అయోడిన్ టాబ్లెట్లు పంచుతున్న ఇరాన్.. అసలేంటి కథ? ఎందుకిలా?
అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం అణు కేంద్రాల సమీప ప్రజలకు పొటాషియం అయోడైడ్ మాత్రలను పంపిణీ చేస్తోంది. నటాంజ్, బుషెహర్ అణు కేంద్రాల పరిసరాల్లో నివసించే వారికి ఈ మాత్రలు అందిస్తున్నారు. అణు ప్రమాదం జరిగితే రేడియోధార్మిక అయోడిన్ ప్రభావం నుంచి థైరాయిడ్‌ను రక్షించేందుకు ఇవి ఉపయోగపడతాయి. దీంతో ఇరాన్లో యుద్ధ భయాలు మరింత పెరిగాయి.
By: Tupaki Desk | 7 Nov 2026 7:39 PM ISTయుద్ధం ప్రకటించకుండానే ఒక దేశంలో మృత్యు భయం గుమ్మం ముందుకు వచ్చి నిలబడితే... రేడియేషన్ విషపు గాలుల నుంచి ప్రాణాలను కాపాడుకునేందుకు కనీసం ఒక చిన్న మాత్రే ఆసరాగా మారితే... ఆ వాతావరణం ఎంత గుండె కోతను మిగులుస్తుంది? అమెరికా, ఇరాన్ మధ్య ముదురుతున్న వైరం ఇప్పుడు సరిహద్దులు దాటి పసిపిల్లలు, అమాయక పౌరుల దేహాల వరకు పాకింది. "రేపు దాడి జరిగితే మీ ప్రాణాలు కాపాడుకోండి" అంటూ ఇరాన్ ప్రభుత్వం తమ ప్రజల చేతిలో అయోడిన్ బిళ్ళలను పెడుతుంటే ప్రతి ఇంట్లో భయం గుండెచప్పుడుగా మారింది. సైనిక దాడులు.. అణు బాంబుల రాజకీయాల వెనుక నలిగిపోతున్నది కేవలం సామాన్య మానవుడే అనడానికి ఇరాన్ వీధుల్లో కనిపిస్తున్న ఈ ముందస్తు రక్షణ చర్యలే సజీవ సాక్ష్యం..
అయినా మిడ్ టర్మ్ ఎన్నికల్లో ఓడిపోయి పీకల్లోతు బాధలో ఉన్నాడు ట్రంప్.. పైగా తన జిగ్రీ దోస్త్ నెతన్యాహు సైతం ఇజ్రాయెల్ లో మెజార్టీ రాక అధికారానికి దూరమవుతున్నాడు. ఇంతటి కష్టాల్లో ఉన్న అమెరికా, ఇజ్రాయెల్ లో ఇరాన్ పై దాడి చేయబోతున్నాయా? అందుకే ఇరాన్ సిద్ధమవుతోందా? ప్రస్తుతం ఇరాన్ వ్యాప్తంగా ఉన్న అణుకేంద్రాలు, స్థావరాల వద్ద ప్రజలకు అయోడిన్ ట్యాబ్లెట్లను పంచుతోంది. దీంతో యుద్ధానికి ఇది ముందస్తు సంకేతమా? ఏం జరుగుతోందా? అన్న ప్రశ్న వినిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మరో భారీ యుద్ధమా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
ఇరాన్‌లోని అణు కేంద్రాల సమీపంలో నివసించే ప్రజలకు ఇరాన్ ప్రభుత్వం పొటాషియం అయోడైడ్ , అయోడిన్ మాత్రలను ఉచితంగా పంపిణీ చేయడంతో ప్రపంచవ్యాప్తంగా కలకలం రేగింది. నటాంబ్, బుషెహర్ అణు విద్యుత్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో దాదాపు రెండు నుంచి మూడు కిలోమీటర్ల పరిధిలో నివసించే ప్రజలకు అధికారులు ఈ మాత్రలు అందిస్తున్నారు. ముఖ్యంగా పికాక్స్ పర్వతం వద్ద అత్యంత పటిష్టంగా నిర్మించిన భూగర్భ అణు స్థావరం ప్రస్తుతం అమెరికా వ్యూహాత్మక టార్గెట్‌గా మారిందనే ప్రచారం ఊపందుకుంది. కష్టమైన ఈ భూగర్భ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగే ముప్పు ఉందన్న ఆందోళనలతో ప్రజలను రక్షించుకోవడానికి ఇరాన్ ముందస్తు చర్యలు చేపట్టింది. 'ది టైమ్స్' నివేదిక ప్రకారం డోనాల్డ్ ట్రంప్ తీసుకునే సైనిక నిర్ణయాలను అంచనా వేయడం కష్టమని.. అందుకే ఈ సన్నాహాలని అధికారులు భావిస్తున్నారు.
అయోడిన్ మాత్రలు అణు దాడి నుండి పూర్తిగా కాపాడలేవు. కానీ రేడియోధార్మికత వల్ల కలిగే దారుణ పరిణామాలను అడ్డుకోగలవు. అణు ప్రమాదం జరిగినప్పుడు విడుదలయ్యే ప్రమాదకర 'రేడియోధార్మిక అయోడిన్' శరీరంలోకి చేరకుండా ఈ పొటాషియం అయోడైడ్ బిళ్ళలు థైరాయిడ్‌ను స్థిరమైన అయోడిన్‌తో నింపుతాయి. భవిష్యత్తులో రేడియేషన్ వల్ల వచ్చే థైరాయిడ్ క్యాన్సర్ ప్రమాదాన్ని ఇవి గణనీయంగా తగ్గిస్తాయి.
ప్రజలకు సైరన్ వినిపించిన 10 నుండి 15 నిమిషాల్లోనే సురక్షిత షెల్టర్లకు చేరాలని.. అధికారిక వార్తల కోసం వేచి చూడండి అని సూచించే మార్గదర్శకాలు ఇరాన్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారమవుతున్నాయి.
ఇరాన్ ప్రస్తుతం యుద్ధానికి సర్వసన్నద్ధమవుతుందడానికి ఈ ప్రిపరేషన్లు ఒక ఉదాహరణ. అమెరికా, ఇజ్రాయెల్ కు బలమైన హెచ్చరికలే పంపుతోంది. అణు దాడులు చేయబోతున్నారన్న సంకేతాలను ప్రపంచానికి పంపుతోంది. అమాయక పౌరులను కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా సానుభూతి మద్దతు కోసం పాటు పడుతోంది.
ఆయుధ పోరాటాల మధ్య నలిగిపోకుండా తమ ప్రజల ప్రాణాలను.. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఇరాన్ ఇలా మానవతా దృక్పథంలో అడుగులు వేస్తోంది. యుద్ధ భయాలు వీడి శాంతి దిశగా అడుగులు పడాలని కోరుకుందాం.
