Begin typing your search above and press return to search.

అమెరికా వెళ్ళిన తెలుగు విద్యార్థుల తప్పే లేదా? మీడియా ఎందుకు తప్పుగా చూపిస్తోంది?

అమెరికా వీసా అనేది మన హక్కు కాదు. కొన్ని నిర్దిష్టమైన షరతులతో కూడుకున్న అనుమతి.

By:  Tupaki Desk   |   15 April 2025 4:00 PM IST
అమెరికా వెళ్ళిన తెలుగు విద్యార్థుల తప్పే లేదా? మీడియా ఎందుకు తప్పుగా చూపిస్తోంది?
X

‘ఇల్లు అలకగానే పండుగ కాదు.. అమెరికా వీసా రాగానే మనకు సర్వహక్కులు రావు.. ’ ఆ విషయాన్ని తెలుసుకొని.. అమెరికాలో అమెరికన్ గా అన్ని నిబంధనలు పాటించి చదివి ఉద్యోగం సంపాదిస్తేనే ఇండియా నుంచి వచ్చినందుకు సార్ధకత.. ఓ సుందర్ పిచాయ్ కానీ, ఓ సత్య నాదెళ్ల కానీ ఇదే చేశారు. ఇండియాకు పేరు తెచ్చారు. ఎంతో మంది విజయాలు సాధించిన ప్రవాస భారతీయులని స్ఫూర్తిగా తీసుకొని అమెరికాకు వచ్చిన కొందరు విద్యార్థులు చేస్తున్న అత్యుత్సాహాలకు వారి వీసా క్యాన్సిల్ అవుతోంది. వారు అలా ఎందుకు చేశారో అర్థం చేసుకోకుండా ట్రంప్ ప్రభుత్వం తీరుపై పడిపోయి ఇండియాలో రచ్చ చేస్తున్న మీడియా, సోషల్ మీడియా ఇప్పటికైనా అమెరికాలో వాస్తవాలు తెలుసుకొని అవగాహన పెంచుకొని విద్యార్థులు, ప్రజలకు సరైన దారి చూపిస్తే విదేశీయానం ఎప్పటికీ గొప్పగానే కనిపిస్తుంది..

అమెరికా వీసా అనేది మన హక్కు కాదు. కొన్ని నిర్దిష్టమైన షరతులతో కూడుకున్న అనుమతి. అందుకే వీసా ఇంటర్వ్యూ అనగానే చాలా మందిలో భయం నెలకొంటుంది. అయితే, అలాంటప్పుడు మన వాళ్ళు ఎలా ఉండాలి? కొత్తగా వచ్చిన నిబంధనలేమీ కావు. ఒక్కో అధ్యక్షుడు ఒక్కో విధంగా వ్యవహరిస్తారు. కొందరు కఠినంగా ఉంటే, కొందరు కాస్త వెసులుబాటు కలిగి ఉంటారు. బైడెన్ ప్రభుత్వం కొంతవరకు వలసదారులకు వెసులుబాటు కల్పించింది నిజమే. కానీ, దాని అర్థం మనం ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించవచ్చని కాదు. మనం చేయకూడని పనులు చేస్తే అమెరికా ఎందుకు ఊరుకుంటుంది? అసలు అక్కడ ఏమి జరుగుతోంది? మన మీడియా మాత్రం ఏమి చూపిస్తోంది? అన్నదే ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాల్సిన అంశం.

-అమెరికాలో వీసా రద్దుకు అసలు కారణాలు ఇవీ..

మన దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్‌కు ఎంతగానో జరిమానాలు విధిస్తున్నారు కదా? అలాగే అమెరికాలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే వీసా రద్దు చేస్తున్నారు. రూమ్‌లో విద్యార్థులు గొడవపడి పోలీసులకు ఫోన్ చేస్తే ఏమి చేస్తారు? కేసులు పెడతారు. అమెరికాలో తప్పు అని తేలితే వీసా రద్దు చేస్తారు. పుట్టినరోజు పార్టీలకు అందరినీ పిలిచి, బయట పెద్దగా సంగీతం పెడితే ఏమి చేస్తారు? పక్కింటి వాళ్ళు కంప్లైంట్ చేస్తారు, కేసులు పెట్టి అమెరికాలో అయితే వీసా రద్దు చేస్తారు.డ్రగ్స్ తీసుకుంటే మన దగ్గర అరెస్ట్ చేస్తున్నారు కదా? అమెరికాలో అయితే వీసా రద్దు చేస్తున్నారు. వేగంగా వెళ్తూ ఎవరినైనా ఢీకొట్టి ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? అమెరికాలో ఇలా చేస్తే వీసా రద్దు చేస్తారు. కార్లకు ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తే ఏమి చేస్తారు? కేసు పెట్టి వీసా రద్దు చేస్తారు. రెడ్ లైట్ జంప్ చేసి ఎవరినైనా గుద్ది వాళ్ళు చనిపోతే ఏమి చేస్తారు? కేసు పెట్టి వీసా రద్దు చేస్తారు. రూమ్‌లో జూదం ఆడుకుంటూ పాస్‌పోర్ట్‌లు దాచిపెట్టి ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుంటే ఏమి చేస్తారు? కేసు పెట్టి వీసా రద్దు చేస్తారు.

ఇలాంటివి చాలా మంది మన విద్యార్థులు చేశారు. ఇవన్నీ చెప్పకుండా, మన వాళ్ళను అమెరికా నుంచి పంపిస్తున్నారు అని గొడవ చేస్తే ఏమి లాభం? అమెరికా వెళ్ళేది ఎందుకు? చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించి డబ్బులు సంపాదించి తల్లిదండ్రులకు పంపించడానికి.. మీ జీవితాన్ని ఉద్దరించడానికి..? అందుకే మధ్యతరగతి ప్రజలు, అప్పులు చేసి, లోన్లు తీసుకొని మరీ తమ కుమారులు కుమార్తెలను లక్షలు పోసి అమెరికాలో చదివిస్తారు. కానీ ఇక్కడికి వచ్చి విద్యార్థులు అమెరికా నిబంధనల ప్రకారం నడుచుకోకుండా తప్పులు చేసి వీసా రద్దు చేసుకొని ఇండియాకు అవమానభారంతో వచ్చేస్తున్నారు.

అమెరికాలో ఏమాత్రం ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే వీసా రద్దు చేస్తారు. విద్యార్థులు ఎవరికి నష్టం చేస్తున్నారు? అన్నది ఆలోచించుకోవాలి. తమ తల్లిదండ్రులను మోసం చేస్తూ, తమ చేష్టలతో తమ వీసాలను తామే పోగొట్టుకుంటున్నామన్న వాస్తవాన్ని గ్రహించాలి.. లక్షల మందిలో కేవలం వందల మంది వీసాలు రద్దయ్యాయి అంతే.. అంత మాత్రాన ట్రంప్ ప్రభుత్వం అందరినీ పంపిస్తున్నారని ఎలా మాట్లాడతారు మన తెలుగు మీడియా? మీడియా అన్నాక కొంచెమైనా ప్రజలకు అవగాహన కల్పించాలి కదా? అదే చేయలేకపోతోంది.. ఇష్టం వచ్చిన థంబ్‌నెయిల్స్ పెట్టి తల్లిదండ్రులను టెన్షన్ పెట్టేది మన తెలుగు మీడియానే. అమెరికాలో రూల్స్ తెలియకుండా డిబేట్లు పెట్టి అక్కడ బాగా లేదు, అందరూ వచ్చేస్తున్నారని గగ్గోలు పెట్టి చెప్పడం సరికాదు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే మరీ మన వాళ్ళను హీనంగా చూపిస్తున్నాయి. బేసిక్ సబ్జెక్ట్ అమెరికా గురించి తెలియకుండానే ఛానల్స్‌కు మేధావులు వచ్చి అంతా మాకు తెలుసని బిల్డప్ ఇస్తున్నారు. అదే జాతీయ మీడియాకు అమెరికా పరిస్థితులు తెలుసు కాబట్టే వారు ఈ రచ్చను చూపించడం లేదు.

- ప్రవాస భారతీయులు చేయాల్సినది ఇదీ

నిజానికి అమెరికా వీసా నిబంధనలు చాలా స్పష్టంగా ఉంటాయి. వాటిని ఉల్లంఘిస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో కూడా ముందే తెలుస్తుంది. విద్యార్థులు అక్కడకు వెళ్ళేది ఉన్నత విద్యను అభ్యసించడానికి.. మంచి భవిష్యత్తును నిర్మించుకోవడానికి. అలాంటప్పుడు, బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడం వల్ల తమ భవిష్యత్తును మాత్రమే కాకుండా, తమ తల్లిదండ్రుల ఆశలను కూడా వమ్ము చేసినట్లు అవుతుంది. తెలుగు మీడియా ఈ విషయాన్ని మరింత బాధ్యతాయుతంగా చూడాలి. కొందరు విద్యార్థులు చేసిన తప్పుల వల్ల అందరినీ ఒకే గాటన కట్టడం సరికాదు. నిజానిజాలు తెలుసుకోకుండా, సంచలనం కోసం వార్తలు ప్రసారం చేయడం వల్ల అనవసరమైన భయాందోళనలు నెలకొంటాయి. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న చాలా మంది విద్యార్థులు అక్కడ చట్టాలను గౌరవిస్తూ, తమ చదువుపై దృష్టి పెడుతున్నారు. వారిని ప్రోత్సహించాల్సింది పోయి, కొందరి తప్పులను భూతద్దంలో చూపించడం సమంజసం కాదు.

కాబట్టి విద్యార్థులు తమ ప్రవర్తన పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలి. అమెరికా చట్టాలను గౌరవించాలి. అలాగే తెలుగు మీడియా కూడా వాస్తవాలను నిష్పక్షపాతంగా చూపించాలి. సంచలనాల కోసం కాకుండా అవగాహన కల్పించే కథనాలను ప్రచురించాలి. అప్పుడే అమెరికాలో జీవనం.. వీసా రద్దు.. అక్కడ నిబంధనల విషయంలో సరైన దృక్పథం ఇండియాలోని ప్రజల్లో ఏర్పడుతుంది.