తాలిబన్ల పాలనకి 100 రోజులు .. ఆకలితో కన్నబిడ్డలని కూడా .. !

Thu Nov 25 2021 14:01:41 GMT+0530 (IST)

100 Days Of Taliban Rule

అఫ్ఘానిస్తాన్ లో తాలిబన్ల అరాచక పాలన వంద రోజులని పూర్తి చేసుకుంది. అఫ్గాన్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన తర్వాత ఆ దేశ పరిస్థితి గతంలో కన్నా మరింత దారుణంగా తయారయ్యింది. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతినగా చాలామంది ప్రజలు ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. అఫ్ఘానిస్తాన్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను ఉజ్బెకిస్తాన్ సరిహద్దుల్లోని ఒక పట్టణానికి చెందిన 19 ఏళ్ల యువతి అత్యంత రహస్యంగా మీడియాకు తెలిపింది. తాలిబన్ల పాలనకు వంద రోజులు పూర్తయ్యిందని ఈ నేపధ్యంలో ఇక్కడి ప్రజల పరిస్థితులు మరింత దిగజారాయన్నారు.ప్రతీ రోజూ యుద్ధవాతావరణాన్ని చూస్తున్నామని వాపోయారు. యూనివవర్శిటీలో చదువుతున్న తాను తాలిబన్ల అరాచక పాలన కారణంగా మధ్యలోనే చదువు మానేయాల్సివచ్చిందని తెలిపారు. తామంతా ఇళ్లలోనే బందీలుగా ఉంటున్నామని కనీసం వీధి ముఖం చూసే సాహసం కూడా చేయలేకపోతున్నామన్నారు. దేశంలోని చాలామంది పిల్లలు స్కూళ్లకు వెళ్లడం మానేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూళ్లకు పంపడం లేదు. తాముంటున్న ఈ ప్రాంతంలో చలి తీవ్రంగా ఉంటుందని ఈ చలిని తట్టుకునే విధంగా సౌకర్యాలు సమకూర్చుకునేందుకు ఇక్కడ ఎవరికీ స్థోమత లేదన్నారు.

ఎవరైనా ఆహారం పెడతారేమోననే పరిస్థితుల్లో ఇక్కడివారు కాలం గడుపుతున్నారన్నారు. కొన్ని కుటుంబాల వారు ఆహారం సమకూర్చుకునేందుకు ఇంటిలోని చిన్నారులను అమ్ముకోవాల్సిన దుస్థితిలో ఉన్నారన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో చిన్నారులు వారి తల్లిదండ్రుల రోదన వర్ణనాతీతమన్నారు. తాను ఇంట్లో విద్యార్థులకు చదువు చెబుతుంటానని ఈ నేపధ్యంలో చిన్నారులు వారి ఇంటి గురించి చెప్పినప్పుడు ఎంతో బాధకలుగుతుందన్నారు. తమ సమస్యలు ఎప్పుడు పరిష్కారం అవుతాయోనని ఎదురు చూస్తున్నామన్నారు.

పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే కేవలం 65 వేల కోసం పిల్లల్ని అమ్ముకుంటున్నారు తల్లిదండ్రులు. అంతేకాదు గుండె తరుక్కుపోయే విషయం ఏంటంటే ఆఖరికి ఉయ్యాలలో పడుకున్న బిడ్డను కూడా అమ్మి ఆకలి తీర్చుకుంటున్నారు ఆఫ్ఘన్ పేదలు. ఆ బిడ్డను పెంచి నడిచే వరకు వచ్చాక తీసుకెళ్తామని అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. మనసు ఒప్పుకోకున్నా బిడ్డల్ని అమ్ముకుంటున్నాం అంటున్నారు పేరెంట్స్. తమకు ఐదారుగురు పిల్లలు ఉన్నారని ఒకరిని అమ్మి మిగతావారి ఆకలి తీరుస్తున్నామని చెబుతున్నారు తల్లిదండ్రులు. ఇందుకు అనేక కారణాలున్నాయి.

అఫ్గానిస్తాన్ ఆర్థిక వ్యవస్థ అధికంగా విదేశీ నిధులపై ఆధారపడి ఉంది. ఆగస్టులో తాలిబాన్లు అధికారం చేపట్టిన తరువాత విదేశీ సహాయం పూర్తిగా నిలిచిపోయింది. దాంతో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాలు ప్రభుత్వోద్యోగులకు ఇచ్చే జీతలతో సహా ప్రభుత్వ కార్యకలాపాలన్నీ ఆగిపోయాయి. ఫలితంగా అట్టడుగు వర్గాలు దీనస్థితికి చేరుకున్నాయి. ఆగస్టుకు ముందు ఎలాగోలా బతుకీడ్చిన వాళ్ల పరిస్థితి ఇప్పుడు మరింత దుర్భరం అయిపోయింది. ఆఫ్గనిస్తాన్ లోని సుమారు 10లక్షల మంది చిన్నారుల ప్రాణాలు అరచేతుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ దేశంలో ఈ ఏడాది సుమారు 10 లక్షల మంది చిన్నారులు పోషకాహార లోపంతో ఇబ్బందులను ఎదుర్కోనున్నట్లు యునిసెఫ్ వెల్లడించింది.