండటం.. దానికి దొర్కుండా ఉండటం అంత తేలిక కాదు.

మన పక్కనే ఉండి.. కోరలు జాచి చూస్తున్నా.. మనకేమీ కనిపించదు. ఇలాంటి పరిస్థితి ఇటీవల కాలంలో మరెప్పుడూ చోటు చేసుకోలేదు. దీని కారణంగా ఇప్పటికే వేల కొద్దీ మరణాలు.. లక్షల కొద్దీ బాధితులు ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. మందులేని ఈ మహమ్మారికి చెక్ పెట్టేందుకు మరికొంత కాలం పడుతుందన్నది వాస్తవమే అయినా.. అంతవరకూ ఎలా? అన్న ప్రశ్న దగ్గరే ఆగిపోయే పరిస్థితి. అంతకు మించి.. ముందుకు వెళ్లలేని దుస్థితి.

ఇప్పటికే పలు దేశాలు కరోనా కారణంగా దారుణంగా దెబ్బతిన్నాయి. ఫ్రాన్స్.. స్పెయిన్.. ఇరాన్ లాంటి దేశాలతో పాటు.. ప్రపంచానికి పెద్దన్న అమెరికా లాంటి దేశం ఎప్పటికి కోలుకుంటుందన్నది ప్రశ్నగా మారింది. న్యూయార్క్ మహా నగరంలో ఇప్పుడు అంతులేని భయం చోటు చేసుకుంది. గతంలో ఎప్పుడూ ఈ మహానగరంలో ఇలాంటి పరిస్థితి లేదని చెబుతున్నారు.

ఇరవై నాలుగు గంటలు ఉత్సాహంగా ఉండే ఈ మహానగరంలో ఇప్పుడు భయానక నిశ్శబద్దం అలుముకొని ఉంది. దీన్ని బ్రేక్ చేస్తూ.. అప్పుడప్పడు వీధుల్లో వేగంగా వెళ్లే అంబులెన్సులు.. పోలీసు వాహనాలు తప్పించి.. పౌరులు బయటకు రాలేని పరిస్థితి. కరోనా కారణంగా అమెరికా ఊహించిన దాని కంటే భారీగా నష్ట పోయింది. రేపొద్దున దీనికి మందు కనిపెట్టినప్పటికీ.. కొన్ని రాష్ట్రాలు (హవాయి.. మోంటానా.. నెవడా) ఇప్పట్లో కోలుకోలేవని చెబుతున్నారు. టూరిజం.. సేవా రంగాలతో బండి నడిచే రాష్ట్రాలు ఈ వైరస్ కారణంగా ఘోరంగా దెబ్బ తిన్నట్లుగా తెలుస్తోంది.

ఒక అంచనా ప్రకారం కరోనా కారణంగా అమెరికా లో ఏకంగా 1.4 కోట్ల ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. కరోనా మీద యుద్ధం చేసేందుకు ట్రంప్ సర్కారు ఏకంగా రూ.150లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించటం అంతో ఇంతో సానుకూల అంశమే అయినప్పటికీ.. దీని ప్రభావం కారణంగా.. ఏళ్లకు ఏళ్లు డెవలప్ మెంట్ వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందంటున్నారు. భారీ ఎత్తున పోయే ఉద్యోగాలతో అమెరికాలో మాంద్యం తీవ్ర రూపం దాల్చటమే కాదు.. నిరుద్యోగం మరింత ముదిరిపోతుందని చెబుతున్నారు. ఏమైనా.. రానున్న రోజులు అంత బాగుండే అవకాశం ఇప్పటికైతే కనిపించట్లేదని చెప్పక తప్పదు.