అమెరికాలో ఇరాన్ దాడికి ప్లాన్ చేస్తోందా? ట్రంప్ అధికారులకు భద్రత పెంపు!
By: Tupaki Desk | 17 Nov 2026 11:05 AM ISTఅమెరికాలో ఇరాన్ దాడి చేయబోతోందంటూ వచ్చిన ఓ వార్త ఇప్పుడు చర్చకు దారితీసింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలోని కొందరు ముఖ్యమైన అధికారులను లక్ష్యంగా చేసుకుని వాషింగ్టన్‌లో దాడి చేసేందుకు ఇరాన్ ప్లాన్ చేస్తోందని అమెరికా నిఘా వర్గాలకు సమాచారం అందినట్లు CNN తెలిపింది.
ఈ దాడికి డర్టీ బాంబ్ లేదా రసాయన ఆయుధాలను వాడే అవకాశం ఉందని అమెరికా అధికారులు చెప్పినట్లు ఆ వార్తలో పేర్కొన్నారు. దాడి చేయాలనుకుంటున్న ప్రాంతాలు, వ్యక్తుల పేర్లు కూడా ఇరాన్‌కు సంబంధించిన కొన్ని సంభాషణల్లో ఉన్నట్లు ఇద్దరు అధికారులు తెలిపారు. బాంబు తయారీకి అవసరమైన వస్తువులు అమెరికాలోనే దాచినట్లు సమాచారం వచ్చినా, వాటిని అధికారులు ఇంకా నిర్ధారించలేదు.
ఈ వార్తతో అమెరికాలో భద్రతపై చర్చ మొదలైంది. ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్‌ను సైనిక నివాసానికి తరలించినట్లు CNN వెల్లడించింది.
అయితే ఇరాన్ దాడి చేయడం ఖాయమని చెప్పడానికి ఆధారాలు లేవు. అలాంటి దాడి చేసే సామర్థ్యం ఆ దేశానికి ఉందా అన్నది కూడా స్పష్టంగా తెలియదు. ప్రస్తుతం అమెరికాకు ఎలాంటి నమ్మదగిన ముప్పు లేదని వైట్ హౌస్ తెలిపింది. రసాయన ఆయుధాల ఆరోపణలను ఇరాన్ ఖండించింది.
డర్టీ బాంబ్ అంటే అణుబాంబు కాదు. సాధారణ బాంబుతో పాటు రేడియోధార్మిక పదార్థాలను ఉపయోగించి వాటిని చుట్టుపక్కల వ్యాపింపజేస్తారు. దీని వల్ల ప్రజలకు, పరిసర ప్రాంతాలకు ప్రమాదం ఏర్పడవచ్చు.
