Begin typing your search above and press return to search.

విదేశీ విద్యార్థులకు కొత్త సవాల్‌: అసలేంటి సోషల్‌ మీడియా ‘వెట్టింగ్‌’?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కఠిన విధానాలతో గందరగోళంలో ఉన్న విదేశీ విద్యార్థులకు ఇప్పుడు మరో దిగులు పట్టుకుంది.

By:  Tupaki Desk   |   28 May 2025 3:28 PM IST
విదేశీ విద్యార్థులకు కొత్త సవాల్‌: అసలేంటి సోషల్‌ మీడియా ‘వెట్టింగ్‌’?
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కఠిన విధానాలతో గందరగోళంలో ఉన్న విదేశీ విద్యార్థులకు ఇప్పుడు మరో దిగులు పట్టుకుంది. అదే సోషల్‌ మీడియా వెట్టింగ్‌! విదేశీ విద్యార్థుల సామాజిక మాధ్యమ ఖాతాల తనిఖీపై అగ్రరాజ్యం మరింత దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాల్లో కొత్తగా విద్యార్థి వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారి ఇంటర్వ్యూల షెడ్యూలింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది.

-ఇంతకీ ఏంటీ సోషల్‌ మీడియా వెట్టింగ్‌?

వీసా దరఖాస్తుదారులకు అనుమతి ఇవ్వొచ్చా.. లేదా అనే దాన్ని అంచనా వేయడం కోసం వారి ఆన్‌లైన్‌ యాక్టివిటీని అధికారులు తనిఖీ చేయడాన్నే ‘సోషల్‌ మీడియా వెట్టింగ్‌’ అంటారు. సంబంధిత విద్యార్థుల సోషల్‌ మీడియా ప్రొఫైళ్లను పరిశీలించిన తర్వాతే వీసా మంజూరు చేస్తారు. దీనిపై ప్రస్తుతం అమెరికా సన్నాహాలు చేపట్టింది. అప్పటివరకు విద్యార్థులకు వీసా ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్లను నిలిపివేశారు.

-ఎలా చేస్తారు?

దీనిపై అమెరికా విదేశాంగ శాఖ ఇప్పటివరకు ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేయలేదు. అయితే ఉగ్రవాదులను నియంత్రించడం, యూదు వ్యతిరేకతను ఎదుర్కోవడమే లక్ష్యంగా ఈ తనిఖీ చేయనున్నట్లు అగ్రరాజ్యం వెల్లడించింది. ఉదాహరణకు.. ఎవరైనా విద్యార్థి తమ సామాజిక మాధ్యమ ఖాతాలో పాలస్తీనా జెండాను పోస్ట్‌ చేసినట్లయితే ఆ వ్యక్తిని మరింత క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. వారి వల్ల దేశ భద్రతకు ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధారించుకున్న తర్వాతే వారిని అమెరికా విద్యాసంస్థల్లో చదువుకునేందుకు అనుమతినిస్తారు. అప్పుడే వారికి విద్యార్థి వీసా లభిస్తుంది.

గతంలో కొంతమంది విద్యార్థులు, ప్రొఫెసర్ల సోషల్‌ మీడియా ఖాతాలను తనిఖీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చిలో బ్రౌన్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ డా. రాషా అలావీ ఫోన్‌లో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఫొటోలను గుర్తించారు. అనంతరం ఆమె ఆన్‌లైన్‌ యాక్టివిటీని పరిశీలించి దేశ బహిష్కరణ వేటు వేశారు. గతేడాది అమెరికా విశ్వవిద్యాలయ ప్రాంగణాల్లో పాలస్తీనా మద్దతుదారుల ఆందోళనలు పెద్ద ఎత్తున జరిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ట్రంప్‌ సర్కారు విదేశీ విద్యార్థులపై కన్నెర్ర చేసింది. ఈ క్రమంలోనే పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇటీవల హార్వర్డ్‌ యూనివర్సిటీ నుంచి విదేశీ విద్యార్థుల రికార్డులను కూడా కోరింది.

తాజాగా వీసా ఇంటర్వ్యూల సమయంలోనే ‘సోషల్‌ మీడియా వెట్టింగ్‌’ను తీసుకురానుంది. దీనివల్ల విద్యార్థి వీసా ప్రాసెసింగ్‌పై పెను ప్రభావం పడటంతో పాటు అమెరికా యూనివర్సిటీలపై ఆర్థికంగానూ భారం పడనుంది. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఫారిన్‌ స్టూడెండ్‌ అడ్వైజర్‌ నివేదిక ప్రకారం.. విదేశీ విద్యార్థుల నమోదుతో అమెరికా వర్సిటీలకు ఏటా 43.8 బిలియన్‌ డాలర్ల ఆదాయం సమకూరుతోంది. ఇదిలా ఉండగా.. ఇప్పటికే బుక్‌ చేసుకొన్న విద్యార్థి వీసా ఇంటర్వ్యూలు ప్రణాళిక ప్రకారం కొనసాగనున్నాయి.