Begin typing your search above and press return to search.

70 మంది బాలికలను ట్రాప్ చేసిన భారతీయ విద్యార్థి.. బ్రిటన్‌లో 30 ఏళ్ల జైలు శిక్ష!

సోషల్ మీడియాలో బాలికలతో పరిచయం పెంచుకుని, వారి వ్యక్తిగత ఫొటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేసిన ముంబై యువకుడు బిలాల్ ఖాజీకి బ్రిటన్ కోర్టు 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 'రీస్' పేరుతో 14 ఏళ్ల బాలుడిగా నటిస్తూ 11 నుంచి 17 ఏళ్ల బాలికలను మోసం చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఇప్పటివరకు 70 మంది బాధితులను గుర్తించగా, మరో 180 మంది ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

By:  Tupaki Desk   |   14 Nov 2026 5:00 PM IST
70 మంది బాలికలను ట్రాప్ చేసిన భారతీయ విద్యార్థి.. బ్రిటన్‌లో 30 ఏళ్ల జైలు శిక్ష!
X

విదేశాల్లో చదువుకుంటూ ఉన్న ఓ భారతీయ యువకుడు చేసిన పని ఇప్పుడు బ్రిటన్‌లో చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియా ద్వారా బాలికలకు దగ్గరై, వారిని బ్లాక్‌మెయిల్ చేసిన కేసులో ముంబైకి చెందిన 27 ఏళ్ల బిలాల్ ఖాజీకి అక్కడి కోర్టు 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో ఇప్పటివరకు 70 మంది బాధితులను పోలీసులు గుర్తించారు.

బిలాల్ సోషల్ మీడియాలో తన అసలు వివరాలతో కాకుండా 'రీస్' అనే పేరుతో అకౌంట్ నడిపేవాడు. తాను 14 ఏళ్ల బాలుడినని చెప్పుకుంటూ స్నాప్‌చాట్ సహా ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో అమ్మాయిలతో పరిచయం పెంచుకునేవాడు. మాటలతో వారిని నమ్మించి, ప్రేమిస్తున్నానంటూ దగ్గరయ్యేవాడు. కొంతకాలం తర్వాత వారి నుంచి వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు తీసుకుని వాటితోనే బెదిరింపులకు దిగేవాడు.

ఈ వ్యవహారం బయటపడటానికి ఓ తల్లి చేసిన ఫిర్యాదే కారణమైంది. తన కుమార్తె ఫోన్‌లో అనుమానాస్పద మెసేజ్‌లు చూసిన ఆమె పోలీసులను ఆశ్రయించింది. దర్యాప్తు చేపట్టిన అధికారులు ఒక్కో విషయం బయటకు తీశారు. బాధితుల్లో 11 నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న బాలికలు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటివరకు 70 మంది బాధితులను గుర్తించగా, మరో 180 మంది వరకు ఈ వ్యవహారంలో బాధితులై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

ముంబైకి చెందిన బిలాల్ కెమిస్ట్రీలో పీహెచ్‌డీ పూర్తి చేశాడు. 2023లో బ్రిటన్‌లోని హీత్రో విమానాశ్రయానికి తిరిగి వచ్చిన సమయంలో తొలిసారి అరెస్టయ్యాడు. అనంతరం దర్యాప్తు కొనసాగగా, 2025లో మరోసారి అతడిని అదుపులోకి తీసుకున్నారు.

చెస్టర్ క్రౌన్ కోర్టులో విచారణ సందర్భంగా బిలాల్ 37 నేరాలకు పాల్పడినట్లు అంగీకరించాడు. దీంతో న్యాయమూర్తి అతడికి 30 ఏళ్ల జైలు శిక్ష విధించారు. అంతేకాదు, జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా మరో ఎనిమిదేళ్ల పాటు పర్యవేక్షణలో ఉండాలని ఆదేశించారు. సోషల్ మీడియా ద్వారా సాగిన ఈ వ్యవహారం బ్రిటన్‌లో వెలుగుచూసిన పెద్ద ఆన్‌లైన్ బాలల లైంగిక నేరాల కేసుల్లో ఒకటిగా నమోదైంది.