Begin typing your search above and press return to search.

ఆ ఊళ్లో రూ.వెయ్యి ఫైన్ వందమందికి వేశారట!

By:  Tupaki Desk   |   10 May 2020 10:03 PM IST
ఆ ఊళ్లో రూ.వెయ్యి ఫైన్ వందమందికి వేశారట!
X
ఇప్పుడున్న పరిస్థితుల్లో కలలో కూడా ఊహించని కొత్త రూల్స్ తెర మీదకు రావటం తెలిసిందే. ముఖానికి అడ్డంగా మాస్కు పెట్టుకొని మాత్రమే రోడ్ల మీద తిరగాల్సిన రోజు ఒకటి వస్తుందని.. ఒకవేళ అలా మాస్కు ధరించకుంటే.. భారీ ఫైన్ కట్టాల్సి వస్తుందని ఎప్పుడైనా అనుకున్నారా? ఎప్పుడు అనుకొని ఉండరు. మారిన కాలంతో ఇలాంటి కొత్త రూల్స్ చాలానే వస్తున్నాయి.

ప్రస్తుత పరిస్థితుల్లో ముఖానికి మాస్కు లేకుండా బయటకు రావటం నేరమంటూ తెలంగాణ రాష్ట్రంలో నిర్ణయం తీసుకోవటమే కాదు.. అలా బయటకు వచ్చినోళ్ల మీద రూ.వెయ్యి జరిమానా విధించాలన్న నిర్ణయాన్ని తీసుకోవటం తెలిసిందే. ఈ రూల్ ను అమలు చేసే విషయంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారులు పెద్దగా ఆసక్తి చూపించకున్నా.. వనపర్తి జిల్లా ఎస్పీ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు.

నిబంధనలకు విరుద్ధంగా ముఖానికి మాస్కులు లేకుండా బయటకు వచ్చిన వారికి భారీగా ఫైన్ విధించారు. శనివారం ఒక్కరోజునే ఆమె జిల్లా వ్యాప్తంగా వంద కేసులు బుక్ అయ్యాయి. రోడ్ల మీద తిరిగేవారు.. వాహనాల్లో వెళ్లే వారు ముఖానికి మాస్కు లేకపోవటాన్ని చూస్తే చాలు.. వారికి రూ.వెయ్యి జరిమానా విధిస్తున్నారు.

ఇంటి నుంచి బయటకు వచ్చే ప్రతిఒక్కరూ తప్పనిసరిగా ముఖానికి మాస్కు ధరించాలని లేని పక్షంలో వెయ్యి ఫైన్ తప్పదని తేల్చి చెబుతున్నారు. ఇప్పటివరకూ రోడ్ల మీదనే ఫోకస్ పెట్టామని.. రానున్న రోజుల్లో గల్లీల్లో కూడా తిరుగుతామని.. రూల్ ను బ్రేక్ చేసినోళ్లకు వెయ్యి ఫైన్ వేసి షాకిస్తామని చెబుతున్నారు. వనపర్తి జిల్లాలో మాదిరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రూల్ ను కఠినంగా అమలు చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో కదా?