Begin typing your search above and press return to search.

షాక్.. ప్రపంచ జనాభాలో 10శాతం కొవిడ్ పడగ నీడలోనే?

By:  Tupaki Desk   |   17 Feb 2020 9:30 PM GMT
షాక్.. ప్రపంచ జనాభాలో 10శాతం కొవిడ్ పడగ నీడలోనే?
X
అనుకున్నంత జరిగింది. కొవిడ్ 19 వైరస్ తీవ్రత రానున్న రోజుల్లో మరింత పెరుగుతుందన్న అంచనాలకు తగ్గట్లే చైనాలో తాజా పరిస్థితులు నెలకొన్నాయి. తొలుత ఒకట్రెండు ప్రావిన్స్ లో కొంత భాగానికే పరిమితమైన ఈ మాయదారి వైరస్.. ఆ దేశాధ్యక్షుడు చెప్పినట్లే పిశాచి తో పోరాటం మాదిరి మారింది. పిశాచితో మనిషి పోరాటం అంత తేలిక కాదన్న రీతిలోనే.. కొవిడ్ వైరస్ ను అదుపు చేయటం తర్వాత.. దాన్ని విస్తరించకుండా చేయటంలోనే ఫెయిల్ అవుతుున్న పరిస్థితి.

తాజాగా బయట కు వచ్చిన సమాచారం ప్రకారం చైనా జనాభా లోని యాభై శాతం మంది అంటే.. దగ్గర దగ్గర 76 కోట్ల మంది వైరస్ కారణంగా నిర్భంధం లో ఉన్న విషయం బయటకు వచ్చింది. తాజాగా దేశ వ్యాప్తంగా కొవిడ్ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తొలుత పుహాన్ నగరానికే పరిమితమైన నిర్భంధం ఇప్పుడు దేశంలోని అన్ని చోట్లకు విస్తరించినట్లేనని చెబుతున్నారు. దీంతో.. రోడ్లు మొత్తం నిర్మానుష్యం గా మారి పోవటమే కాదు.. ఎవరికి వారు ఇళ్లకే పరిమితమవుతున్నారు.

ప్రజారవాణా ఆగిపోగా.. విమానాలు.. రైళ్లను చాలాచోట్ల ఆపేశారు. అపార్ట్ మెంట్లు. హౌసింగ్ కాంప్లెక్స్ులో ఎవరు? ఎప్పుడు? ఎన్నిసార్లు బయటకు వెళుతున్న విషయాన్ని లాగ్ పుస్తకంలో ఎంటర్ చేస్తున్నారు. కేవలం బతకటానికి అవసరమైన నిత్యవసర వస్తువుల కోసం మాత్రమే ప్రజలు బయటకు వస్తున్నారు. అది కూడా.. చాలా పరిమితంగానే సుమా.

వైరస్ ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం అనుసరిస్తున్న ఆంక్షలు దారుణంగా ఉన్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు అమాయక ప్రజల మీద ఒత్తిడి పెంచి వారి పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నారంటున్నారు. ప్రస్తుతం హాంకాంగ్ లో టాయిలెట్ పేపర్లు.. డైపర్లు.. వంట సామాగ్రికి విపరీతమైన కొరత నెలకొంది. గడిచిన రెండు రోజులుగా మారణాయుధాలతో షాపుల్లోకి వచ్చి.. తమకు అవసరమైన వస్తువుల్ని తీసుకెళుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దేశంలో తీవ్రమైన కొరతను ఎదుర్కొంటున్న మాస్కుల తయారీ కి ప్రత్యేక యంత్రాల్ని వుహాన్ కు సమీపంలో ఏర్పాటు చేశారు. రోజుకు 40నుంచి 50 వేల మాస్కుల్ని ఉత్పత్తి చేస్తున్నా.. అవేమీ అస్సలు సరిపోవటం లేదు. దీంతో.. ఈ నెలాఖరుకు మరో 10 యంత్రాల్ని ఉత్పత్తి చేసేందుకు చైనా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మొత్తంగా పిశాచి తో పోరాటం ఎలా ఉంటుందో చైనీయులకు స్వీయ అనుభవంలోకి వస్తుంటే.. వారు ఎదుర్కొంటున్న పరిస్థితిని చూస్తున్న ప్రపంచ ప్రజలు ఈ వైరస్ పేరు వింటేనే వణికే పరిస్థితి నెలకొంది.