Begin typing your search above and press return to search.

శేఖర్ రెడ్డి జంబ్లింగ్ ప్లాన్ వర్క్ వుట్ కాలేదట

By:  Tupaki Desk   |   18 Dec 2016 5:06 AM GMT
శేఖర్ రెడ్డి జంబ్లింగ్ ప్లాన్ వర్క్ వుట్ కాలేదట
X
పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో కొత్త నోట్లు చేతికి రావాలంటే చుక్కలు కనిపిస్తున్న పరిస్థితి. ఇంట్లో పెళ్లి పెట్టుకున్న వారికి సైతం శుభలేఖ చూపించి.. అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత కూడా ప్రభుత్వం చెప్పిన రూ.2.5లక్షలు చేతికి రావటం లేదన్న ఆరోపణలు భారీగా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. మరోవైపు కోట్లాది రూపాయిల కొత్త నోట్లు కొందరి చేతుల్లోకి చేరటం విస్మయాన్ని రేకెత్తిస్తోంది. కొన్ని ఉదంతాల్లో అయితే.. రిజర్వ్ బ్యాంకు నుంచి బ్యాంకులకు వెళ్లాల్సిన కొత్త నోట్లు.. మధ్యలో దారి మార్చుకొని కొందరు పెద్దమనుషుల వద్దకు వెళ్లిపోయిన విస్మయ ఉదంతాలు బయటకు వస్తున్న సంగతి తెలిసిందే.

ఈ తరహాలోనే మాజీ టీటీడీ బోర్డు సభ్యుడు.. తమిళనాడులో స్థిరపడిన తెలుగు వ్యాపారవేత్త.. కాంట్రాక్టర్ శేఖర్ రెడ్డి ఎపిసోడ్ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. ప్రింటింగ్ ప్రెస్ నుంచే నేరుగా తన ఇంటికి కొత్త నోట్లు తెప్పించుకున్న శేఖర్ రెడ్డి సత్తా ఏమిటన్నది సీబీఐ అధికారుల పుణ్యమా అని బయటకు వచ్చింది. ఆయన ఇళ్లు.. ఆఫీసుల్లో అధికారులు దాడులు జరిపి వందల కోట్ల రూపాయిలు ఆస్తుల్ని బయటకు తీశారు. ఒకవైపు కొత్త రూ.2వేల నోట్లకు కటకటలాడే పరిస్థితులు ఉంటే.. మరోవైపు ఒక్క శేఖర్ రెడ్డి దగ్గరే దాదాపు రూ.70కోట్ల మొత్తం బయటపడినట్లుగా తెలుస్తోంది.

చెన్నైకు చెందిన బ్రోకర్లచేత పాత నోట్లకు కొత్త నోట్లు పొందిన శేఖర్ రెడ్డి.. కొత్త నోట్లను తెచ్చుకునే విషయంలో తెలివిని ప్రదర్శించినట్లు చెబుతున్నారు. కోట్లాది కొత్త నోట్లను తన దగ్గర పెట్టుకున్న నేపథ్యంలో తాను దొరికిపోకుండా ఉండేందుకు జంబ్లింగ్ ఎత్తు వేసినట్లు అధికారులు గుర్తించారు. కొత్త నోట్లకు సంబంధించి వరుస నోట్లను తీసుకోకుండా.. కొందరు బ్యాంకర్లు సలహా ఇచ్చినట్లుగా విచారణ అధికారులు గుర్తించారు.

శేఖర్ రెడ్డికి సలహా ఇచ్చిన అధికారులు ఎవరన్న విషయంపై ఇప్పుడు దృష్టి పెడుతున్నారు. శేఖర్ రెడ్డికి సహకరించారన్న అనుమానం ఉన్న 50 మందిని అధికారులు విచారించటమే కాదు.. మరికొందరిపై దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. వందలాది కోట్ల రూపాయిల ఆస్తులు బయటపడిన నేపథ్యంలో.. శేఖర్ రెడ్డిపై చర్యలు ఏ విధంగా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. కొందరు అధికారుల మాటల్ని చూస్తుంటే.. ఇంత భారీ మొత్తాన్ని వెనకేసుకున్న శేఖర్ రెడ్డి.. సోదాల్లో బయటపడిన ఆస్తులన్ని తనవేనని ఒప్పేసుకున్న నేపథ్యంలో జరిమానా విధించటం మినహా మరింకేమీ జరగదన్న మాటను చెప్పటం గమనార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/