Begin typing your search above and press return to search.

మాజీ టీడీపీ లీడర్ కు 1000 ఎకరాల భూములా?

By:  Tupaki Desk   |   26 Aug 2020 10:00 AM IST
మాజీ టీడీపీ లీడర్ కు 1000 ఎకరాల భూములా?
X
వైసీపీ శ్రేణులు గొంతు చించుకుంటున్నాయట.. వైసీపీ అధికారం వచ్చినా 10 ఏళ్లు కష్టపడ్డా.. జెండా మోసిన వారికి 10 పైసలు కూడా ప్రయోజనం లేదని మొత్తుకుంటున్నాయట. కాంట్రాక్టులు, పనులు, నిధులు అంతా టీడీపీ వారికే పోతున్నాయని ఆవేదన వెళ్లగక్కుతున్నారట. సోషల్ మీడియాలో.. ఇన్ సైడ్ గా ఇప్పుడు వైసీపీలో ఇదే పెద్ద హాట్ టాపిక్ గా మారిందట. అయినా కూడా వైసీపీ ప్రభుత్వం మళ్లీ టీడీపీ నామినేట్ చేసిన వారికే అంత పెద్ద కాంట్రాక్ట్ కట్టబెట్టడంపై వైసీపీ నేతల్లో ఆశ్చర్యం.. ఆవేదన వ్యక్తమవుతోందట.. వైసీపీ ప్రభుత్వం తీరుపై ఆగ్రహం పెల్లుబుకుతోందట.. ఇప్పుడు ఇదే టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ నోటా ఈ నోటా బయటపడుతోంది.

తాజాగా నెల్లూరు జిల్లా పరిధిలోని 1000 ఎకరాల విలువైన సిలికా మైనింగ్ భూముల లీజును ఒకే కంపెనీకి కట్టబెట్టారు. ఇన్నాళ్లు ఈ 1000 ఎకరాలను విడదీసి సుమారు 80 కంపెనీలకు లీజు ఇచ్చారు. కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం ఎంత ఉదారతతో లీజు విధానంలో మార్పులు తీసుకొచ్చి ఏకంగా టెండర్లలో పాల్గొనడానికి రూ.507 కోట్ల మైనింగ్ వార్షిక టర్నోవర్ నిబంధన పెట్టింది.

ఈ పరిణామంతో చిన్నా చితక కంపెనీలన్నీ టెండర్లలో పాల్గొనకుండా ఎగిరిపోయాయి. దీంతో ఈ టెండర్లలో టీడీపీ నామినేట్ చేసిన టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు.. ప్రముఖ పారిశ్రామికవేత్త శేఖర్ రెడ్డికి చెందిన అవంతిక ఎక్స్ పోర్ట్స్ సంస్థ ఈ 1000 ఎకరాల లీజును చేజిక్కించుకుంది.

వైసీపీ ప్రభుత్వం ఇంత తంతగం చేసి ఆ భారీ కాంట్రాక్టును టీడీపీకి సానుభూతిపరుడైన పారిశ్రామికవేత్తకే కట్టుబెట్టడం నెల్లూరు జిల్లాలో కలకలం రేపింది. దక్షిణ భారత దేశంలోనే నాణ్యమైన సిలికా మైన్లకు నెల్లూరు జిల్లా ప్రసిద్ధి. అలాంటి మైన్స్ ను టీడీపీకి చెందిన వ్యక్తికి కట్టబెట్టడంపై వైసీపీ నేతలు స్థానికంగా ఆగ్రహం వ్యక్తం అవుతోందట.. ఇప్పుడు ఇదే టాపిక్ నెల్లూరు జిల్లా వైసీపీలో చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలోనూ టీడీపీ నేతకు కాంట్రాక్టు అప్పగించిన వైనంపై చాలా మంది విమర్శలు చేస్తున్నారు.