అమెరికాలో OPT పేరుతో మోసాలు.. F-1 విద్యార్థులను టార్గెట్ చేస్తున్న కన్సల్టెన్సీలు!
అమెరికాలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొన్ని టెక్ కన్సల్టెన్సీలు F-1 విద్యార్థులను మోసం చేస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. తప్పుడు రెజ్యూమ్‌లు, నకిలీ అనుభవంతో క్లయింట్లకు పరిచయం చేస్తున్నారని అట్లాంటాకు చెందిన ఓ టెక్ కన్సల్టెంట్ వెల్లడించారు. రెండేళ్లలో ఉద్యోగం వదిలేస్తే 24 వేల డాలర్ల జరిమానా విధించే ఒప్పందాలు కూడా ఉన్నాయని తెలిపారు.
By: Tupaki Desk | 26 Nov 2026 9:22 AM ISTఅమెరికాలో చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం సంపాదించడం అంత సులభం కాదు. ముఖ్యంగా F-1 వీసాపై ఉన్న విద్యార్థులకు OPT గడువు దగ్గరపడుతుంటే ఒత్తిడి మరింత పెరుగుతుంది. ఇదే పరిస్థితిని కొన్ని టెక్ కన్సల్టెన్సీలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అట్లాంటాలో టెక్ కన్సల్టింగ్ రంగంలో పనిచేస్తున్న ఓ అమెరికా పౌరుడు ఈ వ్యవహారంపై తాజాగా కొన్ని విషయాలు బయటపెట్టారు. ఉద్యోగం ఇప్పిస్తామంటూ విద్యార్థులను తమ సంస్థల్లో చేర్చుకుంటున్న కొన్ని కన్సల్టెన్సీలు, ఆ తర్వాత వారితో తప్పుడు పనులు చేయిస్తున్నాయని ఆయన ఆరోపించారు.
విద్యార్థులకు కొత్తగా రెజ్యూమ్‌లు తయారు చేసి, అందులో అసలు లేని ఏడెనిమిదేళ్ల అనుభవాన్ని చూపిస్తున్నారట. కొందరిని అమెరికా పౌరులుగా క్లయింట్లకు పరిచయం చేస్తున్నారని, లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ కనిపించకుండా ఉంచాలని కూడా చెబుతున్నారని ఆయన వెల్లడించారు.
చేతిలో ప్రాజెక్టులు లేకపోయినా విద్యార్థులను నెలల తరబడి బెంచ్‌పై ఉంచుతున్నారట. ఈ సమయంలో గంటకు 10 నుంచి 15 డాలర్లు మాత్రమే చెల్లిస్తున్నారని ఆరోపణ. ప్రాజెక్టు దొరికినప్పుడు జూనియర్ ఉద్యోగులను సీనియర్లుగా చూపించి క్లయింట్ల నుంచి ఎక్కువ మొత్తాలు వసూలు చేస్తున్నారని తెలిపారు.
ఉద్యోగంలో చేరిన రెండేళ్లలోపు బయటకు వస్తే 24 వేల డాలర్లు చెల్లించాలనే ఒప్పందాలు కూడా ఉంటున్నాయని ఆయన పేర్కొన్నారు. రెండేళ్ల ఒప్పందాలు, భారీ జరిమానాల ఆరోపణలతో ఈ కన్సల్టెన్సీల వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఉద్యోగం కోసం వీటిని ఆశ్రయించిన విద్యార్థులు అసలు పరిస్థితి తెలుసుకునేలోపే చిక్కుల్లో పడే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
