అమెరికాలో భారతీయుడి దుశ్చర్య.. ఖంగుతిన్న అగ్రరాజ్యం..
ఉద్యోగాలు కోల్పోతే వెంటనే దేశం విడిచిపెట్టాల్సిన పరిస్థితి, హెచ్-1బీ వీసాల అనిశ్చితి, లేఆఫ్స్, ఆర్థిక మందగమనం.. ఇవన్నీ భారతీయ నిపుణులపై తీవ్రమైన మానసిక ఒత్తిడిని పెంచుతున్నాయి.
By: Tupaki Political Desk | 13 Dec 2025 11:50 AM ISTవైన్ తయారీ కేంద్రానికి నిప్పు పెట్టేందుకు ప్రయత్నించిన భారత సంతతి మిలియనీర్ విక్రమ్ బెరి అరెస్ట్ వార్త ఒక్కసారిగా అమెరికాలోని భారతీయ సమాజాన్ని ఆలోచనలో పడేసింది. ఇది ఒక వ్యక్తి చేసిన దాడిగా మాత్రమే చూడలేం. బయటకు అమెరికాలో ఉంటున్న వ్యక్తి లైఫ్ ను గెలిచాడుని అనుకున్నా.. లోపల ఎంత ఒత్తిడి ఎదుర్కొంటున్నాడో అర్థం అవుతుంది. అమెరికాలో స్థిరపడిన భారతీయులపై మానసిక భారం ఎలా పెరుగుతోందో చూపిస్తుంది.
కాలిఫోర్నియాలోని సారాటోగాలో జరిగిన ఈ ఘటనలో, ఒకప్పుడు కన్సల్టెంట్‌గా పని చేసి, తర్వాత మానసిక ఆరోగ్య రంగంలోనే ‘బెటర్‌లైఫ్ వెల్‌నెస్’ అనే సంస్థను స్థాపించిన వ్యక్తి ఇలా హింసాత్మకంగా ప్రవర్తించడం చాలా మందిని షాక్ కు గురి చేసింది. డిగ్రీలు, ఎంబీఏ, పెట్టుబడులు, మిలియన్ల సంపద.. ఇవన్నీ ఒక వైపు ఉంటే, మరోవైపు మానసిక స్థిరత్వం ఎంత సున్నితమైపోయిందో ఈ ఉదంతం చెప్పకనే చెబుతోంది. వైన్ తయారీ కేంద్రానికి నిప్పు పెట్టేందుకు ప్రయత్నించడం, సిబ్బందిపై బాటిల్ విసరడం, పారిపోతూ కార్లను ఢీకొట్టడం, చివరకు కారులోనే తనని తాను లాక్ చేసుకోవడం. ఇవన్నీ ఒక క్షణికావేశం కాదు, లోతైన సూచనలుగా కనిపిస్తున్నాయి.
ఇలాంటి ఘటనలు ఇప్పుడు అమెరికాలోని భారతీయ సమాజంలో అరుదుగా ఉండడం లేదు. ఉద్యోగ భద్రత, వీసా ఒత్తిడి, ఇమ్మిగ్రేషన్ నిబంధనల భయం, కుటుంబ అంచనాలు, సమాజంలో ‘సక్సెస్‌ఫుల్’గా కనిపించాలన్న మానసికమైన మౌనంగా ఉండే ఒత్తిడి ఇవన్నీ కలిసివచ్చి అనేక మందిని లోపలే కుంగదీస్తున్నాయి. పైకి నవ్వుతూ, లోపల కుమిలిపోతున్న జీవితాలు అమెరికన్ ఇండియన్ కమ్యూనిటీలో పెరుగుతున్నాయన్న వాస్తవాన్ని ఇలాంటి ఘటనలు గుర్తు చేస్తున్నాయి.
ప్రత్యేకంగా ఇటీవల సంవత్సరాల్లో అమెరికాలో పరిస్థితులు మరింత కఠినమయ్యాయి. ఉద్యోగాలు కోల్పోతే వెంటనే దేశం విడిచిపెట్టాల్సిన పరిస్థితి, హెచ్-1బీ వీసాల అనిశ్చితి, లేఆఫ్స్, ఆర్థిక మందగమనం.. ఇవన్నీ భారతీయ నిపుణులపై తీవ్రమైన మానసిక ఒత్తిడిని పెంచుతున్నాయి. ఒకప్పుడు ‘డ్రీమ్ లైఫ్’గా కనిపించిన అమెరికా జీవితం, ఇప్పుడు నిరంతర ఆందోళనల మధ్య సాగుతున్న పోరాటంగా మారుతోంది. ఇందులో మరో విషయం ఏంటంటే విక్రమ్ బెరి పనిచేసిన రంగమే మానసిక ఆరోగ్యం. ఇతరులకు వెల్‌నెస్, మైండ్‌ఫుల్‌నెస్ గురించి చెప్పే వ్యవస్థలో ఉన్న వ్యక్తి స్వయంగా నియంత్రణ కోల్పోవడం, ఈ సమస్య ఎంత లోతుగా ఉందో చెప్పే ఉదాహరణగా మారింది. మానసిక ఆరోగ్యంపై మాట్లాడడం, సాయం కోరడం ఇంకా ఒక ‘వీక్‌నెస్’గా చూసే ధోరణి కూడా ఇలాంటి పరిణామాలకు దారితీస్తోంది. సాయం కోరాల్సిన సమయంలో మౌనంగా ఉండిపోవడం, చివరకు ఇలా బయటపడటం ప్రమాదకరం.
ఈ ఘటనను కేవలం ఒక వ్యక్తి చేసిన నేరంగా చూడడం సులభం. కానీ దీని వెనుక ఉన్న సామాజిక నేపథ్యాన్ని చూడకుండా వదిలేస్తే, ఇలాంటి ఘటనలు మళ్లీ మళ్లీ జరుగుతూనే ఉంటాయి. అమెరికాలోని భారతీయ సమాజంలో మానసిక ఆరోగ్యంపై మరింత ఓపెన్ చర్చ అవసరం. ఉద్యోగం, డబ్బు, హోదా మాత్రమే జీవిత విజయ సూచికలు కాదన్న అవగాహన పెరగాలి. కుటుంబాలు, కమ్యూనిటీలు “అన్నీ బాగానే ఉన్నాయా?” అని నిజంగా అడిగి వినే స్థాయికి రావాలి. అమెరికా అధికారులు ఈ కేసును చట్టపరంగా ఎలా తీసుకెళ్తారన్నది ఒక అంశం. కానీ భారతీయ సమాజానికి ఇది ఒక అద్దంలా మారాలి. విజయంగా కనిపించే ముఖాల వెనుక ఉన్న ఒత్తిడిని గుర్తించకపోతే, ఇలాంటి ఘటనలు వ్యక్తిగత విషాదాలుగానే కాదు, సమూహ హెచ్చరికలుగానూ మారతాయి. విక్రమ్ బెరి కథ మనకు చెప్పేది ఒక్కటే.. విదేశాల్లో జీవితం కేవలం అవకాశాల సమాహారం కాదు; అది సమతుల్యత కోల్పోతే, మానసిక భద్రత లేకపోతే, ఎంత ఎత్తులో ఉన్నా క్షణంలో కూలిపోయే ప్రమాదం ఉంది.
