Begin typing your search above and press return to search.

100 శాతం ఆక్యుపెన్సీ.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   8 Jan 2021 7:19 PM IST
100 శాతం ఆక్యుపెన్సీ.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
X
సినిమా థియేటర్లలో వంద శాతం ఆక్యుపెన్సీకి అనుమతినిస్తూ తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. కాగా.. ఈ అంశంపై తాజాగా ఆ రాష్ట్ర హైకోర్టు స్పందించింది. ఈ ఆక్యుపెన్సీపై కీలక వ్యాఖ్యలు చేసింది.

తమిళనాడు రాష్ట్రంలోని సినిమా థియేటర్లలో వంద శాతం ఆక్యుపెన్సీకి అనుమతిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్టే విధించాలని కోరుతూ చెన్నై హైకోర్టులో ఓ పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌ను ధర్మాసనం విచారణకు స్వీకరించింది. జనవరి 11 వరకూ రాష్ట్రంలోని సినిమా థియేటర్లలో 50 శాతం ప్రేక్షకులకు మాత్రమే అనుమతివ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జనవరి 11 లోపు థియేటర్లలో ఆక్యుపెన్సీ అంశంపై ప్రభుత్వం స్పందించాలని, లేకపోతే తదుపరి ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది.

దశల వారీగా లాక్ డౌన్ నిబంధనలు ఎత్తేస్తున్న కేంద్రం.. మరిన్ని సడలింపులు ఇచ్చి, ఈనెల 31వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను ప్రభుత్వం పొడిగించిన నేపథ్యంలో, 100 శాతం సీట్ల సామర్థ్యంతో సినిమా థియేటర్లు పనిచేయవచ్చని తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈనెల 4న ఈ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.

కాగా.. హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటోందనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. వంద శాతం సీట్ల సామర్థ్యంతో ప్రేక్షకులను అనుమతించాలా? లేదా? అనే అంశంపై ప్రభుత్వం శుక్రవారం తుది నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది.