Begin typing your search above and press return to search.

చిన్నారిని కుక్కలు చంపేశాయి బాబు

By:  Tupaki Desk   |   14 July 2016 7:57 AM GMT
చిన్నారిని కుక్కలు చంపేశాయి బాబు
X
కొన్ని రోజుల క్రితం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత ఒకరు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రంగా విమర్శలు చేస్తూ.. ఏ రాష్ట్రంలో లేని విధంగా చీమలు.. కుక్కలు చిన్నారుల్ని చంపేస్తున్నాయని మండిపడ్డారు. ఈ తరహా విమర్శలు ఏపీ ప్రభుత్వాన్ని.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇమేజ్ ను ఎంత డ్యామేజ్ చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి వ్యాఖ్యలు వినిపించిన రోజుల వ్యవధిలోనే తాజాగా మరో దారుణం జరిగిపోయింది.

శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలానికి చెందిన పదేళ్ల చిన్నారి స్పందనను కుక్కలు చంపేయటం సంచలనంగా మారింది. తన తాతకు టీ తీసుకొని వెళుతున్న వేళ.. కుక్కలు వెంటపడటం.. దాంతో బెదిరిపోయిన ఆ చిన్నారిని కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. కుక్కల దాడితో ఒళ్లంతా గాయాలపాలైన స్పందన ఘటనాస్థలంలోనే చనిపోయింది.

ఐదో తరగతి చదువుతున్న చిన్నారిపై కుక్కలు దాడి చేసి చంపేయటం ఇప్పుడు సంచలనంగా మారింది. జరిగిన ఘటన పలువురిని తీవ్రంగా కలిచివేస్తోంది. ఎక్కడో శ్రీకాకుళం జిల్లాలో కుక్కల దాడిలో ఒక చిన్నారి చనిపోతే దానికి ముఖ్యమంత్రి ఎలా బాధ్యత వహిస్తారని అడగొచ్చు. కానీ.. చీమలు.. కుక్కల కారణంగా చిన్నారులు చనిపోవటం ఇది తొలిసారి కాదన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఈ మధ్య కాలంలో తరచూ చోటు చేసుకుంటున్న ఈ తరహా ఘటనలపై అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయటంతో పాటు.. ఇలాంటి ఘటనలకు అవకాశం లేని విధంగా వ్యవస్థను సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. కానీ.. అలాంటిదేమీ జరగకపోవటం ఒక లోపమైతే.. ఆ ప్రయత్నం జరగకపోవటం ఇప్పుడు వేలెత్తి చూపేలా చేస్తుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. చీమలు.. కుక్కలు మనుషుల్ని చంపేసే రోజులు బాబు హయాంలో చోటు చేసుకున్నాయన్న మాట ఆయన పాలనపై ఎంతటి నెగిటివ్ ఇమేజ్ వస్తుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏపీ సర్కారుపై ఉంది.