వచ్చే ఎన్నికల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జాక్ పాట్ కొట్టనున్నారా..? సనత్నగర్ నుంచి ఆయన గెలుపు నల్లేరు పై నడకగా మారనుందా..? ప్రతిపక్షాల నుంచి గట్టి ప్రత్యర్థిని పోటీలో లేకుండా చేసుకున్నారా..? పలు అభివృద్ధి పనులతో మరోసారి గెలుపునకు బాటలు వేసుకుంటున్నారా..? ఈ ప్రశ్నలన్నింటికీ పొలిటికల్ విశ్లేషకులు అవుననే సమాధానం ఇస్తున్నారు.
సనత్ నగర్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు వరుసగా గెలిచిన తలసాని హ్యాట్రిక్ విజయంపై గురి పెట్టారు. మోండా డివిజన్ నుంచి కార్పొరేటర్ గా రాజకీయ జీవితం ప్రారంభించారు తలసాని. టీడీపీ తరపున సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 1994 99 ఎన్నికల్లో విజయ బావుటా ఎగురవేశారు. చంద్రబాబు హయాంలో పర్యాటక శాఖ మంత్రిగా పని చేశారు.
తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో కూడా సమైక్యవాదానికే కట్టుబడ్డారు తలసాని. ఆ ప్రభావం 2004 అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. ఆ ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు చేతిలో ఓడిపోయారు. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లినపుడు 2008లో మళ్లీ అనూహ్యంగా గెలుపొందారు. మళ్లీ ఏడాది తిరగకుండానే 2009 ఎన్నికల్లో పద్మారావు చేతిలో పరాజయం పొందారు.
2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సనత్ నగర్ నియోజకవర్గానికి మారిపోయారు. టీడీపీ నుంచి పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి దండె విఠల్ కాంగ్రెస్ అభ్యర్థి మర్రి శశిధర్ రెడ్డిని ఓడించారు. దతనంతర పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ లో చేరారు. గులాబీ పార్టీలో చేరిన వెంటనే మంత్రి పదవి చేపట్టారు. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తం అయినా ప్రజలు మళ్లీ 2018లో తలసానిని గెలిపించారు. టీడీపీ అభ్యర్థి కూన వెంకటేశ్ గౌడ్ ను ఓడించి మరోసారి కేసీఆర్ కేబినెట్లో మంత్రి పదవి పొందారు.
తలసాని వచ్చే ఎన్నికల్లో కూడా తన గెలుపును సునాయాసం చేసుకున్నారు. ఎందుకంటే రెండు సార్లు తనకు పోటీగా నిలిచిన ప్రత్యర్థులు ఇప్పుడు బరిలో లేకపోవడమే కారణం. పొత్తులో భాగంగా క్రితం ఎన్నికల్లో టీడీపీకి టికెట్ వదిలేసుకున్న కాంగ్రెస్ అభ్యర్థి మర్రి శశిధర్ రెడ్డి ఈసారి వయసు రీత్యా పోటీ చేయకపోవచ్చు. టీడీపీ నుంచి పోటీ చేసిన వెంకటేశ్ గౌడ్ ఇప్పుడు టీఆర్ఎస్ లోనే ఉన్నారు.
అంతకుముందు ఎన్నికల్లో తనకు గట్టి పోటీ ఇచ్చిన టీఆర్ఎస్ అభ్యర్థి దండె విఠల్ ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇలా పాత ప్రత్యర్థులందరూ సైడయిపోవడంతో ఆయన కొత్త ముఖంతో కొట్లాడాల్సి రావొచ్చు.. గెలుపు సునాయాసం చేసుకోవచ్చు అని భావిస్తున్నారట. చూడాలి మరి ఏం జరుగుతుందో..!