Begin typing your search above and press return to search.

అమెరికాలో 540 రోజుల వర్క్ పర్మిట్ పొడిగింపునకు బ్రేక్.. భారతీయులకు కొత్త కష్టాలు!

అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న విదేశీయులకు, ముఖ్యంగా భారతీయులకు ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న వలస విధాన నిర్ణయాలు కొత్త కష్టాలను తెచ్చిపెడుతున్నాయి.

By:  Tupaki Desk   |   14 Oct 2026 8:22 PM IST
అమెరికాలో 540 రోజుల వర్క్ పర్మిట్ పొడిగింపునకు బ్రేక్.. భారతీయులకు కొత్త కష్టాలు!
X

అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న విదేశీయులకు, ముఖ్యంగా భారతీయులకు ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న వలస విధాన నిర్ణయాలు కొత్త కష్టాలను తెచ్చిపెడుతున్నాయి. తాజాగా వర్క్ పర్మిట్ గడువు ముగిసిన తర్వాత ఆటోమేటిక్‌గా లభించే 540 రోజుల పొడిగింపును రద్దు చేసే నిర్ణయం వేలాది మంది విదేశీ ఉద్యోగుల్లో ఆందోళన పెంచుతోంది.

గతంలో గ్రీన్ కార్డు లేదా వర్క్ పర్మిట్ పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి, అధికారుల నుంచి అనుమతి రావడంలో ఆలస్యమైనా.. కొన్ని అర్హతలు, నిబంధనలకు లోబడి మరో 540 రోజుల వరకు ఉద్యోగం కొనసాగించే వెసులుబాటు ఉండేది. ఇప్పుడు ఆ రక్షణ తొలగిపోవడంతో, పర్మిట్ గడువు ముగిసేలోపు కొత్త అనుమతి రాకపోతే ఉద్యోగానికి తాత్కాలికంగా దూరమయ్యే పరిస్థితి ఎదురుకావచ్చు.

ఈ మార్పు ముఖ్యంగా వర్క్ ఆథరైజేషన్ పునరుద్ధరణ కోసం ఎదురుచూస్తున్న విదేశీ ఉద్యోగులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కంపెనీలకూ సిబ్బంది నిర్వహణలో ఇబ్బందులు తలెత్తవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ నిబంధన ప్రభావం ఉద్యోగి వీసా రకం, దరఖాస్తు పరిస్థితులు, వర్తించే మినహాయింపులపై ఆధారపడి ఉంటుంది. F-1 విద్యార్థి వీసా, OPTలో ఉన్నవారిపై ఈ నిర్దిష్ట మార్పు నేరుగా ప్రభావం చూపదని సమాచారం.

ఇప్పటికే ఉద్యోగం కోల్పోయిన H-1B, L-1, O-1 వీసాదారులకు వర్తించే 60 రోజుల గడువుపై ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో, వర్క్ పర్మిట్ పొడిగింపుపై తాజా నిర్ణయం వలసదారుల సమస్యలను మరింత పెంచేలా కనిపిస్తోంది. పత్రాల పరిశీలనలో ఆలస్యం కారణంగా ఉద్యోగాలకు విరామం ఏర్పడుతుందేమోనని, తమ అమెరికా భవిష్యత్తు ఏమవుతుందోనని భారతీయ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.