అమెరికాలో ఏమైపోతోంది? మూడు నెలల కరెంట్ ఉండదనే భయంతో జనాల పరుగులు!
అమెరికాలో 90 రోజుల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందనే ప్రచారంతో జార్జియా, సౌత్ కరోలినాలో ప్రజలు ఆహారం, నీళ్లు, ఇంధనం నిల్వ చేసుకుంటున్నారు. దీంతో కొన్ని దుకాణాల్లో అమ్మకాలు 60-70 శాతం పెరిగాయి. అయితే ఈ ప్రచారం FORTRESS America సైనిక సంసిద్ధత ప్రణాళికపై అపోహల వల్ల మొదలైనట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా విద్యుత్ నిలిపివేస్తారంటూ అమెరికా ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
By: Tupaki Desk | 14 Nov 2026 4:13 PM ISTఅమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో 90 రోజుల పాటు కరెంట్ ఉండదనే ప్రచారం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. దీంతో జార్జియా, సౌత్ కరోలినా రాష్ట్రాల్లో కొందరు నీళ్లు, ఆహార పదార్థాలు, బ్యాటరీలు, ఇంధనం వంటి అత్యవసర వస్తువులను పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్నారు.
జార్జియాలోని అగస్టా, సౌత్ కరోలినాలోని లారెన్స్ కౌంటీలో ఈ తరహా కొనుగోళ్లు పెరిగినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. లారెన్స్ కౌంటీలో Stock Pile Tactical దుకాణం నిర్వహిస్తున్న జాన్ కాస్టిల్లో మాట్లాడుతూ.. తమ దుకాణంలో అమ్మకాలు 60 నుంచి 70 శాతం పెరిగాయని తెలిపారు. నిత్యావసర వస్తువులతో పాటు తుపాకులు, మందుగుండు సామగ్రిని కూడా కొనుగోలు చేస్తున్నారని చెప్పారు.
ఈ ప్రచారానికి FORTRESS America అనే రక్షణ ప్రణాళికతో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 30న అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ ప్రకటించిన ఈ ప్రణాళిక లక్ష్యం.. సైబర్ దాడులు, అత్యవసర పరిస్థితుల్లో సైన్యం స్వతంత్రంగా పనిచేసే సామర్థ్యాన్ని పెంచడం. ఈ నేపథ్యంలో సైనిక విభాగాలు 90 రోజుల పాటు స్వతంత్రంగా పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలనే అంశం చర్చకు వచ్చింది.
అయితే ఇది సైనిక సంసిద్ధతకు సంబంధించిన ప్రణాళిక మాత్రమే. అమెరికా అంతటా 90 రోజుల పాటు విద్యుత్ సరఫరా నిలిపివేస్తారనే ప్రకటన ప్రభుత్వం చేయలేదు. కాబట్టి సోషల్ మీడియాలో వస్తున్న బ్లాక్‌అవుట్ ప్రచారానికి అధికారిక ఆధారాలు లేవు.
